Home Minister: కాంగ్రెస్ ప్రభుత్వంలో ‘హోం’ మంత్రి పదవిపై ఉత్కంఠ నెల కొన్నది. కీలకమైన పోర్ట్ పోలియో ఎవరికి లభిస్తుందోనని మంత్రులు, ఎమ్మెల్యేల్లోనూ ఆసక్తి నెలకొన్నది. లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు వంటి కీలకమైన విధులు కలిగిన ఈ శాఖను కొత్త మంత్రులకు ఇస్తారా? పాత మంత్రులకు కేటాయిస్తారా? అనేది సస్పెన్స్‌గా మారింది. ఇక కొత్త మంత్రులకు ఎలాంటి శాఖలు ఇవ్వాలి? పాత మంత్రుల నుంచి కొన్ని తొలగించి ఇవ్వాలా? తన వద్ద పెండింగ్‌లో ఉన్న శాఖలను కేటాయించాలా? షప్లింగ్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై సీఎం ఏఐసీసీ (AICC) అగ్రనేతలతో చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లారు. శాఖలపై అధిష్టానం అభిప్రాయాన్ని తీసుకోనున్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక మంత్రులందరితో సీఎం ప్రత్యేకమైన మీటింగ్ నిర్వహించనున్నారు. పాత మంత్రులకు ఉన్న శాఖలపై అభిప్రాయాలు, కొత్తగా కేటాయించాల్సిన డిపార్ట్మెంట్లపై చర్చించనున్నారు. ప్రతి మంత్రి నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. ఆ తర్వాత శాఖల కేటాయింపు జరగనున్నదని ఓ నేత తెలిపారు.
Read Also- Gaddar Film Awards: ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్’.. షీల్డ్ చూశారా!
ముగ్గురు సీనియర్ల నుంచి శాఖల మార్పు?
సీఎం వద్ద ఉన్న శాఖల్లోని కొన్ని ఇతర మంత్రులకు కేటాయించడంతో పాటు సర్కార్‌లోని ముగ్గురు కీలక మంత్రుల నుంచి కూడా శాఖలు మారనున్నట్లు విశ్వసనీయ వర్గాలు ద్వారా తెలిసింది. ఆ ముగ్గురూ దక్షిణ తెలంగాణ మంత్రులు కావడం గమనార్హం. ప్రస్తుతం ఉన్న శాఖలను మార్చాలని ఏఐసీసీ నేతలు సీఎంకు సూచించినట్లు తెలిసింది. సీనియర్ల నుంచి తొలగించే ఆ శాఖలు కొత్త మంత్రులకు ఇస్తారా? పాత మంత్రులకే అడ్జెస్ట్ చేస్తారనేదానిపై కూడా స్పష్టత రావాల్సి ఉన్నది. మంగళ, బుధ వారాల్లోనే శాఖల కేటాయింపు జరిగే ఛాన్స్ ఉన్నది. అయితే కొత్త మంత్రుల మాత్రం తమకు ఏ శాఖలు ఇచ్చినా పర్వాలేదని స్పష్టం చేస్తున్నారు. ప్రత్యేకంగా తామేమీ కోరుకోవడం లేదని, ఏ శాఖలు ఇచ్చినా సమర్ధవంతంగా పనిచేస్తామని తేల్చి చెబుతున్నారు. మంత్రి గడ్డం వివేక్ (Gaddam Vivek) మాత్రం సోమవారం ఏఐసీసీ ప్రెసిడెండ్ మల్లికార్జున ఖర్గేను కలిశారు. తన తండ్రి కాకా నిర్వహించిన శాఖలు, వాటి పనితీరు, ప్రక్షాళన, ఫాలసీలపై వివరించారు. తనకు కూడా ఏ శాఖ ఇచ్చినా ప్రత్యేక మార్పులు తీసుకొస్తానని వివేక్ హామీ ఇచ్చారు.
సీఎం, కేసీ, కనుగోలు భేటీ..?
సోమవారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు ప్రత్యేకంగా భేటీ అయినట్లు తెలిసింది. శాఖల కేటాయింపుతో పాటు టీపీసీసీ కార్యవర్గం పనితీరు, మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్ల ఫర్మామెన్స్‌లపై చర్చించినట్లు తెలిసింది. ఒక్కో శాఖ, దాని విధి, విధానాలు వంటి వాటిపై క్షుణ్ణంగా స్క్రీనింగ్ చేశారు. మంత్రుల పేర్లు, శాఖలుతో ప్రాథమిక డాక్యుమెంట్‌ను కూడా తయారు చేశారు. రాహుల్ గాంధీ పరిశీలన తర్వాత అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉన్నది. ఇక త్వరలోనే టీపీసీసీ కార్యవర్గం ప్రకటనతో పాటు ప్రత్యేకమైన మీటింగ్ నిర్వహించే అవకాశం ఉన్నది. ఆ మీటింగ్‌లో భవిష్యత్ ప్రణాళిక, నేతల పనితీరు, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు, తదితర అంశాలపై డిస్కషన్ జరగనున్నది.
అన్నింటికీ ఢిల్లీయేనా..?
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన ప్రతి నిర్ణయానికి ఢిల్లీకి వెళ్లే తేల్చుకోవాలా? అని రాష్ట్ర నాయకుల్లో కొందరు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కేబినెట్ ప్రాసెస్ లేట్ అయింది. శాఖల్లోనూ ఇంత జాప్యం తగదని సూచిస్తున్నారు. కేబినెట్ విస్తరణ, శాఖలు కేటాయింపు వంటివన్నీ ఢిల్లీ డిసైడ్ చేయడమేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక నాయకత్వానికి సమాచారం ఇవ్వకుండానే ఢిల్లీ నుంచి నిర్ణయాలు జరగడాన్ని తప్పుబడుతున్నారు. సీఎం తేల్చాల్సిన అంశాలను ఏఐసీసీ నిర్ణయించడంపై కొందరు సీనియర్లు కూడా గుర్రుగా ఉన్నారు.
Read Also- YSRCP: సజ్జలకు మూడినట్టేనా.. అరెస్ట్ తప్పదా?