Ganja Smuggler Arrested: ఒరిస్సాలో హోల్‌సేల్ గంజాయి వ్యాపారం నిర్వహిస్తూ రాష్ట్రాల మధ్య మాఫియాను నడిపిన సంగీతా సాహు అలియాస్ గీతా సాహు అరెస్టైంది. మత్తు వ్యాపారాన్ని తనదైన శైలిలో సాగిస్తూ, ఇన్‌స్టాగ్రామ్‌లో సినీ హీరోయిన్ల మాదిరిగా లైఫ్ స్టైల్ ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో తనను హైలైట్ చేసుకునేది. గంజాయి వినియోగం ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లి, అక్కడి వ్యాపారులతో ఒప్పందాలు కుదుర్చుకునేది. కానీ, చివరకు నిఘా విభాగం అడ్డుకోవడంతో లేడీ డాన్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
హోల్‌సేల్ గంజాయి వ్యాపారం
కుర్థా జిల్లా, కాళీకోట్ గ్రామానికి చెందిన సంగీతా సాహు గత నాలుగేళ్లుగా గంజాయి సరఫరాలో కీలక పాత్ర పోషించింది. భువనేశ్వర్‌కు సమీపంగా ఉండడంతో అనేక రాష్ట్రాల వ్యాపారులతో సంబంధాలు ఏర్పరచుకుని, వారికి గంజాయి సరఫరా చేసేది. ముఖ్యంగా గంజాయి వినియోగం అధికంగా ఉన్న ప్రాంతాల్లో వ్యాపార సంబంధాలు ఏర్పరచుకునే తత్వం ఆమెను లేడీ డాన్‌గా మార్చింది.
తెలంగాణలో కేసులు..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఒక కేసు, ధూల్‌పేట్‌లో నాలుగు కేసుల్లో సంగీతా నిందితురాలిగా ఉంది. ఆమె ధూల్‌పేట్‌లో 29 కేజీలు, మరో కేసులో 11.3 కేజీల గంజాయిని నిందితులకు సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. శీలాబాయ్, నేహాబాయ్, ఇష్‌కాసింగ్ తదితరులకు ఆమె గంజాయి సరఫరా చేసినట్లు విచారణలో తేలింది. వీరి వాగ్మూలాల ఆధారంగా ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీసులు ఆమెపై కేసులు నమోదు చేశారు.
అరెస్ట్ ఆపరేషన్..
తెలంగాణ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వి.బి. కమలాసన్ రెడ్డి ప్రత్యేకంగా ఓ టీమ్‌ను ఒరిస్సాకు పంపారు. నంద్యాల అంజి రెడ్డి పర్యవేక్షణలో ఎస్‌ఐ సైదులు, హెడ్ కానిస్టేబుల్ కె.శ్రీధర్, కానిస్టేబుళ్లు మహేశ్, అరుణ్, మంగలు ఒరిస్సాలోని కాళీకోట్‌కు వెళ్లి, స్థానిక పోలీసుల సహాయంతో సంగీతా సాహును అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను తెలంగాణకు తరలించి, సంబంధిత అధికారులకు అప్పగించారు.
Also Read: Bhadrachalam Tragedy: భద్రాచలంలో ఘోరం.. ఆరుగురు కూలీలు స్పాట్ డెడ్
ఈ అరెస్టుతో గంజాయి సరఫరా నెట్‌వర్క్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వి.బి. కమలాసన్ రెడ్డి, నిందితురాలిని అరెస్టు చేసి తీసుకువచ్చిన పోలీసు బృందాన్ని అభినందించారు. ఈ చర్యల ద్వారా గంజాయి వ్యాపారంపై తెలంగాణ పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తారని తెలుస్తోంది.