Local Elections: స్థానిక ఎన్నికలపై (Local Elections) సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ఒకవైపు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ మరోవైపు నేతలంతా గ్రామస్థాయిలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నది. ప్రజా సమస్యల పరిష్కారానికి నేతలు చొరవ చూపాలని ఆదేశాలిస్తున్నది. మంత్రులు, ఇన్‌ఛార్జ్ మంత్రులంతా సమన్వయంతో ముందుకెళ్లాలని అర్హులందరికీ పథకాలు అందేలా చూడాలని పార్టీ ఇప్పటికే సూచించింది. కేడర్‌ను సైతం సన్నద్ధంలో భాగంగానే ఎన్నికలు త్వరలోనే అంటూ లీకులు ఇస్తున్నట్లు సమాచారం. మరోవైపు, రిజర్వేషన్లపై కోర్టు నిర్ణయం మేరకు ముందుకెళ్లాలనే యోచనలో ఉన్నది. అందుకు అనుసరించాల్సిన ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నది.
పథకాలపై విస్తృత ప్రచారం
మెజార్టీ సీట్ల సాధనకే లక్ష్యంగా కాంగ్రెస్ (Congress) ప్రణాళికలు రూపొందిస్తున్నది. అందుకే ముందస్తుగా గ్రౌండ్ ప్రిపరేషన్‌లో పడింది. ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని ఇప్పటికే పార్టీ కేడర్‌కు సూచించినట్లు తెలిసింది. ఇందిరమ్మ ఇళ్లు, (Indhiramma Homes) యువవికాసం, ( Yuva Viksam) మహిళా సంక్షేమ పథకాలతో పాటు విద్య, వైద్యం, ఉద్యోగ అంశాలను వివరించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం (Congess Government) అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే సాధించిన ప్రగతిని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) పదేళ్లలో చేసిన వైఫల్యాలను వివరించాలని భావిస్తున్నది.
అందుకోసం ఇప్పటికే ఎమ్మెల్యేలంతా సొంత నియోజకవర్గాల్లోనే ఉండాలని సూచించినట్లు సమాచారం. దీంతో వారంతా నియోజకవర్గాల్లో నిత్యం అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అందజేత, ఇళ్లకు భూమి పూజ కార్యక్రమాలతో ప్రజల్లో ఉంటున్నారు. ప్రజలు ఎవరు కలిసేందుకు వచ్చినా వారి నుంచి వినతులు తీసుకుంటూ సావధానంగా సమస్యలు వింటున్నారు. గత ప్రభుత్వానికి భిన్నంగా ప్రజా ప్రభుత్వం అని ప్రజాపక్షం అని చాటేలా ముందుకెళ్తున్నారు.
Also Read: Rythu Bharosa: రైతుల ఖాతాల్లో.. రూ.1,313.53 కోట్లు జమ!
జడ్పీ స్థానాలపై ఫోకస్
(Telangana) తెలంగాణలోని 32 జడ్పీ స్థానాలపైనా కాంగ్రెస్ (Congress) ప్రత్యేక ఫోకస్ పెట్టింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో (BRS Government) అన్ని స్థానాలను ఎలాగైతే గెలుచుకుందో దానిని తిరగరాసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇప్పటికే ఇదే విషయాన్ని సీఎం మంత్రులకు సూచించినట్లు సమాచారం. ఏ ఒక్క అవకాశాన్ని విపక్షాలకు ఇవ్వొద్దని, అందుకు ప్రజల్లోనే ఉంటేనే సాధ్యమని, యాక్టీవ్‌గా పనిచేసే నేతలకే టికెట్లు ఇవ్వాలని, అందుకు నేతల పనితీరును సైతం గమనించాలని పార్టీ సైతం సూచనలు చేసినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యే సైతం నేతలకు హింట్ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు, జిల్లా మంత్రులు, ఇన్‌ఛార్జ్ మంత్రులు నిత్యం కోఆర్డినేషన్‌తో ముందుకెళ్లాలని, అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి చేపట్టే ప్రతి పనిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించినట్లు తెలిసింది.
విపక్షాల విమర్శలకు చెక్ పెట్టేలా..
పంచాయతీ ఎన్నికలకు కేడర్ సన్నద్ధంలో భాగంగానే ఎన్నికలంటూ లీకులు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. తొలుత ఎంపీటీసీ, (MPTC) జడ్పీటీసీ (ZPTC) ఎన్నికలని, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలని మంత్రులు పేర్కొంటున్నారని, అది ఎన్నికల్లో వ్యూహమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎప్పటికప్పుడు అలర్టు చేస్తేనే నిత్యం ప్రజల్లో నేతలు ఉంటారనే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వంపై విపక్ష పార్టీలు విమర్శలు చేస్తే వెంటనే స్పందించాలని, వారి వ్యాఖ్యలను తిప్పికొట్టాలని నేతలకు సూచించినట్లు తెలిసింది. విపక్షాల విమర్శలను ప్రజలు నమ్మకుండా వాస్తవాలను వివరించాలని, ప్రభుత్వం చేపట్టే అంశాలను వివరించాలని ఆదేశాలిచ్చినట్లు సమాచారం. మరోవైపు, నేతల మధ్య గ్రూపు రాజకీయాలకు తావివ్వకుండా అందరూ సమన్వయంతో పోవాలని లేకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరికలను పార్టీ అధిష్టానం జారీ చేసినట్లు సమాచారం.
రైతు భరోసాపై ఆశలు
గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతు భరోసా నిధులను క్రమం తప్పకుండా, ఎన్ని ఎకరాలు ఉన్న రైతుకైనా ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 9 రోజుల్లో రైతులందరికీ రైతు భరోసా నిధులు వారి ఖాతాల్లో జమ చేస్తుండడం తొలిసారి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రోజువారీగా భరోసా నిధులు జమ చేయలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ నెల 16 నుంచి 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాల లోపు ఉన్నవారికి మూడు రోజుల్లోనే జమ చేసింది.
రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ వారికి దగ్గరయ్యే ప్రయత్నం ముమ్మరం చేసింది. ఇప్పటికే ఎన్నికల కోసమే రైతు భరోసా అని విపక్షాలు చేస్తున్న విమర్శలను భేఖతార్ చేస్తున్నది. అంతేగాకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ గ్రౌండ్‌ను ప్రిపేర్ చేస్తున్నది. విపక్ష పార్టీలను సైతం డైలమాలో పడేస్తూ ఎన్నికలపై క్లారిటీ ఇవ్వకుండా వారిని విమర్శలకే పరిమితం చేస్తూ కట్టడి చేస్తుందని సమాచారం. వారి తప్పులను ఎత్తిచూపుతూ ఒకవైపు, మరోవైపు ప్రజల్లోకి సంక్షేమ పథకాలను తీసుకెళ్తూ విస్తృత ప్రచారం చేస్తున్నది.
రిజర్వేషన్ల వ్యూహం
రిజర్వేషన్లపై బీసీల నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఆచితూచి అడుగులు వేస్తున్నది. ఇప్పటికే 42శాతం రిజర్వేషన్లపై అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే రిజర్వేషన్లపై సముఖంగా ఉన్నామని హైకోర్టుకు దృష్టికి తీసుకెళ్లేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల కోసం చేసిన ప్రయత్నాలు కోర్టకు వివరించేలా ప్రణాళికలు సైతం రూపొందించినట్లు తెలిసింది.
కేంద్రం రిజర్వేషన్లపై క్లారిటీ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ తరుఫున కల్పిస్తామని పేర్కొనాలని, దీంతో ఎన్నికలకు అడ్డు రాకుండా ఉంటుందని, బీసీ వర్గాలను సైతం అక్కున చేర్చుకోవాలనే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. విపక్షాల విమర్శలను తిప్పికొట్టేలా రిజర్వేషన్లపై ముందుకెళ్లాలని, న్యాయ నిపుణులతో, రాజకీయ వేత్తలతోనూ సంప్రదింపులు చేసి వారి సూచన మేరకు ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం (Conngress Govrnment) మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ స్థానిక ఎన్నికలకు సన్నద్థమవుతున్నట్లు అనుసరిస్తున్న విధానాలే స్పష్టం చేస్తున్నాయి.
Also Read: Minister Ponguleti Srinivas Reddy: ఈ నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్.. మంత్రి పొంగులేటి