GHMC – Hydraa: గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటి వరకు వర్షాకాల సహాయక చర్యల బాధ్యతలు నిర్వర్తించిన జీహెచ్ఎంసీని ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ మున్సిపల్ శాఖ కార్యదర్శి కే. ఇలంబర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలే సహాయక చర్యల కోసం జీహెచ్ఎంసీ చేపట్టిన టెండర్ల ప్రక్రియను ఏకపక్షంగా నిర్వహించటంతో పాటు కొందరు కాంట్రాక్టర్లకే జీహెచ్ఎంసీ నిధులను సమర్పించే దిశగా ప్రక్రియ జరిగిన తతంగం బయట పడటంతో మున్సిపల్ కార్యదర్శి ఇల్లంబర్తి ఆ బాధ్యతలను బల్దియా నుంచి కట్ చేసి హైడ్రాకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
సహాయక చర్యల పేరిట అక్రమాలు
టెండర్ల ప్రక్రియలో అక్రమాలు జరిగటం, ఇష్టారాజ్యంగా వాహానాల అద్దెలను రెండింతలు పెంచిన వ్యవహారం వెలుగులోకి వచ్చినా, జీహెచ్ఎంసీ అధికారులు టెండర్లను రద్దు చేయకుండా హోల్డింగ్‌లో ఉంచటం పట్ల అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. కొందరు బడా కాంట్రాక్టర్లకే ఈ టెండర్లు దక్కేలా అధికారులు వ్యవహారించారన్న ఆరోపణలు నెలకొన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీలో ప్రతి సంవత్సరం వర్షాకాలం సహాయక చర్యల పేరిట జరుగుతున్న అక్రమాలు, దోపిడీలకు శాశ్వతంగా చెక్ పెడుతూ మున్సిపల్ కార్యదర్శి ఇలంబర్తి ఆదేశాలు జారీ చేయటంతో అడ్డగోలు అవినీతికి బ్రేక్ పడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీహెచ్ఎంసీ యాక్ట్ 1955 సెక్షన్ 374బి ప్రకారం ఈ బాధ్యతలను జీహెచ్ఎంసీ నుంచి హైడ్రాకు మార్చుతున్నట్లు కార్యదర్శి ఇల్లంబర్తి ఆదేశాల్లో పేర్కొన్నారు.
Also Read: Bala Bharosa: బాల భరోసా పేరుతో కొత్త స్కీం.. మంత్రి సీతక్కవెల్లడి!
నాలాల వద్ద ప్రమాదాల నివారణ చర్యలు
వర్షకాలం సహాయక చర్యలతో పాటు వాటర్ లాగింగ్ పాయింట్లలో మోటార్ల సహాయంతో నీటిని తోడేయటం, అవసరమైతే అలాంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు, నాలా సేఫ్టీ, నాలా ఆడిట్, నాలాల వద్ద ప్రమాదాల నివారణ చర్యలు, వర్షాకాలం తర్వాత నాలాల్లోని పూడికతీత పనులు, నాలాల నుంచి బయటకు తీసిన పూడికను రోడ్లపై నుంచి తరలించటం, నాలాల్లో వరద నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులను తొలగించటం, చెట్లు విరిగిపడినా, కరెంటు స్తంభాలు నేలకొరిగినా, అవసరమైన సహాయక చర్యలన్నింటిని హైడ్రా చేపట్టనున్నట్లు కార్యదర్శి ఇలంబర్తి ఆదేశాల్లో పేర్కొన్నారు. హైడ్రా ఈ సహాయక చర్యలన్నీ జలమండలి, విద్యుత్ శాఖలను సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టాలని కార్యదర్శి ఆదేశాల్లో పేర్కొన్నారు.
Also Read: Home Minister: అందరి కళ్లు ‘హోం’ పైనే.. ఎవరిని వరిస్తుందో?