GHMC: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మెయిన్ రోడ్లు, సబ్ రోడ్లు, కాలనీ రోడ్లతో పాటు సుమారు 1700 పై చిలుకు బస్తీలు, మురికివాడల్లో వెలుగులు నింపేందుకు స్ట్రీట్ లైట్ల మెరుగైన నిర్వహణకు జీహెచ్ఎంసీ(GHMC) ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా స్ట్రీట్ లైట్లకు సంబంధించి గతంలో నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించినా ఆశించిన స్థాయిలో మెయింటనెన్స్ సాగలేదు. దీంతో జీహెచ్ఎంసీ (GHMC)ఏడేళ్ల క్రితం సిటీలోని అన్ని ప్రాంతాల్లోని లైట్లను ఎల్ఈడీ(LED) లైట్లుగా మార్చటంతో పాటు మెరుగైన నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషీయన్సీ సర్వీస్ లిమిటెడ్(Energy Efficiency Service Limited) కు అప్పగించినా జీహెచ్ఎంసీ ఆశించిన స్థాయిలో నిర్వహణ సాగలేదు.
అంతర్జాతీయ స్థాయిలో
దీంతో స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతల నుంచి ఈఈఎస్ఎల్ ను తప్పించి, ఔటర్ రింగ్ రోడ్డు(ORR), ఢిల్లీ తరహాలో పేరుగాంచిన ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు జీహెచ్ఎంసీ(GHMC) సిద్దమైంది. ఇందుకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో స్ట్రీట్ లైట్ల మెయింటనెన్స్(Street light maintenance) లో అత్యాధునిక పద్దతులను అవలంభిస్తున్న ఏజెన్సీల నుంచి ఇటీవలే ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్టు(ఈఓఐ)లను ఆహ్వానించింది. దీంతో ఒక్కో లైటు వారీగా, ఒక్కో స్ట్రెచ్ వారీగా లైట్ల నిర్వహణ చేపట్టడంతో పాటు ఎక్కడా లైటు వెలగపోయినా, దాన్ని సులువుగా కనుగొనేందుకు వీలుగా మెరుగైన నిర్వహణ టెక్నాలజీ కల్గిన పిలిప్స్, కాంప్ట్రన్ గ్రీవ్స్ వంటి మరో మూడు సంస్థలకు ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్టులు (ఈఓఐ) సమర్పించాయి.
Also Read: Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు
స్టాండింగ్ కమిటీ తీర్మానం
తొలుత ప్రైవేటు సంస్థలకు ఏడేళ్లకు నిర్వహణ బాధ్యతలను సుమారు రూ. 900 కోట్ల పై చిలుకుకు అప్పగించాలని అధికారులు భావించినా, అందుకు స్టాండింగ్ కమిటీ అభ్యంతరం తెలపటంతో కమిటీ ఆదేశాల మేరకు అయిదేళ్లు నిర్వహణ బాధ్యతలను రూ. 693 కోట్లకు అప్పగించాలని కమిటీ తీర్మానం చేయటంతో జీహెచ్ఎంసీ(GHMC) అధికారులు ఇప్పటికే ఈఓఐ(EOI)లు సమర్పించిన ఏజెన్సీల వివరాలు, స్టాండింగ్ కమిటీ తీర్మానం వంటివి టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు అనుమతి కోరుతూ సర్కారుకు పంపారు. సర్కారు నుంచి అనుమతి రాగానే, టెండర్ల ప్రక్రియ చేపట్టి, ప్రైవేటు సంస్థకు స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతలను అప్పగించనున్నారు. కొత్తగా ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించనున్న నిర్వహణ బాధ్యతల్లో జీహెచ్ఎంసీ కొన్ని నిబంధనలను కూడా విధించింది. నిర్వహణ బాధ్యతలు ఎంత పక్కాగా ఉండాలంటే సిటీలో ఏ ఒక్క స్ట్రీట్ లైటు వెలగకపోయినా, ఆ లైటుకు అయ్యే విద్యుత్ ఖర్చు ఆదా కావాలన్న నిబంధన విధించింది. అంతేగాక, వెలగని లైటును టెక్నాలజీ పరంగా క్షణాల్లో కనుగోని వెంటనే లైటు వెలగకపోవటానికి కారణాలను కనుగొని రిపేర్లు చేయాలన్న నిబంధనను విధించినట్లు సమాచారం.
గ్రేటర్ లో మొత్తం స్ట్రీట్ లైట్లు 4.77.424
గ్రేటర్ హైదరాబాద్ లోని ఆరు జోన్లు, 30 సర్కిళ్లలో కలిపి 3 లక్షల 90 వేల 251 విద్యుత్ స్తంభాలకు దాదాపు 4 లక్షల 77 వేల 424 స్ట్రీట్ లైట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ లైట్లకు కరెంటు కనెక్షన్ ఇచ్చేలా దాదాపు 8 వేల 733 కిలోమీటర్ల పొడువున విద్యుత్ వైర్లున్నాయి. వీటిలో 6 వేల 786 లైట్లకు సాయంత్రం ఆరు గంటలకు ఆటోమెటిక్ గా ఆన్ అయి, తిరిగి ఉదయం ఆరు గంటలకు ఆఫ్ అయ్యేలా టైమర్లు, ఎంసీబీ బోర్డులున్నాయి. దీంతో పాటు కంట్రోల్ కమాండ్ మానిటరింగ్ బోర్డు (సీసీఎంఎస్ బీ)లు 24 వేల 840 వరకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ లైట్లన్నింటినీ ఎల్ఈడీ లైట్లుగా మార్చారు. ఈ లైట్లకు గాను జీహెచ్ఎంసీ ప్రతి నెల రూ. 8 కోట్ల వరకు కరెంటు బిల్లును చెల్లిస్తుంది.
Also Read: VV Vinayak: చాలా రోజుల తర్వాత దర్శకుడు వివి వినాయక్ ఇలా..!