Saroornagar Murder case: హైదరాబాద్ సరూర్ నగర్ లో ప్రియురాలిని ఓ పూజారి దారుణంగా హత్య చేసిన ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్సర (Apsara) అనే యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆలయ పూజారి సాయికృష్ణ (Sai Krishna) దారుణంగా హత్య చేశాడు. 2023 జూన్ లో ఈ దారుణం చోటుచేసుకోగా.. అప్పటి నుంచి ఈ కేసు విచారణ రంగా రెడ్డి కోర్టులో జరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా కేసుకు సంబంధించి న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
పూజారికి జీవిత ఖైదు
అప్సర హత్య (Apsara Murder) కేసుకు సంబంధించి సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం.. నిందితుడు సాయికృష్ణకు తాజాగా శిక్ష ఖరారు చేసింది. అప్సర మరణానికి సాయికృష్ణనే కారణమని తేలుస్తూ జీవిత ఖైదు విధించింది. పలు వాయిదాల్లో ఇరు పక్షాల వాదనలు వింటూ వచ్చిన ధర్మాసనం.. చివరికీ సాయికృష్ణను నేరస్తుడిగా తేలుస్తూ బుధవారం (మార్చి 26) కఠిన శిక్ష విధించింది. సాక్ష్యాలను తారుమారు చేసినందుకు గాను మరో 7ఏళ్ల అదనపు శిక్షను సైతం సాయికృష్ణకు విధించింది.
Also Read: Ranga Reddy District: ‘ఖాకీ’ సినిమా రేంజ్ ట్విస్టులు.. ఈ కేసు చూస్తే మతి పోవాల్సిందే!
అప్సరతో పరిచయం
ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన నిందితుడు వెంకట సూర్య సాయికృష్ణ.. హైదరాబాద్ సరూర్ నగర్ లో నివసించేవాడు. స్థానిక మైసమ్మ గుడిలో పూజారిగా అతడు పనిచేశాడు. మరోవైపు చెన్నైకి చెందిన కురుగంటి అప్సర (30) తల్లితో కలిసి సాయికృష్ణ ఉంటున్న సరూర్ నగర్ వెంకటేశ్వర్ కాలనీలో నివాసముంది. ఈ క్రమంలో సాయికృష్ణ పూజారిగా ఉన్న మైసమ్మ గుడికి అప్సర తరుచూ వెళ్లేది. ఈ నేపథ్యంలో పూజారి సాయికృష్ణతో ఆమెకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.
హత్య ఎలా చేశాడంటే
పూజారి సాయికృష్ణకు అప్పటికే పెళ్లి జరిగి.. పిల్లలు సైతం ఉన్నారు. మరోవైపు అప్సర తనను పెళ్లి చేసుకోమని సాయికృష్ణపై ఒత్తిడి తేవడం మెుదలుపెట్టింది. దీంతో ఆమెను వదిలించుకోవాలని అతడు నిర్ణయించుకున్నాడు. 2023 జూన్ 3న కోయంబత్తూరుకు వెళ్దామని చెప్పి అప్సరను కారులో తీసుకెళ్లాడు. రా.11 గం.లకు శంషాబాద్ మండలం సుల్తాన్ పూర్ శివారులోని గోశాల వైపు కారును తీసుకెళ్లాడు. కారు రోడ్డు పక్కన నిలపగా అప్పటికే అప్సర గాఢ నిద్రలో ఉంది. దీంతో కారును కప్పే కవర్ ను అప్సర ముఖంపై పెట్టి ఆమెకు ఊపిరి ఆడకుండా చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న రాయితో ఆమె తలపై బలంగా మోదాడు. దీంతో అప్సర స్పాట్ లో ప్రాణాలు విడిచింది.
డ్రైనేజీలో మృతదేహం
అప్సరను హత్య చేసిన అనంతరం ఆమె బాడీని కారు వేసే కవరులో సాయికృష్ణ చుట్టాడు. అనంతరం కారు డిక్కీలో మృతదేహాన్ని పెట్టి.. సరూర్ నగర్ ఎమ్మార్వో ఆఫీసు వెనకవైపు ఉన్న డ్రైనేజీ మ్యాన్ హోల్ లో పడేశాడు. కూతురి ఆచూకీ గురించి సాయికృష్ణను అప్సర తల్లి ప్రశ్నించగా భద్రాచలం వెళ్లిందని నమ్మబలికాడు. ఈ క్రమంలో అప్సర ఫోన్ ఎత్తడం లేదని ఆందోళన పడుతున్నట్లు నటించి ఏమి ఎరుగనట్లు ఆమె తల్లితోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయగా సాయికృష్ణ నిజస్వరూపం బయటపడింది.