Terrorist Attack: ఉగ్రదాడులు జరిగే అవకాశాలు ఉన్నాయంటూ కేంద్ర నిఘా వర్గాలు చేసిన హెచ్చరికలతో హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) అప్రమత్తమయ్యారు. మందిరాలు, జన సమ్మర్ధం అధికంగా ఉండే ప్రాంతాలు, బస్…రైల్వే స్టేషన్ లు తదితర ప్రాంతాల్లో నిఘాను కట్టుదిట్టం చేశారు. గతంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి అరెస్టయిన వారి కదలికల గురించి ఆరా తీస్తున్నారు. అదే సమయంలో హవాలా వ్యాపారులపై కూడా కన్నేశారు.
ప్రతీకార దాడులకు అవకాశం
ముంబయి మారణ హోమం వెనక ఉన్న మాస్టర్ మైండ్ తహవూర్ రాణాను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా, దిల్ సుక్ నగర్ జంట పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న అయిదుగురు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు విధించిన ఉరి శిక్షను ఇటీవలే హైకోర్టు ఖరారు చేసింది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశముందని ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాలు అనుమానిస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతాల నుంచి మన దేశం లోపలికి చొరబడి ఉగ్రవాదులు విధ్వంసానికి పాల్పడే ప్రమాదముందని చెబుతున్నాయి.
ఇప్పటికే చొరబడ్డ ఉగ్రవాదులు
ఈ నేపథ్యంలోనే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన 100మంది జవాన్లు ఇటీవల వెస్ట్ బెంగాల్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 7వేల కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతాల్లో సైకిల్ ర్యాలీ జరిపించారు. కాగా, ఇప్పటికే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కొందరు మన దేశం లోపలికి చొరబడినట్టుగా కేంద్ర నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. మన దేశంలో ఉంటున్న సానుభూతిపరుల సహాయంతో ఉగ్ర దాడులకు కుట్రలు చేస్తున్నట్టుగా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అలర్ట్ గా ఉండాలని అన్ని రాష్ట్రాల పోలీసు యంత్రాంగాలను హెచ్చరించాయి.
వారి కదలికలపై నిఘా
గతంలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడి పట్టుబడిన వారిలో ఎంతమంది జైళ్ల నుంచి బయటకు వచ్చారు? ప్రస్తుతం వాళ్లు ఎక్కడ ఉంటున్నారు? అన్న దానిపై దృష్టిని సారించారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఐఎస్ఐఎస్ తదితర సంస్థల్లో చురుకుగా ఉన్నవారితోపాటు ఆయా సంస్థల సానుభూతిపరుల కదలికలపై కూడా నిఘా పెట్టారు. ముఖ్యంగా ప్రధాన మందిరాలు, రైల్వే, బస్ స్టేషన్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టారు.
Also Read: Vijayasai Reddy BJP: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా విజయసాయిరెడ్డి? ఇక జగన్ కు చుక్కలేనా!
హవాలా వ్యాపారులపై కన్ను
ఈ క్రమంలోనే హవాలా వ్యాపారులపై కూడా తెలంగాణ పోలీసులు (Telangana Police) నిఘా పెట్టారు. విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్రలు జరిపిన ప్రతీసారి వారికి హవాలా ద్వారానే పెద్ద మొత్తాల్లో డబ్బు అందుతుండటమే దీనికి కారణం. దిల్ సుక్ నగర్ జంట పేలుళ్ల కేసులోని నిందితులకు కూడా హవాలా ద్వారానే డబ్బు అందిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించటానికి కుట్రలు చేస్తున్నారని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో హవాలా వ్యాపారులపై కూడా నిఘాను కట్టుదిట్టం చేశామన్నారు.