GHMC: గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలోని కోటిన్నర మంది జనాభాకు అవసరాలకు తగిన విధంగా అభివృద్ది, అత్యవసర సేవలందిస్తున్న జీహెచ్ఎంసీ (GHMC)లో పాలక మండలికి అధికారం ఇంకా 60 రోజులు మాత్రమే మిగిలి ఉంది. 2021లో కొలువుదీరిన జీహెచ్ఎంసీ (GHMC) పాలక మండలి గడువు వచ్చే ఫిబ్రవరి 10తో ముగియనుంది. ఇంకా నెలన్నర సమయం మాత్రమే ఉండటంతో వార్డులు డీలిమిటేషన్‌పై కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సేకరించేందుకు జీహెచ్ఎంసీ సిద్దమైంది. 16న కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత 18న స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి బడ్జెట్‌పై చర్చించాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం విలీనమైన 27 సర్కిళ్లను కలుపుకుని రూపకల్పన చేస్తున్న జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ 2026-27పై స్టాండింగ్ కమిటీలో చర్చ జరపనున్నట్లు తెలిసింది.
మేయర్‌పై విమర్శలు
కనీసం చివరి రోజుల్లోనైనా తనకు సహకరించాలని మేయర్ ఇప్పటికే పలు సార్లు అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగానే జోనల్ కమిషనర్లకు అడిషనల్ పవర్స్ అప్పగించేలా కమిషనర్ పై వత్తిడి చేసినట్లు సమాచారం. 2020 కరోనా సెకండ్ వేవ్ విపత్కర సమయంలో డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ(GHMC) ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించింది. బంజారాహిల్స్ డివిజన్ నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్‌గా గెలిచిన గద్వాల విజయలక్ష్మి ఆ తర్వాత 2021 ఫిబ్రవరి 11న మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి మేయర్ తరుచూ వివాదాల్లోనే కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు మేయర్ కనీసం తన సొంత పార్టీ కార్పొరేటర్లు కూడా కలుపుకుని పోవటం లేదని బహిరంగంగానే విమర్శలు చేశారు.
Also Read: GHMC BJP: జీహెచ్‌ఎంసీలో వార్డుల డీలిమిటేషన్‌పై భగ్గుమన్న బీజేపీ.. అభ్యంతరాలు ఇవే
డిప్యూటీ మేయర్‌ను సైతం
కొన్ని సందర్భాల్లో తన సొంత పార్టీకి చెందిన డిప్యూటీ మేయర్ శ్రీలతను సైతం మేయర్ విజయలక్ష్మి పక్కనబెట్టారన్న విమర్శల పాలైన సందర్భాలున్నాయి. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని సరైన రీతిలో నడపటంలో తొలుత ఆమెలో కొంత కమాండింగ్ కొరవడినా, ఆ తర్వాత సమర్థవంతంగా కౌన్సిల్ సమావేశాలను నిర్వహిస్తూ వచ్చారు. కానీ, ప్రతి సమావేశంలో సభ్యుల ప్రశ్నలను దాటవేస్తూ వచ్చిన మేయర్ అధికారులను కాపాడుకునే ప్రయత్నం చేశారన్న విమర్శలు నేటికీ ఉన్నాయి. ఇలా నాలుగున్నరేళ్లలో మేయర్ అధ్యక్షతలోని కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మానాల్లో ఎక్కువ అర్థరహితమైనవేనన్న విమర్శలు లేకపోలేవు.
సిద్ధమవుతున్న కమలనాథులు
ముఖ్యంగా జీహెచ్ఎంసీలోకి 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం, వార్డుల డీలిమిటేషన్‌పై ఈ నెల 16న జరగనున్న కౌన్సిల్‌లో బలంగా గళం విన్పించేందుకు బీజేపీ కార్పొరేర్లు సిద్దమవుతున్నట్లు సమాచారం. వార్డుల పునర్విభజనపై జీహెచ్ఎంసీ అభ్యంతరాలు, సలహాలు స్వీకరిస్తున్న ఈ నెల 10న మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని కలిసిన పలువురు బీజేపీ కార్పొరేటర్లు పునర్విభజన అశాస్త్రీయంగా, ఒక వర్గానికి రాజకీయ ప్రయోజనాన్ని చేకూర్చేలా జరుగుతుందని ఆరోపించారు. అంతటితో ఆగని బీజేపీ కార్పొరేటర్లు, నేతలు తాజాగా గురువారం కూడా కమిషనర్‌ను కలిసి ఇష్టారాజ్యంగా పునర్విభజన చేస్తున్నారని తమ గళాన్ని విన్పించారు. ఈ నెల 16న జరగనున్న కౌన్సిల్ సమావేశంలో కూడా పునర్విభజనపై నిరసనలు చేపట్టేందుకు బీజేపీ వ్యూహం సిద్దం చేస్తున్నట్లు సమాచారం.

