Serilingampalli Chandanagar: చందానగర్ హుడా ఫేజ్ -2 కాలనీ లేఅవుట్ లో పార్కు కోసం కేటాయించిన భూమిలో బ్యాడ్మింటన్ కోర్టు నిర్మించారు. ఈ బ్యాడ్మింటన్ కోర్టు అసోసియేషన్ పెద్దలకు ఆదాయ వనరుగా మారింది. చందానగర్ సర్కిల్ – 21 పరిధిలోని చందానగర్ డివిజన్ హుడా ఫేజ్ -2 లో పార్కు స్థలం ఉంది. ఈ పార్కు స్థలంలో భారీ బ్యాడ్మింటన్ కోర్టు నిర్మించారు. ఈ బ్యాడ్మింటన్ కోర్టుని కాలనీ అసోసియేషన్ పెద్దలు వ్యాపార కేంద్రంగా కొనసాగించడంపై కాలనీవాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
కాలనీకి చెందిన స్థలంలో ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ కోర్టులోకి కాలనీ వాసులకు అనుమతి లేదంటుండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీవాసులు అడ్డుకున్నప్పటికీ గతంలో కొంతమంది పెద్దల పేర్లు చెప్పుకొని అక్రమంగా షెడ్డును నిర్మించారని, ప్రస్తుతం హైడ్రా, జిహెచ్ఎంసిలు పార్కు కబ్జాపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అన్యక్రాంతమవుతున్న ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుందని, హైడ్రా చూపు హుడా ఫేజ్ -2 పార్కు కబ్జాపై పెట్టాలని కోరుతున్నారు.
అసోసియేషన్ పెద్దల సహకారంతోనే:
హుడా ఫేజ్ -2 పార్కు స్థలంలో కొనసాగుతున్న బ్యాడ్మింటన్ కోర్టు వ్యాపారంలో కాలనీ అసోసియేషన్ పెద్దల హస్తం ఉందని, అడ్డుకోవాల్సిన అసోసియేషన్ మెంబర్లు వ్యాపారస్తులకు సహకరించడం పై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్కు స్థలంలో కొనసాగుతున్న బ్యాడ్మింటన్ కోర్టు నుంచి వచ్చే ఆదాయాన్ని సైతం కాలనీ బాగోగులకు వినియోగించకుండా తమ అవసరాలకు వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. వెంటనే పార్కు స్థలంలో కొనసాగుతున్న బ్యాడ్మింటన్ కోర్టును తొలగించి, తిరిగి పార్కును పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలంటూ అధికారులను కోరుతున్నారు.
Also Read: Union Bank of India: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. అస్సలు మిస్ చేసుకోకండి!