Bhu Bharati Act: ప్రభుత్వం రైతులకు, ప్రజలకు ఎలాంటి నష్టం కాని కష్టం కాని కల్పించే దిశగా చర్యలు తీసుకోదని, భూభారతి చట్టం పై ఎలాంటి అపోహాలు పెట్టుకోవద్దని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం స్పష్టం చేశారు. ఏవైనా సందేహాలు ఉంటే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువచ్చి నివృత్తి చేసుకోవాలని సూచించారు. మంగళవారం శామీర్ పేట మండలం తూంకుంట గ్రామంలోని మొగుళ్ల వెంకట్ రెడ్డి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం పై అవగాహాన సదస్సుకు కలెక్టరు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
రైతులు ప్రైవేటు సర్వేయనర్లను నియమించవద్దని తెలుపగా వారికి సమాధానమిస్తూ భూమి కొనుగోలు అమ్మకాలప్పుడు రిజిస్ట్రేషన్ సమయంలో లైసెన్స్ డ్ సర్వేయర్లతో భౌతిక సరిహద్దుతో చేయించిన ల్యాండ్ మ్యాపులను ప్రభుత్వ సర్వేయర్లు మళ్లీ పరిశీలించిన తర్వాతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో ల్యాండ్ మ్యాపులు వస్తాయని, దీని వల్ల ఎవరికి నష్టం జరగదని కలెక్టర్ వివరించారు. పకడ్బందీగా భూసరిహద్దులు ఉంటాయని, అది కూడా రైతు ఒప్పుకుంటేనే భూ సర్వే చేస్తామని కలెక్టరు తెలిపారు.
Also Read: Medak Tragedy: మెదక్‌లో కలచివేసిన సంఘటన.. ఆత్మహత్యకు యత్నించిన తల్లి, ఇద్దరు చిన్నారులు
ధరణి వల్ల పిఒబి సమస్యలు చాలా ఉన్నాయని, భూభారతి చట్టంలో పిఓబి రద్దుచేసే అధికారం కల్పించడం జరిగిందన్నారు.ఈ భూభారతి చట్టంలో ప్ర్రతి సంవత్సరం డిసంబర్ 31న ఆ సంవత్సరంలో జరిగిన మార్పులు, చేర్పులను ఆన్ లైన్ లో ప్రింట్ తీసి ప్రతి గ్రామ పంచాయతీ నోటీసు బోర్డులలో ప్రదర్శిస్తారని అందువల్ల మీకందరికి మీమీ భూముల రికార్డుల వివరాలు తప్పక తెలుస్తాయని కలెక్టరు వివరించారు. గ్రామ పంచాయతీ అధికారులను నియమించి ప్రతి గ్రామంలోని చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడమే కాకుండా ఏవైనా భూ వివాదాలు, తగాదాలు ఉంటే వాటిని తహాసీల్దార్ల దృష్టికి తీసుకువెళతారని కలెక్టరు తెలిపారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టరు మాట్లాడుతూ భూభారతి చట్టం ద్వారా రెవెన్యూ అధికారుల పై బాధ్యత మరింత పెరిగిందన్నారు. ప్రభుత్వం ఆనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ ఈ నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని తెచ్చిందని, ధరణి స్థానంలో కొత్తగా భూ భారతి వ్యవస్థను అమలు చేస్తున్నట్లు తెలిపారు. భూ భారతి 2025 చట్టంలో 23 సెక్షన్లు మరియు 18 నిబంధనలున్నాయని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ రైతులకు న్యాయబద్ధమైన మార్గం కల్పిస్తోందని తెలిపారు.
Also Read: Cm Revanth on CS DGP: కొత్త ప్రభుత్వ బాస్ లపై సీఎం ఫోకస్.. ప్రతిభకే ప్రాధాన్యత ఇస్తారా?
ఇంటి స్థలాలు, ఆబాది, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డులతో వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు, భవిష్యత్తులో పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టరు తెలిపారు. కీసర ఆర్డిఓ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ 1989 ఆర్ఓ ఆర్ చట్టం లోని అంశాలు భూభారతి లోని అంశాలు కొంత వరకు సిమిలర్ గా ఉన్నాయని, అంతే కాకుండా రెవెన్యూ అధికారులకు ధరణీలో లేని అధికారాలు భూభారతిలో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నర్సింహాలు, జిల్లా గ్రంధాలయ సంస్థ కమిటి ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, శామీర్ పేట్ తహాసీల్దారు యాదగిరిరెడ్డి, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు