GHMC: గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు జీహెచ్ఎంసీ (GHMC) అందిస్తున్న అత్యవసర సేవల్లో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ ఒకటి. రాజ్యాంగంలోని పౌరుల ప్రాథమిక హక్కుల ప్రకారం ఈ సర్టిఫికెట్లను స్థానిక సంస్థలు ఉచితంగా జారీ చేయాల్సి ఉన్నా, నామమాత్రపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దాన్ని ఆసరాగా చేసుకొని అడ్డదారిలో జారీ అవుతున్న సర్టిఫికెట్లకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. దేశవ్యాప్తంగా ఒకే యూనిక్ నెంబర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసి (GHMC) మాజీ కమిషనర్, ప్రస్తుత మున్సిపల్ శాఖ సెక్రెటరీ ఇలంబర్త ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది.
సీఆర్ఎస్ఆర్ఎస్ విధానం
ఇకపై (GHMC) జీహెచ్ఎంసీలో బర్త్, డెత్ సర్టిఫికెట్లన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పోర్టల్ ద్వారానే జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు జారీకి సంబంధించి జరిగిన అక్రమాలకు శాశ్వత ప్రాతిపదికన చెక్ పడినట్లు అయింది. గతంలో దేశ రాజధాని న్యూఢిల్లీలో సెన్సస్ విభాగంలో కీలకమైన పదవిలో కొనసాగిన ఇలంబర్తి ఏడేళ్ల క్రితమే జీహెచ్ఎంసీ (GHMC) బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీకి సీఆర్ఎస్ఆర్ఎస్ విధానాన్ని తీసుకురావాలని ప్రతిపాదించగా, గత సర్కార్ తిరస్కరించినట్లు సమాచారం.
కొద్ది నెలల క్రితం వరకు కూడా జీహెచ్ఎంసీ (GHMC) కమిషనర్‌గా వ్యవహరించిన ఇలంబర్తి ప్రతిపాదనలను ఎంఏయూడీ, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి పంపిన నేపథ్యంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇప్పటికే పలు రాష్ట్రాలు, మహానగరాలు, పట్టణాలు సీఆర్ఎస్ పోర్టల్ ద్వారానే బర్త్, డెత్ సర్టిఫికెట్లను జారీ చేస్తున్నాయి. ఇప్పుడు (GHMC) జీహెచ్ఎంసీ కూడా ఆ నగరాల జాబితాలో చేరినట్లు అయింది.
Also Read: GHMC: త్వరలో జీహెచ్ఎంసీలో యాక్షన్ ప్లాన్.. స్పెషల్ టీమ్‌లతో దాడులు
అక్రమాలు వెలుగు చూశాయి ఇలా..
బర్త్ డెత్ సర్టిఫికెట్ల కోసం స్థానిక సంస్థలకు చెల్లించేది నామమాత్రపు ఛార్జీలే అయినా, రూ.లక్షల్లో చేతులు మారుతూ అడ్డదారిలో సర్టిఫికెట్లు జారీ అవుతున్న విషయాలు వరుసగా బయట పడ్డాయి. బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ పారదర్శకంగా జరిగేందుకు వీలుగా ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ అధికారులు ఎన్ని సంస్కరణలు తెచ్చినా, అవి తుస్సుమంటున్నాయే తప్ప, ఆశించిన స్థాయిలో సర్టిఫికెట్ల జారీలో పారదర్శకత చోటుచేసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తడంతో పాటు గత సంవత్సరం చివరిలో హైదరాబాద్ నగరంలో హోం బర్త్ ప్రాతిపాదికన ఏకంగా 70 బర్త్ సర్టిఫికెట్లను జారీ చేయడంతో అనుమానం వచ్చిన అప్పటి కమిషనర్ ఇలంబర్తి విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించడంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
బల్దియా సీరియస్
మూతపడి ఉన్న టోలీచౌకీలోని మెట్రో హాస్పిటల్ ఒక్కటే సుమారు తప్పడు సమాచారంతో 65 బర్త్, మరో 8 డెత్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు సదరు హాస్పిటల్ రిజిస్ట్రేషన్ రద్దు చేయించడంతో పాటు నిర్వాహకులపై క్రిమినల్ కేసులు కూడా పెట్టారు. దీనికి తోడు ఫలక్ నుమాలో 3, మలక్ పేటలో మరోక బర్త్ సర్టిఫికెట్లను అడ్డదారిలో జారీ చేసినట్లు కూడా గుర్తించడంతో ఈ అక్రమాలను బల్దియా సీరియస్‌గా తీసుకొని బాధ్యులపై చర్యలు కూడా తీసుకుంది. ఇప్పుడు సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అక్రమాలకు శాశ్వతంగా తెరపడినట్టు అయింది.
Also Read: GHMC Commissioner: గ్రేటర్ హైదరాబాద్‌లో స్పెషల్ డ్రైవ్.. ఫోకస్ పెంచిన జీహెచ్ఎంసీ