GHMC: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు అవసరమైన అభివృద్ది, మౌలిక వసతులతో పాటు అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీ పాలక మండలి కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ జనరల్ బాడీ సమావేశం ఈ పాలక మండలికి చిట్టచివరి సమావేశం కావటంతో సమావేశం ఎలా జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన ఉదయం పదిన్నర గంటలకు ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో మొదలయ్యే ఈ సమావేశంలో గడిచిన నాలుగున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ది పనులు, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని అధికార పార్టీ సభ్యులు భావిస్తుండగా, నాలుగున్నరేళ్లలో పాలక మండలి వైఫల్యాలను సభా ముఖ్యంగా నిలదీసేందుకు బీజేపీ కార్పొరేటర్లు వ్యూహాం సిద్దం చేసినట్లు సమాచారం. తొలుత వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని ఆ పార్టీ ప్లాన్ చేసినట్లు తెలిసింది.
ఆ పార్టీల అధిష్టానాలు దిశా నిర్దేశం
సిటీలో నెలకొన్న సమస్యలు, దీర్ఘకాలికంగా పరిష్కారం కానీ సమస్యలతో మౌలిక వసతులు వంటి అంశాలపై ప్రశ్నించేందుకు ఎంఐఎం పార్టీ సిద్దమైనట్లు తెలుస్తుంది. కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన తీరుపై సోమవారం బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లకు ఆ పార్టీల అధిష్టానాలు దిశా నిర్దేశం చేశాయి. ఈ పాలక మండలి చివరి సమావేశం అయి ఉండవచ్చునని పలువురు పాలక మండలి సభ్యులు వ్యాఖ్యానిస్తుండగా, వచ్చే జనవరి మాసంలో మరో సారి రానున్న ఆర్తిక సంవత్సరం (2026-27) కు సంబంధించిన వార్షిక బడ్జెట్ పై స్పెషల్ కౌన్సిల్ నిర్వహించే అవకాశాలున్నట్లు సమాచారం. జరగనున్న కౌన్సిల్ సమావేశానికి మొత్తం 46 అంశాలతో కూడిన అజెండాను అధికారులు సిద్దం చేశారు.
Also Read: GHMC: అధికార పార్టీని ఇరికించేందుకు బీజేపీ బీఆర్ఎస్ భారీ స్కెచ్..!
సెక్రటరీకి 95 ప్రశ్నలు
ఈ సమావేశానికి సంబంధించి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు చెందిన మొత్తం 145 మంది సభ్యుల నుంచి సెక్రటరీకి 95 ప్రశ్నలు అందినట్లు సమాచారం. కానీ వీటిలో అధికారుల నుంచి జవాబు రాబట్టేందుకు మేయర్ 20 నుంచి 25 ప్రశ్నలను ఎంపిక చేసినట్లు తెలిసింది. రానున్న ఆర్థిక సంవత్సరం (2026-27)నకు సంబంధించిన వార్షిక బడ్జెట్ ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. కౌన్సిల్ సమావేశంలో భాగంగా పాలకమండలి సభ్యులు, మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్లతో ఫొటో షూట్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. నాలుగున్నరేళ్లలో పలు సార్లు రసాభాసగా జరిగిన కౌన్సిల్ చిట్టచివరి సమావేశం మంగళవారం ఎలా సాగుతుందన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
ఫిబ్రవరి 10 లాస్ట్ డే
2020 డిసెంబర్ ఎన్నికల్లో గెలిచి, 2021 ఫిబ్రవరిలో కొలువుదీరిన ఈ పాలక మండలి గడువు వచ్చే ఫిబ్రవరి 10వ తేదీతో పాలక మండలి అధికార పర్యాయం ముగియనుంది. జరగనున్న కౌన్సిల్ జనరల్ బాడి చివరి సమావేశంలో గడిచిన అయిదేళ్లలో నగరంలో చేపట్టిన పలు అభివృద్ది పనులపై, పరిపాలన పరంగా తీసుకువచ్చిన సరి కొత్త సంస్కరణలపై అధికార పార్టీ సభ్యులతో పాటు ఇతర పార్టీల వారిగా సభ్యులకు మాట్లాడే అవకాశమివ్వనున్నట్లు తెలిసింది. పాలక మండలి గడువు ముగియగానే ఫిబ్రవరి 11 నుంచి జీహెచ్ఎంసీలో స్పెషలాఫీసర్ పాలక మొదలుకానుంది. ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో మేయర్ ప్రసంగం, ప్రశ్నోత్తరాల పర్వం వంటివి నిర్వహించనున్నట్లు తెలిసింది.
సమస్యలపై గళం విప్పేందుకు మజ్లీస్ పార్టీ
హెచ్ సిటీ పనులు, ఎస్ఆర్ డీపీ పనులు, దశాబ్దాలుగా వివాదంగా ముడిపడి ఉన్న ప్రధాన కార్యాలయంలో పరిష్కారమైన విగ్రహాల పంచాయతీతో పాటు స్ట్రీట్ లైట్ల మెరుగైన నిర్వహణకు తీసుకున్న నిర్ణయాలు, ఇటీవల ప్రారంభించిన ఇందిరమ్మ బ్రేక్ ఫాస్ట్ క్యాంటీన్లతో పాటు ఈ సారి బతుకమ్మకు గిన్నీస్ రికార్డు ఆఫ్ వరల్డ్ లో స్థానం దక్కటం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సమస్యలపై గళం విప్పేందుకు మజ్లీస్ పార్టీ సిద్దమైనట్లు, అధికార పార్టీని ఇరకాటం పెట్టేందుకు కమలనాథులు వ్యూహాన్ని సిద్దం చేస్తున్నట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి హెచ్ఎండీఏ, అడిషనల్ కలెక్టర్లను కూడా ఆహ్వానించాలన్న అంశంపై ఇటీవలే ప్రధాన కార్యాలయంలో ఇటీవలే నిరసన చేపట్టిన బీజేపీ మంగళవారం జరగనున్న కౌన్సిల్ సమావేశంలో ఇదే విషయంపై గట్టిగా ప్రశ్నించేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రజాసమస్యలపై నిలదీసేందుకు ఇప్పటికే ప్రశ్నలను సమర్పించినట్లు తెలిసింది.
పార్టీల వారీగా బలాబలాలు
బీఆర్ఎస్- 40
ఎంఐఎం- 40
బీజేపీ – 41
కాంగ్రెస్ – 24
———————
మొత్తం 145
———————
Also Read: GHMC: మొండి బకాయిల పై జీహెచ్ఎంసీ సంచలన నిర్ణయం.. అందుకు వ్యూహం సిద్ధం

