Hyderabad: తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ మధ్య నెలకొన్న సమన్వయ లోపం కారణంగా ఎమర్జెన్సీ సర్వీసుల నిర్వహణకు గ్రహణం పట్టిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, గ్రేటర్ హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ అందించే పౌర సేవలలో కీలకమైన స్ట్రీట్ లైట్ల నిర్వహణ తీవ్రమైన డైలమాలో పడింది. నగరంలోని ప్రధాన రోడ్లలో వీధిలైట్లు సక్రమంగా వెలగకపోవడంతో అంధకారం కారణంగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
నెలలు గడుస్తున్నా పెండింగ్..
హైదరాబాద్ లో 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సుమారు 3 లక్షల 70 వేల స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతలను గతంలో నిర్వహించిన ఈఈఎస్ఎల్ సంస్థను జీహెచ్ఎంసీ తప్పించింది. స్ట్రీట్ లైట్ల మెరుగైన ఆటోమెటికల్ నిర్వహణ కోసం జీహెచ్ఎంసీ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండర్లలో క్రాంప్టన్ గ్రీవ్స్, ఫిలిప్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపగా, ఏ సంస్థకు బాధ్యతలు అప్పగించాలనే క్లారిటీ కోసం సుమారు రూ.963 కోట్లతో రూపొందించిన అంచనా ప్రతిపాదనలను ప్రభుత్వానికి బల్దియా పంపింది. అయితే, నెలలు గడుస్తున్నా ఆ ప్రతిపాదనలు నేటికీ సర్కారు వద్దే పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది.
విలీన ప్రక్రియతో మళ్లీ మొదటికి
కొద్ది రోజుల క్రితం జీహెచ్ఎంసీ అధికారులు సచివాలయాన్ని సంప్రదించగా, కేవలం బల్దియా పరిధికి మాత్రమే కాకుండా, గ్రేటర్‌కు బయట, ఔటర్ లోపల ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీల పరిధుల్లోని స్ట్రీట్ లైట్ల నిర్వహణకు కూడా ప్రతిపాదనలు తయారు చేసి, టెండర్లు చేపట్టాలని సూచించారు. దీంతో స్ట్రీట్ లైట్ల నిర్వహణ కథ మళ్లీ మొదటికొచ్చినట్టయింది. విలీన ప్రక్రియ ముగిసే వరకు ఈ ప్రతిపాదనలకు మోక్షం కలిగే అవకాశాలు కనిపించటం లేదు. 27 లోకల్ బాడీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు ఈ నెల 25న కౌన్సిల్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో, అధికారులు ప్రస్తుతం ఆ లోకల్ బాడీలలోని స్ట్రీట్ లైట్ల సమాచారాన్ని సేకరించడంలో నిమగ్నమయ్యారు.
ప్రతిపాదనలకు మోక్షమెప్పుడు?
జీహెచ్ఎంసీ, ప్రభుత్వం మధ్య సమన్వయ లోపం ‘నిధులిస్తున్నారు, ప్రతిపాదనలు మరుస్తున్నారు’ అన్న చందంగా తయారైందన్న విమర్శలు వస్తున్నాయి. గత గులాబీ సర్కారు హయాంలో రోడ్ల మెరుగైన నిర్వహణ కోసం రూపొందించిన కాంప్రహెన్సీవ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్ రెండో దశ ప్రతిపాదనలు కూడా ఇంకా సర్కారు వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. రూ.2,828 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉండటంతో, రోడ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: Cyclone Ditwah: ఏపీకి దిత్వా ముప్పు.. డేంజర్‌లో ఆ జిల్లాలు.. అకస్మిక వరదలు పక్కా!
గత ప్రభుత్వంతో పోలిస్తే..
గత సర్కారుతో పోల్చితే ఆర్థిక చేయూతనిస్తున్న ప్రస్తుత ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఈ ముఖ్యమైన ప్రతిపాదనలకు కూడా మోక్షం కల్గిస్తే పౌర సేవల నిర్వహణ మెరుగుపడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా పనులు మొదలుకాని రూ.7,038 కోట్ల నిధులు కేటాయించిన హెచ్ సిటీ-1 కింద ప్రతిపాదించిన ప్రాజెక్టులపైనా దృష్టి సారించాలని వాదనలు వినిపిస్తున్నాయి.

