Medchal District: 44వ నెంబరు జాతీయ రహదారిని అనుకొని, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఎల్లంపేటలో భూములు ధరలు ఆకాశాన్నంటాయి. స్థిరాస్తి రంగం కూడా పరిశ్రమలతో పాటు పెరుగుతూ వస్తుంది. భారీగా వెంచర్లు వెలుస్తున్నాయి. అయితే నిర్మాణదారులు నాలాలు, నీటి వనరులను ప్రశ్నార్ధకంగా చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. పశువులు నీళ్లు తాగడానికి, మత్స్యకారులకు ఉపయోగపడిన బంధం కుంటకు దారి లేకుండా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Also Read: Medchal District: ఆ జిల్లాలో ప్రైవేట్ వాహనాలతో అక్రమ నీటి తరలింపు.. పట్టించుకోని అధికారులు!
బఫర్ జోన్లో ప్రహరీ
ఎల్లంపేటలోని సర్వే నెంబరు 45లో ఎకరా 25 గుంటల్లో బంధం కుంట ఉంది. ఈ బంధం కుంటకు జాతీయ రహదారి నుంచి గ్రామానికి వెళ్లే రోడ్డు కింద నుంచి ఉన్న రెండు కల్వర్టులు ద్వారా నీరు వస్తుంది. ఇలా వచ్చిన నీరు బంధం కుంటలో చేరి, ఎక్కువైన నీరు సోమారం పరిధిలో ఉన్న చింతల్ చెరువులోకి వెళ్తాయి. బంధం కుంట పక్క నుంచి చేస్తున్న వెంచర్ ప్రహరీ బఫర్ జోన్లో ఉన్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. అందులో మట్టితో కూడా నింపుతున్నారని చెపుతున్నారు. ఒకప్పుడు గ్రామ అవసరాలు, మత్స్యకారులకు ఉపయోగపడిన కుంట వెంచర్, ఇతర నిర్మాణాల కారణంగా అక్కడికే వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
కుంట ఉనికి లేకుండా పోయే అవకాశం
ఇదిలా ఉంటే కుంటకు నీళ్లు రావడానికి, వచ్చిన నీళ్లు చింతల్ చెరువులోకి వెళ్లే పరిస్థితులు ప్రశ్నార్థకంగా మారుతున్నాయనిస్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోకుంటే కాలక్రమేణా కుంట ఉనికి లేకుండా పోయే అవకాశం ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్ వరకు ఫిర్యాదు వెళ్లినా తగిన చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. ఈ విషయమై నీటి పారుదల శాఖ అధికారులు సంప్రదిస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామని అన్నారు
Also Read: Medchal District: ఎల్లంపేట్ మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన మేడ్చల్ ఏసీపీ!

