Shankarpally Robbery Case: శంకర్ పల్లి దారి దోపిడీ కేసులో సైబరాబాద్ పోలీసులు 24 గంటల్లోనే 7గురు సభ్యుల గ్యాంగును అరెస్ట్ చేశారు. వారి నుంచి 17.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. విచారణలో దోపిడీలో ప్రధాన సూత్రధారి కారు డ్రైవరే అని వెల్లడైంది. సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, బాలానగర్ డీసీపీ సురేష్ లతో కలిసి వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ కు చెందిన రాకేశ్ అగర్వాల్ స్టీల్ వ్యాపారి. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలకు సరుకును సరఫరా చేస్తుంటాడు. తన వద్ద మేనేజర్ గా పని చేస్తున్న సాయిబాబాను పంపించి కస్టమర్లు ఇవ్వాల్సిన డబ్బును తెప్పించుకుంటుంటాడు. ఈ క్రమంలోనే వికారాబాద్ లో ఉంటున్న కస్టమర్ అన్సారీ ఇవ్వాల్సిన 40 లక్షలు తీసుకుని రమ్మనమని సాయిబాబాకు చెప్పాడు.
ఈ క్రమంలో సాయిబాబా సొంత కారును అద్దెకు నడుపుతున్న తన స్నేహితుడు మధుకు వికారాబాద్ వెళ్లాల్సి ఉంటుందని ఒక రోజు ముందుగానే చెప్పాడు. అప్పటికే ఏడాది నుంచి సాయిబాబాతో కలిసి వేర్వేరు చోట్లకు వెళ్లి వస్తున్న మధుకు ప్రతీసారి లక్షల్లో డబ్బు తీసుకు వచ్చే విషయం తెలుసు. ఈ క్రమంలో వికారాబాద్ వెళ్లి వచ్చే సమయంలో స్నేహితుల ద్వారా దోపిడీకి ప్లాన్ వేశాడు. దీని ప్రకారం తన స్నేహితులైన విజయ్ కుమార్, మహ్మద్ అజహర్ లకు డబ్బు తీసుకు రావటానికి వికారాబాద్ వెళుతున్నట్టు చెప్పాడు. తిరిగి వచ్చే సమయంలో వేసిన ప్లాన్ ను అమలు చేయాలని సూచించాడు అంతే కాకుండా ఒక రోజు ముందుగానే తన కారులో విజయ్, అజహర్, హర్షలను తీసుకుని వికారాబాద్ వెళ్లి రెక్కీ కూడా చేశాడు.
ఇదే సరైన స్పాట్…
రెక్కీలో వాహనాలు…జనం రద్దీ అంతగా లేని శంకర్ పల్లి మండలం హుస్సేన్ పూర్ గేట్ వద్ద దోపిడీ చేయాలని నిర్ణయించారు. ఆ తరువాత హర్ష జడ్చర్లలో ఉంటున్న తన స్నేహితుడు అనుదీప్ కు చెందిన స్విఫ్ట్ డిజైర్ కారును తీసుకుని వచ్చాడు. ఆ తరువాత గ్యాంగులోకి దీపక్, షమీఉల్లాలను చేర్చుకున్నారు.
ఎస్కార్టుగా మరో కారులో…
సాయిబాబాను తీసుకుని మధు వికారాబాద్ బయల్దేరగానే మిగితా గ్యాంగ్ సభ్యులు వారిని వెంబడించారు. ఓ కారులో విజయ్, అజహర్ లు ఎస్కార్టు చేస్తూ వచ్చారు. స్విఫ్ట్ డిజైర్ కారులో మిగితా వాళ్లు వచ్చారు. ఇక, కారు నడుపుతున్నంత సేపు మధు తాను ఎక్కడ ఉన్నానన్న వివరాలను విజయ్ కు చెబుతూ వచ్చాడు. ఈ వివరాలను విజయ్ మరో కారులో వస్తున్న హర్షకు తెలియ చేస్తూ వచ్చాడు.
పార్కింగ్ లైట్లతో సిగ్నల్…
హుస్సేన్ పూర్ గేట్ సమీపంలోకి చేరుకోగానే సహచరులతో కలిసి వెంటాడుతూ వచ్చిన హర్ష తన కారు పార్కింగ్ లైట్లను బ్లింక్ చేస్తూ మధుకు సిగ్నల్ ఇచ్చాడు. ఇది చూసి మధు తన కారును స్లో చేశాడు. ఆ వెంటనే హర్ష తదితరులు తమ కారుతో మధు, సాయిబాబా ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టారు. ఆ తరువాత సాయిబాబాను కొట్టి అతని వద్ద ఉన్న 40 లక్షల రూపాయల నగదును దోచుకుని అక్కడి నుంచి ఉడాయించారు. అయితే, నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లిన తరువాత వీరి కారు కొత్తపల్లి శివార్లలోని కల్వర్టును ఢీకొని బోల్తా పడింది. అది చూసి స్థానికులు ప్రమాద స్థలానికి వచ్చారు. ఇది గమనించిన హర్ష ఇతర నిందితులు ఎస్కార్టుగా వచ్చిన విజయ్ కారులో అక్కడి నుంచి ఉడాయించారు.
కారు నెంబర్ ఆధారంగా…
కాగా, ప్రమాదానికి గురైన కారు నెంబర్ ఆధారంగా పోలీసులు దాని యజమాని అనుదీప్ ను గుర్తించారు. అతన్ని జరిపిన విచారణలో వెల్లడైన వివరాల మేరకు సంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీసులను అలర్ట్ చేశారు. ఈ క్రమంలో షాద్ నగర్ పోలీసులు ముంబయి హైవే జహీరాబాద్, బెంగళూరు హైవే రాయికల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. మరోవైపు ఎస్వోటీ, సీసీఎస్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. సమన్వయంతో తీసుకున్న చర్యలతో నేరానికి పాల్పడ్డ ఏడుగురు నిందితులు పోలీసుల చేతికి చిక్కారు.
Also Read: Hyderabad Cyber Crime: సైబర్ కేటుగాళ్ల చేతిలో రూ.18వేలు స్వాహా.. నిమిషాల్లోనే రికవరీ చేసిన పోలీసులు