GHMC Commissioner and CDMA: ప్రస్తుతం (GHMC) జీహెచ్‌ఎంసీలో కమిషనర్‌కు, కమిషనర్ (Commissioner) అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ)కు మధ్య అదనపు కమిషనర్ల సంఖ్య కుదింపుపై వివాదం నెలకొన్నట్లు విశ్వసనీయ సమాచారం. నెలన్నర రోజుల క్రితం వరకు (GHMC Commissioner) జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా కర్ణన్( Karnan)బాధ్యతలు స్వీకరించకముందు, జీహెచ్‌ఎంసీలో మొత్తం 15 మంది అదనపు కమిషనర్లు విధులు నిర్వహించేవారు. క్రమంగా ఈ సంఖ్య ప్రస్తుతం 11కి పడిపోయింది.
కర్ణన్ కసరత్తు
ఈ సంఖ్యను ఆరు నుంచి ఎనిమిదికి పరిమితం చేసేందుకు కమిషనర్ కర్ణన్ (Commissioner Karnan) కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో, సీడీఎంఏకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ హోదాల్లోని అధికారులే ఎక్కువ మంది (GHMC) జీహెచ్‌ఎంసీలో అదనపు కమిషనర్లుగా వ్యవహరిస్తున్నారు. ఎంసీహెచ్ ఏర్పడిన నాటి నుంచి, అది గ్రేటర్‌గా రూపాంతరం చెందినప్పటి నుంచి నేటి వరకు జీహెచ్‌ఎంసీలో ఒక్క కమిషనర్ మినహా మిగిలిన వారందరు (CDMA) సీడీఎంఏకు చెందిన అధికారుల హవా కొనసాగింది. కొత్తగా కమిషనర్‌గా వచ్చిన కర్ణన్ సీడీఎంఏ హవాకు బ్రేక్ వేసేందుకే అదనపు కమిషనర్ల సంఖ్యను కుదించేందుకు సిద్ధమయ్యారంటూ మరికొందరు అదనపు కమిషనర్లు భావిస్తున్నట్లు సమాచారం.
Also Read: Local Elections: గ్రౌండ్ ప్రిపరేషన్‌లో అధికార కాంగ్రెస్!
పంపుతారా లేదా ?
జీహెచ్‌ఎంసీకి చెందిన ఓ అదనపు కమిషనర్, మరో జోనల్ కమిషనర్ (Commissioner) మినహా మిగిలిన అదనపు కమిషనర్లలో ఎక్కువ మంది అధికారులు (CDMA) సీడీఎంఏకు చెందిన వారే ఉండటంతో, జీహెచ్‌ఎంసీ కమిషనర్ (GHMC Commissioner) అదనపు కమిషనర్ల సంఖ్యను కుదించి, మిగిలిన వారికి సీడీఎంఏకు పంపుతారా లేదా ఎంఏయూడీ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్)కి పంపుతారా అన్న గందరగోళం నెలకొన్నది. ఇక, మరికొందరు అధికారులు కమిషనర్ తమను బయటకు పంపే వరకు వేచి చూసే బదులు, తామే జీహెచ్‌ఎంసీ నుంచి బయటకు వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగానే కొందరు అదనపు కమిషనర్లు ఫ్యూచర్ సిటీలో ఖాళీగా ఉన్న అదనపు కమిషనర్ నాన్ క్యాడర్ పోస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అదనపు కమిషనర్ల కుదింపునకు కమిషనర్ చేస్తున్న ప్రయత్నం చిలికి చిలికి గాలివానలా మారే అవకాశాలున్నట్లు సమాచారం. కమిషనర్‌గా కర్ణన్ పదవీ బాధ్యతలను చేపట్టిన పక్షం రోజులకే “జీహెచ్‌ఎంసీలో (GHMC) ఇంత మంది అదనపు కమిషనర్లు అవసరమా?” అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మున్సిపల్ శాఖను తన పరిధిలోనే పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డికి చెప్పే ఈ కుదింపు ప్రక్రియను చేపట్టారా? లేక పరిపాలనపరంగా ఆయన తీసుకున్న సొంత నిర్ణయమా? అన్నది జీహెచ్‌ఎంసీతో పాటు మున్సిపల్ శాఖలో హాట్ టాపిక్‌గా మారింది.
ఒక్కొక్కరికి మూడు విభాగాల పర్యవేక్షణ?
ప్రస్తుతం 11గా ఉన్న అదనపు కమిషనర్ల సంఖ్యను ఆరు నుంచి ఎనిమిదికి తగ్గించుకుని, ఒక్కో అదనపు కమిషనర్‌కు రెండు నుంచి మూడు విభాగాల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించాలని కమిషనర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే, ఇప్పటికే ఒక్కో విభాగాన్ని ఒక్కో అధికారి, మరికొన్ని విభాగాలను నేరుగా ఐఏఎస్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నా, ఫీల్డ్ లెవెల్‌లో పౌర సేవల నిర్వహణ, అభివృద్ధికి సంబంధించి అనేక లోపాలు తలెత్తుతున్నాయి. వీటిపై వారానికోరోజు నిర్వహించే ప్రజావాణితో పాటు ప్రతిరోజు సందర్శన వేళలో కమిషనర్‌కు ఫిర్యాదులు అందుతున్నాయి.
ఇక, కుదింపు తర్వాత ఒకే ఆఫీసర్‌కు రెండు, మూడు విభాగాల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగిస్తే పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుందని కొందరు అధికారులే బాహాటంగా చెబుతున్నారు. కుదించిన తర్వాత మిగిలిపోయిన అధికారులకు కమిషనర్ డిమోషన్ ఇచ్చి జాయింట్ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించాలని కూడా భావిస్తున్నట్లు తెలిసింది. ఇదే జరిగితే, కమిషనర్ ఇచ్చే డిమోషన్‌కు అదనపు కమిషనర్ హోదాలోని అధికారులు అంగీకరిస్తారా అన్నది కూడా అధికారుల మధ్య చర్చనీయాంశంగా మారింది.
ఎక్కువ బాధ్యతలు అప్పగిస్తే ఇదే పరిస్థితి
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో చీఫ్ ప్రాజెక్టుల విభాగానికి చీఫ్ ఇంజినీర్‌గా, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ బోర్డుకు చీఫ్ ఇంజినీర్ బాధ్యతలతో పాటు స్టేట్ పబ్లిక్ హెల్త్‌కు ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ సీనియర్ ఇంజినీర్‌కు నిన్న మొన్నటి వరకు మరో బాధ్యతతో కలిపి మొత్తం నాలుగు రకాల విభాగాల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మానస పుత్రిక ప్రాజెక్టు అయిన హెచ్-సిటీ పనులకు సీఎం గత సంవత్సరం డిసెంబర్ 4న ప్రారంభోత్సవం చేసినా, ఇప్పటి వరకు హెచ్-సిటీకి సంబంధించి ఏ ఒక్క పని కూడా గ్రౌండ్ కాలేదు.
సదరు ఇంజినీర్ ఆశించిన స్థాయిలో పని చేయటం లేదన్న విషయాన్ని గుర్తించిన కమిషనర్, ఆయనకున్న బాధ్యతల నుంచి ఒకటి తగ్గించి మూడు రకాల బాధ్యతలను కొనసాగిస్తున్నారు. ఫలితంగా ఆ ఇంజినీర్ ఎప్పుడు ఏ ఆఫీసులో ఉంటారో, ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఒక ఆఫీసర్‌కు ఒకటి, రెండుకు మించి బాధ్యతలను అప్పగిస్తే, సదరు ఆఫీసర్ ఏ ఒక్క విభాగానికి న్యాయం చేసేలా విధులు నిర్వర్తించలేరనేందుకు పైన పేర్కొన్న ఇంజినీర్ పనితీరు ఒక నిదర్శనంగా పేర్కొనవచ్చు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని అదనపు కమిషనర్లను కుదించాలన్న ఆలోచనపై పునరాలోచించాలన్న వాదనలున్నాయి.
Also Read: Rythu Bharosa: రైతుల ఖాతాల్లో.. రూ.1,313.53 కోట్లు జమ!