Vijayasai Reddy BJP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) తో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijaysai Reddy)కి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) సీఎంగా ఉన్న రోజుల నుంచే వైఎస్ ఫ్యామిలీతో సాయిరెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయి. జగన్ పై నమోదైన అవినీతిల్లో కేసుల్లో ఏ2 గా మారి జైలుకు సైతం వెళ్లారు. అయితే ఇటీవల జగన్ కు భారీ షాక్ ఇచ్చిన సాయిరెడ్డి.. వైసీపీ పార్టీ (YSRCP)కి రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డికి సంబంధించి తాజాగా ఓ వార్త రాష్ట్ర రాజకీయాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు!
ప్రస్తుతం ఏపీ రాజకీయాలతో పాటు సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. త్వరలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి (AP BJP President)గా విజయసాయిరెడ్డి బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు ఓ వార్త రాష్ట్ర రాజకీయాల్లో చక్కర్లు కొడుతోంది. దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. వాస్తవానికి వైసీపీకి రాజీనామా చేయకముందే బీజేపీలో చేరాలని విజయసాయిరెడ్డి నిర్ణయించుకున్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అప్పట్లో బీజేపీ అధినాయకులతో సైతం దీనిపై ఆయన చర్చలు జరిపినట్లు సమాచారం. ఏమైందో ఏమోగానీ ఇప్పటివరకూ ఆయన బీజేపీలో చేరలేదు. ఇప్పుడు ఏకంగా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారంటూ రూమర్లు స్టార్ట్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Also Read: AP Ropeway projects: భక్తులకు పండగే.. ఆ ఆలయాలకు కొత్తగా రోప్ వే అందాలు..!
జగన్ కు చెక్ పెట్టడానికేనా!
ఒకవేళ విజయసాయిరెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే వైసీపీ అధినేత జగన్ కు చిక్కులు తప్పవని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ అండతో.. జగన్ కేసుల నుంచి సాయిరెడ్డి తేలిగ్గా బయటపడతారని అంచనా వేస్తున్నాయి. ఆ కేసుల్లో అప్రూవర్ గా మారి జగన్ ను విజయసాయిరెడ్డి ఇరించే అవకాశం లేకపోలేదని అభిప్రాయడపడుతున్నాయి. అటు రాజకీయంగా వైసీపీని సాయిరెడ్డి టార్గెట్ చేస్తారని చెబుతున్నాయి. ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ పై విజయసాయిరెడ్డి బహిరంగానే విమర్శలు చేశారు. ఆయన మారిపోయారని అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చేశానని తేల్చిచెప్పారు. అంతకుముందు జగన్ సైతం అవకాశవాది అని అర్థం వచ్చేలా విజయసాయిరెడ్డిపై పరోక్ష విమర్శలు చేశారు.
పురంధేశ్వరి పరిస్థితి ఏంటీ?
విజయసాయిరెడ్డి.. బీజేపీ అధ్యక్షుడు అయితే ప్రస్తుత ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari) పరిస్థితి ఏంటన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతోంది. అయితే ఆమెను కేంద్ర ప్రభుత్వం (Modi Govt)లోకి తీసుకుంటారని నెట్టింట ప్రచారం జరుగుతోంది. కేంద్రమంత్రిగా అవకాశం కల్పించి.. రాష్ట్ర బాధ్యతలను విజయసాయిరెడ్డి అప్పగించే యోచనలో బీజేపీ అధిష్టానం ఉందని చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై ఏపీ రాజకీయాల్లో భారీ స్థాయిలో చర్చ జరుగుతున్నప్పటికీ.. కషాయ దళాలు ఎక్కడా ఈ వార్తలను ఖండించకపోవడం ఆసక్తిరేపుతోంది. దీంతో మౌనం అర్ధాంగికారం అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.