Drugs Smuggler Arrested: పదేళ్లుగా నడుస్తున్న డ్రగ్స్ దందాకు ఈగల్ టీం అధికారులు చెక్ పెట్టారు. తెలిసిన కొద్దిపాటి సమాచారం ఆధారంగా 45 రోజులపాటు స్పెషల్ ఆపరేషన్ జరిపి మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ముగ్గురిని పట్టుకున్నారు. నిందితుల నుంచి 17లక్షల రూపాయల విలువ చేసే ఓపీఎంతోపాటు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులు (Hyderabad) హైదరాబాద్‌లో స్థిరపడ్డ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారికి మాత్రమే డ్రగ్స్ విక్రయిస్తున్నట్టుగా వెల్లడైంది.
రాజస్థాన్ రాష్ట్రం (Rajasthan State) జాలోర్ జిల్లాకు చెందిన సవ్లారాం బిష్ణోయ్ (43), హపూరాం బిష్ణోయ్ (38), లాలారాం బిష్ణోయ్ (41) స్నేహితులు. ఉన్న ఊరిలో రెండెకరాల్లో చేస్తున్న వ్యవసాయం నుంచి ఆశించిన ఆదాయం రాకపోతుండడంతో సవ్లారాం 2008లో తమ్ముడు గంగారాంతో కలిసి ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తరువాత ఇద్దరూ స్టీల్ రెయిలింగ్ పని నేర్చుకున్నారు. అదే పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకోవడం మొదలు పెట్టారు. సవ్లారాంకు అప్పటికే 20 ఏళ్ల నుంచి ఓపీఎం సేవించే అలవాటు ఉంది.
Also Read: Money Saving Tips: రూ.50 వేలతో రూ.50 లక్షలు సంపాదించే అద్భుతమైన టిప్స్.. మిస్ చేస్కోవద్దు!
హైదరాబాద్‌లో (Hyderabad) పని చేయడం మొదలు పెట్టిన తరువాత రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ వారిలో పలువురికి ఈ డ్రగ్ తీసుకునే అలవాటు ఉందన్న విషయాన్ని గమనించాడు. ఈ క్రమంలో సోదరుడు గంగారాంతో కలిసి ఓపీఎం విక్రయించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో 2019లో (Boyne Pally Police)బోయిన్ పల్లి పోలీసులు గంగారాంను అరెస్ట్ చేశారు. అతని నుంచి 3.4 కిలోల ఓపీఎంను సీజ్ చేసి జైలుకు రిమాండ్ చేశారు. ఆ తరువాత కొన్నాళ్లకు బెయిల్‌పై విడుదలైన గంగారాం తనపై పోలీస్ నిఘా ఎక్కువ కావడంతో స్వస్థలానికి వెళ్లిపోయాడు. అయితే, అక్కడ ఉంటూనే డ్రగ్స్ దందాలో సవ్లారాంకు సహకరిస్తూ వస్తున్నాడు.
కమీషన్ ఆశ చూపించి..
ఇక, హపురాం బిష్ణోయ్ గ్యాంగ్ లీడర్ సవ్లారాంకు దగ్గరి బంధువు. 4 నెలల నుంచి ఏ పనీ లేకుండా ఉన్న హపురాంను పిలిపించుకున్న సవ్లారాం తన దందాకు సహకరిస్తే కమీషన్ రూపంలో డబ్బు ఇస్తానని చెప్పడంతో అతను దానికి అంగీకరించాడు. ఏడాది క్రితం పరిచయమైన లాలారాం బిష్ణోయ్‌ను కూడా ఇలాగే కమీషన్ ఆశ చూపించి సవ్లారాం తన ముఠాలో చేర్చుకున్నాడు. నిజానికి లాలారాం ఆదిలాబాద్‌లో వెల్డింగ్ షాప్ నడుపుతున్నాడు.
నెల క్రితం..
సవ్లారాం నెల రోజుల క్రింతం 3.25 కిలోల ఓపీఎంను రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి లాలారాంకు దాచి పెట్టమని చెప్పాడు. గురువారం అతనికి ఫోన్ చేసి ఓపీఎం తీసుకుని హైదరాబాద్ రావాలని చెప్పాడు. తాము బోయిన్ పల్లి ఉంటామని తెలిపాడు.
45 రోజులుగా..
సవ్లారాం గ్యాంగ్ సాగిస్తున్న డ్రగ్స్ దందా గురించి ఉప్పందడంతో ఈగల్ టీం అధికారులు 45 రోజులుగా ముఠా సభ్యుల కదలికలపై కన్నేసి పెట్టారు. రాజస్థాన్ వెళ్లి అక్కడ కూడా వివరాలు సేకరించారు. ఈ క్రమంలో గురువారం వేర్వేరు బృందాలుగా విడిపోయి ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న అన్ని టోల్ ప్లాజాల వద్ద మాటు వేశారు. దాంతోపాటు వేర్వేరు కార్లలో లాలారాం ప్రయాణిస్తున్న కారును వెంబడించారు. ఈ క్రమంలో అతని కారుకు ఎస్కార్టుగా మరో కారు వస్తున్నట్టు నిర్ధారించుకున్నారు. అలా వెంబడిస్తూ వచ్చి లాలారాం బోయిన్ పల్లి చేరుకుని సవ్లారాం, హపురాంలను కలవగానే దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తీసుకుని హైదరాబాద్ వచ్చిన ప్రతీసారి సవ్లారాం 4 లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్టుగా ఈగల్ టీం అధికారుల దర్యాప్తులో వెల్లడైంది.