Bowenpally Robbery Case: కంచె చేను మేసిందని తెలుగులో సామెత. కాపాడవలసిన కంచెను చేను ఎలా మేస్తుంది? అది మేసిందని చెప్పే మాయగాళ్లు, అవసరమైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వీడియోలు సృష్టించే కేటుగాళ్లు ఎప్పుడైనా ఉంటూనే ఉంటారు. మనం రోజూ ఎన్నో మోసాలు చూస్తుంటాం. ఇన్సురెన్స్ డబ్బుల కోసం భాగస్వామినే చంపిన కేసులు కూడా చూస్తుంటాం. తాజాగా అలాంటి కేసునే సికింద్రాబాద్ బోయిన్ పల్లి పోలీసులు చేధించారు. చివరికి ఫిర్యాదు చేసిన వాడే అసలు దొంగ అని తేల్చారు.
Stock Fraud Crime:సైబర్ క్రిమినల్స్ కు సాయం చేస్తూ.. అడ్డంగా బుక్కయ్యాడు
సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లిలో ఉన్న గ్లోబల్ అడ్సర్బెంట్ సంస్థలో అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఆఫీస్ భాయ్ గా పనిచేస్తున్నాడు. చిన్న జీతం కదా.. ఎంతకాలం ఈ బతుకు అనుకున్నాడో, లేక ఈ మధ్య దోపిడీ దారులు స్ఫూర్తి పొందినట్లు ఏ వెబ్ సీరిసో చూసి ప్రేరణ పొందాడో తెలియదు కానీ.. ఓ పెద్ద స్కెచ్ వేశాడు. ఆఫీసు డబ్బును తీసుకెళ్తన్నప్పుడు దాన్ని ఎవరో కొట్టేస్తే కంపెనీకి లాస్ వస్తుంది. కానీ అది మనమే కొట్టేస్తే మనకు అంత డబ్బు మనదవుతుంది. మరీ ఎవరు కొట్టేయాలి? ఎలా కొట్టేయాలి? ‘సినిమాలు సూడట్లేదేటీ?’. మనం డబ్బు తీసుకెళ్తుంటాం. మనం పెట్టిన మనుషులే మన మీద దొంగల్లా దాడి చేసి, వీలైతే రక్తాలు వచ్చేలా కొట్టి దాన్ని తీసుకుపోతారు. మరీ పోలీసులు? కంపెనీ కంప్లైంట్ ఇవ్వదా? వాళ్ల కంటే ముందు మనమే ఇద్దాం. అప్పుడు మన మీద అస్సలు డౌటు రాదు. ఇదీ సదరు ఆఫీసు బాయ్ వేసిన ప్లాన్.
తర్వాత ఏమైందీ?
ప్లాన్ అమలైంది. రూ. 5 లక్షలు అరుణ్ నొక్కేశాడు. కానీ పోలీసులను తప్పు దారి పట్టించేందుకు ముందే వెళ్లి స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కంపెనీకి చెందిన నగదును తీసుకువెళ్తున్న తన పై పోలీసు వేషధారణలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు వచ్చి దాడి చేసి డబ్బును ఎత్తుకు పోయారని అందులో పేర్కొన్నాడు. అరుణ్ ఇచ్చిన కంప్లైంట్ ను నోట్ చేసుకున్న పోలీసులు కూపీ లాగడం మొదలుపెట్టారు. చివరికి అసలు విషయం తేల్చారు. డబ్బును కాజేసింది అరుణే అని కనిపెట్టారు. విచారణలో భాగంగా నిజాన్ని ఒప్పుకున్నాడు. తానే కాజేసి తానే తప్పుగా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించాడు.