GHMC Engineers: జీహెచ్ఎంసీ ( GHMC) లో ఇంజినీర్ల అక్రమాలు ఒక్కోక్కటిగా వరుసగా వెలుగుచూస్తున్నాయి. చేయాల్సిన పనులకు లంచాలు అడుగుతూ అడ్డంగా అవినీతి నిరోధక శాఖకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వారిలో కూడా ఇంజినీర్లే (Engineers) ఎక్కువ మంది ఉండటం గమనార్హం. ఏ అక్రమం జరిగినా, ఎలాంటి అవకతవకలు వెలుగులోకి వచ్చినా కమిషనర్ ఒక్కోక్కరిపై ఒక్కో రకమైన చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. క్వాలిటీ కంట్రోల్ సెల్‌లో విధులు నిర్వర్తించే ఓ ఇంజినీర్ ఇటీవలే లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సంగతి తెలిసిందే. తాజాగా ఐఎస్ సదన్ డివిజన్‌లోని సైదాబాద్ ప్రాంతంలో సీసీ రోడ్డు వేసేందుకు టెండర్ల ప్రక్రియను చేపట్టిన తర్వాత పనులు చేయకుండానే రూ.9.90 లక్షల బిల్లులు కాజేసిన ఘటన వెలుగు చూసిన సంగతి తెలిసిందే.
గతంలో కూడా ఇదే తరహాలో ఇంజినీరింగ్, ట్రాన్స్‌పోర్ట్ విభాగాల్లో అక్రమాలు, అవకతవకలు వెలుగుచూసిన నేపథ్యంలో బాధ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం వంటి శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజాధానాన్ని లూటీ చేసినందుకు క్రిమినల్ కేసులు పెట్టిన సందర్భాలున్నాయి. కానీ, తాజాగా వేయాల్సిన రోడ్డు వేకుండానే కాంట్రాక్టర్ తో కుమ్మక్కై బిల్లులు కాజేసిన వ్యవహారంలో డీఈపై సస్పెన్షన్ వేటు, ఏఈపై విధుల నుంచి తొలగింపు వంటి చర్యలు తీసుకున్న కమిషనర్ కర్ణన్ (Karnan) వారిపై క్రిమినల్ కేసులు ఎందుకు నమోదు చేయించలేదన్నది హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: Allegations Of Officials Misusing: అద్దె వాహనాల పేరుతో బిల్లులు.. తిరగకున్నా తిరిగినట్లు రికార్డ్!
నిధులు దుర్వినియోగం
గతంలో ఇదే తరహాలో నాలా పూడికతీత పనుల్లోనూ భారీగా అవినీతి జరిగినట్లు గుర్తించిన విజిలెన్స్ అప్పటి కమిషనర్లకు నివేదికలను సమర్పిస్తే, వారిపై సస్పెన్షన్ వేటు వేయటంతో పాటు వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయించిన ఘటనలున్నాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.1కోట్ల నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 13 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ (Engineers) ఇంజినీర్లపై విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించిన అప్పటి కమిషనర్ జనార్థన్ రెడ్డి, నివేదికలు రాగానే 13 మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఆ తర్వాత నాలా పూడికతీత పనుల చేపట్టకుండానే బిల్లులు క్లెయిమ్ చేసినట్లు, తీసిని పూడికను డంపింగ్ యార్డుకు తరలించినట్లు గ్యారేజీల్లో మూలన పడ్డ ఆటోలు, ద్విచక్రవాహనాల నెంబర్‌లను వేసి బిల్లులు క్లెయిమ్ చేసిన స్కామ్‌లో ట్రాన్స్ పోర్టు విభాగం అధికారులపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు వారిపై సీసీఎస్‌లో క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసిన సందర్భాలుండగా, తాజాగా వెలుగుచూసిన వేయని రోడ్డుకు బిల్లులు కాజేసీన ఘటనలో కమిషనర్ చర్యలు ఇంజినీర్లపై కేవలం సస్పెన్షన్ వేటు, ఒకరిని విధుల నుంచి తొలగింపునకే పరిమితం కావటం హాట్ టాపిక్‌గా మారింది. క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్లను ఫోర్జరీ చేయడంతో పాటు పని చేయకుండానే ప్రజాధనాన్ని లూటీ చేసిన ఇంజినీర్లపై కమిషనర్ క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలేదన్న విషయం జీహెచ్ఎంసీ వర్గాల్లో బహిరంగ రహస్యంగా మారింది.
Also Read: Seethakka: ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు
150 కోట్ల దుర్వినియోగంపై చర్యలేవీ
ఇటీవల జీహెచ్ఎంసీకి( GHMC) కమిషనర్‌గా విధులు నిర్వర్తించిన ఇలంబర్తి కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు చెల్లించే క్రమంలో నగరంలోని పలు కూడళ్లు, జంక్షన్లను వివిధ పండుగలు, పంద్రాగస్టు, జనవరి 26, రాష్ట్ర అవతరణ దినోత్సవం వంటి ప్రత్యేక సందర్భాల్లో చేపట్టిన సుందరీకరణ పనులు, విద్యుత్ దీపాల డేకరేషన్‌కు రెండేళ్ల వ్యవధిలోనే రూ. 400 కోట్ల బిల్లులు కావడాన్ని గమనించారు. దీనిపై విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించగా, క్లెయిమ్ చేసిన మొత్తం రూ. 400 కోట్ల బిల్లుల్లో దాదాపు రూ.150 కోట్ల బిల్లులు చేయని పనులకు క్లెయిమ్ చేసినట్లు తెలిసింది. ఇందులో కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ మెయింటనెన్స్ అధికారులు చేతి వాటాన్ని ప్రదర్శించినట్లు నివేదికలను బట్టబయలు చేయటంతో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భావించిన సమయంలో కమిషనర్ ఇలంబర్తి బదిలీ అయి వెళ్లిపోయారు. ఇప్పటికీ ఆ నివేదికలపై కొత్త కమిషనర్ కర్ణన్ చర్యలు తీసుకోలేదు.
బినామీలతో కాంట్రాక్టర్ల అవతారమెత్తిన ఇంజినీర్లు
పనుల కేటాయింపులు, బిల్లుల చెల్లింపుల్లో అందినంత దోచుకుంటున్న ఇంజినీర్లు ఇదీ చాలక బినామీలతో కాంట్రాక్టర్ల అవతారమెత్తి అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మాసాబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్ నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ కమ్ రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు వంటి పనులను స్థానిక ఖైరతాబాద్ మున్సిపల్ ఆఫీసులో విధులు నిర్వర్తించే ఓ ఇంజినీర్ తన బినామీలకు పనులను కేటాయించిన చేయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
కొద్ది కాలం క్రితం వరకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని మెయింటనెన్స్ విభాగంలో విధులు నిర్వర్తించి, ప్రస్తుతం ఖైరతాబాద్ సర్కిల్‌కు బదిలీపై వెళ్లిన ఇంజినీర్ సైతం బినామీలతో ఎలక్షన్ పనులు చేయించడంతో పాటు ప్రధాన కార్యాలయంలో మెయింటనెన్స్ పేరిట వివిధ రకాల పనులను చేయిస్తూ భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. నేటికీ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఫ్లోర్ స్టెబిలిటీ పనుల పేరిట భారీగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు వాదనలున్నాయి. ఇప్పటికే కొందరు ఇంజినీర్లు తమ పాపం పండి ఏసీబీకి గానీ, ఉన్నతాధికారులకు గానీ చిక్కగా, అసలు చిక్కకుండా ఎంతో వ్యూహాత్మకంగా అడ్డదారిలో అక్రమార్జనకు పాల్పడుతున్న ఇంజినీర్లు ఇంకా డజన్ల సంఖ్యలో ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: Raja Raghuvanshi Case: హనీమూన్ కేసులో భారీ ట్విస్ట్.. భర్తతో పాటు మరో స్త్రీ హత్యకు కుట్ర!