Swetcha Effect: గ్రేటర్ లో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్, రద్దీకి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన హెచ్ సిటీ-1 పనుల (H City-1 works) స్థల సేకరణకు క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు, జీహెచ్ఎంసీలోని ఆర్థిక సంక్షోభం కారణంగా ఎదురవుతున్న నిధులలేమీ పై (Swetcha Effect) ‘స్వేచ్ఛ’ పత్రిక ఆర్థిక భారం..అలసత్వం’ శీర్షికతో ప్రచురించిన కథనానికి జీహెచ్ఎంసీ అధికారుల నుంచి వినూత్న స్పందన వచ్చింది. ఈ పనులను ముందుకు తీసుకెళ్లేందుకు, వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు గడిచిన నాలుగు వారాల నుంచి వీక్లీ సమీక్షలు నిర్వహించినా, ఫలితం లేకపోవటంతో హెచ్ సిటీ పనుల్లో వేగం పెంచేందుకు నేరుగా కమిషనర్ రంగంలోకి దిగినట్లు సమాచారం.
కేబీఆర్ పార్కు చుట్టూ పర్యటన
ఇప్పటి వరకు వారానికోసారి సమీక్షించిన కమిషనర్ ఇకపై డైలీ హెచ్ సిటీ పనులపై మానిటరింగ్ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఉదయం నుంచి కమిషనర్ ఆర్.వి. కర్ణన్, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, చీఫ్ ఇంజనీర్ భాస్కర్ రెడ్డిలు సుమారు రెండు గంటల పాటు కేబీఆర్ పార్కు చుట్టూ పర్యటించారు. కేబీఆర్ చుట్టూ రూ. 1090 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఆరు స్టీల్ ఫ్లై ఓవర్లు, మరో ఆరు అండర్ పాస్ లకు క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను కమిషనర్ పరిశీలించారు. హెచ్ సిటీ పనులు చేపట్టేందుకు కేబీఆర్ పార్కు చుట్టూ మొత్తం నాలుగు వందల పై చిలుకు ఆస్తుల నుంచి స్థలాలను సేకరించాల్సి ఉంది.
Also Read: Ram Gopal Varma: అభిమానులకు రామ్ గోపాల్ వర్మ పెద్ద పరీక్షే పెట్టాడుగా.. అదేంటంటే?
జీహెచ్ఎంసీ సుమారు 269 ఆస్తులకు మార్కింగ్
ఇందులో భాగంగా ఇప్పటికే జీహెచ్ఎంసీ సుమారు 269 ఆస్తులకు మార్కింగ్ కూడా చేసింది. పలువురు సినీ సెలబ్రిటీలు, రాజకీయ, వ్యాపార వేత్తలతో పాటు మరి కొందరికి చెందిన స్థలాలున్నాయి. కేబీఆర్ పార్కు ఎకో సెన్సిటీవ్ జోన్ కావటంతో ఈ పనుల కారణంగా పార్కు పచ్చదనం, అందులోని వన్యప్రాణులకు ముప్పు పొంచి ఉందంటూ స్థల సేకరణను సవాలు చేస్తూ ముగ్గురు వ్యక్తులు కోర్టును ఆశ్రయించటంతో స్థల సేకరణ స్పీడ్ తగ్గింది.
కానీ కోర్టు పరిధిలోని లేని ప్రాంతంలో హెచ్ సిటీ పనులు మొదలు పెట్టాలని కమిషనర్ నెల రోజుల క్రితమే ఆదేశాలు జారీ చేసినా, ఎందుకు అమలు చేయలేదని కమిషనర్ ప్రశ్నించినట్లు సమాచారం. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి అనుమతి కోసం సర్కారుకు పంపగా, ఇటీవలే సర్కారు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు ఇంజనీర్లు వివరించగా, ఇంకా పనులెందుకు ప్రారంభించలేదని కమిషనర్ తీవ్ర స్థాయిలో అసహనాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. టెండర్ల ప్రక్రియ పూర్తయి, ఏజెన్సీలు ఖరారైన తర్వాత పనులెందుకు చేపట్టలేదని కమిషనర్ ఇంజనీర్లను ఘాటుగానే ప్రశ్నించినట్లు విశ్వసనీయ సమాచారం.
ప్రధాన కార్యాలయంలో సమీక్ష
కేబీఆర్ పార్కు చుట్టూ పర్యటనానంతరం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ప్రధాన కార్యాలయంలో ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, స్థల సేకరణ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో చీఫ్ ఇంజనీర్ భాస్కర్ రెడ్డి పని తీరుపై కమిషనర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా తాను నేరుగా గత నాలుగు వారాలుగా వారానికోసారి సమీక్షలు నిర్వహిస్తున్నా, దాని ఎఫెక్టు ఏమిటీ? అని ప్రశ్నించినట్లు తెలిసింది.
ఇకపై ప్రతి జోన్ లో జరగనున్న హెచ్ సిటీ పనులను నేరుగా జోనల్ కమిషనర్లు కూడా పర్యవేక్షించాలని, వారి ప్రమేయం తప్పకుండా ఉండాలని సూచించినట్లు సమాచారం. ఈ పనులపై జోనల్ కమిషనర్లు వీక్లీ రిపోర్టులు సమర్పించాలని సూచించారు. యుటిలిటీల బదలాయింపు వంటి విషయాలకు సంబంధించి జోనల్ కమిషనర్లు ఆయా ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని కమిషనర్ సూచించినట్లు సమాచారం. ప్రాజెక్టులకు ఎలాంటి నిధుల కొరత లేదని, టెండర్లు పూర్తయిన హెచ్ సిటీ పనులకు సంబంధించి స్థల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.
పారిశుద్ధ్యమే ప్రధానం
కేబీఆర్ పార్కు పర్యటనకు ముందుకు కమిషనర్ ఆర్.వి. కర్ణన్ పారిశుద్ధ్యంపై జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, పారిశుద్ధ్య పనులపై తీవ్ర స్థాయిలో మండిపడినట్లు సమాచారం. ముఖ్యంగా వెర్నబుల్ గ్యార్బేజీ పాయింట్లు (వీజీపీ)లు లేకుండా చూడాలని సూచించారు. వీజీపీలను నిర్మూలిస్తున్నామని అధికారులు చెబుతున్నా, ఎక్కడబడితే అక్కడ చెత్త కుప్పలుగా దర్శనమిస్తుందని, ఇలాంటి పాయింట్లలో ఎట్టి పరిస్థితుల్లో ఉదయం తొమ్మిది గంటల కల్లా క్లియర్ చేయాలని ఆదేశించినట్లు తెలిసింది.
Also Read: Dasara Offer: మాస్ మసాలా ఆఫర్.. కేవలం రూ.150కే.. మేకపోతు, కేస్ బీర్లు, ఫుల్ బాటిల్!