హైదరాబాద్: Bathukamma kunta: బతుకమ్మ కుంట విషయంలో హైడ్రా వాదన నిజమైంది. సుదీర్ఘ విచారణలో నిజమే గెలిచింది. సిటీ సివిల్ కోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. బతుకమ్మ కుంట చెరువు కాదు ఆ స్థలం నాదే అని కోర్టుకెక్కిన యెడ్ల సుధాకర్ రెడ్డి వాదనలో నిజం లేదని తేల్చి చెప్పింది. యెడ్ల సుధాకర్ రెడ్డి వేసిన రిట్ పిటిషన్‌ను సిటీ సివిల్ కోర్టు డిస్మిస్ చేసింది. రెవెన్యూ రికార్డులు, విలేజ్ మ్యాప్‌లు, సేటిలైజ్ ఇమేజ్‌లు, సర్వే ఆఫ్ ఇండియా రికార్డుల ఆధారంగా బతుకమ్మ కుంటపై హైడ్రా తరఫు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారు. దాదాపు నెల రోజుల పాటు వాదోపవాదాల అనంతరం సిటీ సివిల్ కోర్టు జడ్జి ఎం.వెంకటేశ్వర రావు బతుకమ్మ కుంటకు ప్రాణం పోస్తూ తీర్పునిచ్చారు.
ఈ తీర్పుతో బతుకమ్మ కుంట అభివృద్ధి పనులకు ఆటంకాలు తొలిగాయి. నగరంలో చెరువుల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన హైడ్రాకు ఈ తీర్పు ఊతమిచ్చినట్టయ్యింది. ఈ తీర్పును హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్‌గారు స్వాగతించారు. హైడ్రా తరఫున వాదనలు వినిపించిన హైడ్రా, హెచ్ ఎండీఏ, జీహెచ్ ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్లు కె. అనిల్‌కుమార్, ఎస్. శ్రీనివాస్, బి. అజయ్, ప్రభుత్వ తరఫు న్యాయవాది బి. జనార్దన్‌తో పాటు హైడ్రా న్యాయ సలహాదారు శ్రీనివాస్‌తో పాటు అతని సహచర లాయర్లను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్‌గారు అభినందించారు. నగరంలో 6 చెరువుల అభివృద్ధిని మొదటి విడతగా హైడ్రా చేపట్టిన విషయం విధితమే. ఈ ఆరు చెరువుల్లో బతుకమ్మకుంట ఒకటి.
ఫిబ్రవరిలో పనులు
ఫిబ్రవరి 18వ తేదీన బతుకమ్మ కుంట అభివృద్ధి పనులను హైడ్రా ప్రారంభించింది. మోకాలు లోతు మట్టి తీయగానే బిరబిరా గంగమ్మ బయటకొచ్చింది. బతుకమ్మ కుంట బతికే ఉందని నిరూపించింది. బతుకమ్మ కుంట కాదు ఇది మా స్థలమంటూ యెడ్ల సుధాకర్‌రెడ్డి చేసిన వాదనలో పస లేదని నాడే రుజువు చేసింది. అంబర్‌పేట మండలం, బాగ్అంబర్‌పేట్‌లోని సర్వే నంబరు 563లో 1962 -63 లెక్కల ప్రకారం బతుకమ్మ కుంట విస్తీర్ణం 14.06 ఎకరాలు కాగా బఫర్ జోన్‌తో కలిపి మొత్తం వైశాల్యం 16.13 ఎకరాలు. కబ్జాలకు గురై బతుకమ్మ కుంట బక్క చిక్కిపోయి కేవలం 5.15 ఎకరాలుగా మిగిలిపోయింది.
Also Read: Nepali workers Robbery: నమ్మి పనిలో పెట్టుకుంటే.. చివరికి ఎంచేశారంటే!
దీనిని అభివృద్ధి చేయాలని స్థానికులు హైడ్రాను ఆశ్రయించారు. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ ఉన్న నివాసాల జోలికి వెళ్లకుండా ఉన్న స్థలంలోనే చెరువును అభివృద్ధి చేస్తామని చెప్పారు. దీంతో స్థానికుల నుంచి హైడ్రాకు పూర్తి మద్దతు లభించింది. కోర్టు తీర్పుతో స్థానికులు సంబరాలు చేసుకున్నారు. వెంటనే పనులు చేపట్టి వర్షాకాలం నాటికి చెరువు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని హైడ్రాను స్థానికులు కోరారు. వచ్చే బతుకమ్మ సంబరాలు అక్కడే చేసుకునేలా చెరువును అభివృద్ధి చేయాలని హైడ్రాకు పూర్తి సహకారం అందిస్తామని ముందుకొచ్చారు.