Bhadrachalam Tragedy: తెలంగాణలోని భద్రాచలంలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. పంచాయతీ కార్యాలయం సమీపంలో ఉన్న 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో భవనంలోని ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటీనా ఘటనాస్థలికి చేరుకుంది. శిథిలాలను జేసీబీ సాయంతో అధికారులు తొలగిస్తున్నారు.
అనుమతి లేకుండా నిర్మాణం
భవనం కూలిపోవడానికి సంబంధించి స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. అయితే అప్పటికే ఉన్న పాత భవనంపై 4 అంతస్తులు నిర్మిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా పీఠం పేరుతో మఠం నిర్మించాలని భావించిన ఓ అర్చకుడు.. ఇలా పాత భవనంపై నాలుగు అంతస్థులు నిర్మిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారంటూ గతంలోనే పంచాయితీ అధికారులు నిర్మాణాన్ని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కొంతకాలం భవన నిర్మాణం అగిపోయినట్లు సమాచారం. అధికారుల అనుమతి లేకపోయినా పనులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
Also Read: Ranga Reddy District: ‘ఖాకీ’ సినిమా రేంజ్ ట్విస్టులు.. ఈ కేసు చూస్తే మతి పోవాల్సిందే!
జీ ప్లస్ టూకే పర్మిషన్
ఇదిలా ఉంటే భద్రాచలం అనేది షెడ్యూల్ ప్రాంతమన్న సంగతి అందరికీ తెలిసిందే. అక్కడ పెద్ద పెద్ద భవనాలు నిర్మించాలంటే అధికారుల అనుమతి తప్పనిసరి. చాలా పక్కాగా అధికారులు రూల్స్ ను అమలు చేస్తుంటారు. అయితే భక్తి పేరుతో సదరు అర్చకుడు ఈ భవన నిర్మాణం చేపట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీ ప్లస్ టూకు మాత్రమే అనుమతి ఉండగా ఏకంగా 6 అంతస్తుల బిల్డింగ్ ను నిర్మించే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సదరు వ్యక్తిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్నది ఆసక్తికరంగా మారింది.