BJP on Hydraa: ఫాతిమా కాలేజీ కూల్చివేత అంశంపై బీజేపీ వర్సెస్ హైడ్రా (HYDRA) ఢీ అంటే ఢీ అంటున్నాయి. కూల్చివేత ఉండబోదని హైడ్రా ( HYDRA,) అధికారులు స్పష్టత ఇచ్చినా కమలం పార్టీ నేతలు ఏమాత్రం విమర్శలు తగ్గించడం లేదు. ఒవైసీ బ్రదర్స్‌కు చెందిన కాలేజీ కావడంతోనే కమల దళం ఈ ఇష్యూను నెత్తిన వేసుకున్నదనే విమర్శలు వస్తున్నాయి. కావాలని మతం రంగు పులుముతూ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నదనే చర్చ జోరుగా జరుగుతున్నది. అందుకే హైడ్రాను టార్గెట్ చేస్తున్నారనే పొలిటికల్ సర్కిల్స్‌లో తెగ మాట్లాడుకుంటున్నారు. హిందూత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీ, ఒవైసీ బ్రదర్స్‌కు చెందిన కాలేజీని కూల్చాలనే డిమాండ్‌తో పార్టీ మైలేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నదన్న విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల గురించి ఆలోచించకుండా ప్రతి అంశానికి మతం రంగు పులుముతున్నారని పలువురు మండిపడుతున్నారు.
ఎందుకు కూల్చరని వితండవాదం
సలకం చెరువులో నిర్మించిన ఫాతిమా కాలేజీ కూల్చివేత అంశంపై కమలం పార్టీ రాజకీయం చేస్తున్నది. పేదల ఇండ్లు కూల్చిన హైడ్రా అధికారులు, ఒవైసీ బ్రదర్స్‌కు చెందిన కాలేజీని ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నది. కేంద్ర మంత్రులు సహా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం ఈ అంశం చుట్టూ తీవ్రస్థాయిలో ప్రభుత్వాన్ని, హైడ్రాను టార్గెట్ చేశారు. దీనిపై ఇప్పటికే హైడ్రా క్లారిటీ ఇచ్చింది. అయినా బీజేపీ నేతలు విమర్శలు చేయడంపై పలువురు మండిపడుతున్నారు. రాజకీయ నాయకులు చేసిన కబ్జాలు, అక్రమ నిర్మాణాల్లో చేపట్టిన కట్టడాలపై ఏమాత్రం నోరుమెదపని కమలనాథులు, కేవలం ఫాతిమా కాలేజీని మాత్రం కూల్చాలని విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అంటున్నారు.
Als Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
హైడ్రా వాదనేంటి?
గతంలో ఫాతిమా కాలేజీ సహా, అనేక విద్య సంస్థలు చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించడంపై విద్యా సంవత్సరం పూర్తయ్యాక తొలగిస్తామని గతేడాది సెప్టెంబర్‌లో అధికారులు స్పష్టంచేశారు. వాటిపై విచారణ జరిపారు. అయితే, ఫాతిమా కాలేజీ విషయంలో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోకపోవడంతో హైడ్రాపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ కాలేజీ కూల్చివేతపై అధికారులు ఇటీవల స్పష్టతనిచ్చారు. ఫాతిమా ఒవైసీ ఉమెన్స్ కాలేజీ పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యనందిస్తున్నదని వివరించారు. పేదల నుంచి ఎలాంటి ఫీజులు తీసుకోబోరని, ఇతరుల నుంచి తీసుకున్నా చాలా తక్కువ ఫీజులు వసూలు చేస్తారని, ఇది పూర్తిగా స్వచ్ఛంద సంస్థ ద్వారా లాభాపేక్ష లేని పద్ధతిలో నడుస్తున్నదని పేర్కొన్నారు. దాదాపు 10 వేల మందికి పైగా పేద ముస్లిం బాలికలు, మహిళలు విద్యనభ్యసిస్తున్నారని క్లారిటీ ఇచ్చారు.
ఇతర కబ్జాలపై ఉక్కుపాదం
విద్యార్థుల భవిష్యత్తు కోసం హైడ్రా ఆలోచిస్తుండగా, బీజేపీ (BJP) తన పంథా మార్చుకోకుండా ఎంఐఎం జోలికి ఎందుకు వెళ్లరని ప్రశ్నలు వేస్తున్నది. ఈ నేపథ్యంలో హైడ్రా స్పందిస్తూ, 10 వేల మందితో నడుస్తున్న విద్యాసంస్థ కాబట్టి మానవతా దృక్పథంతో మాత్రమే కూల్చడం లేదని స్పష్టం చేసింది. కొందరు ఎంఐఎం నాయకులు, ఎమ్మెల్యేల ఆక్రమణ ప్రయత్నాలపై తాము కఠినంగా వ్యవహరించినట్లు వివరించింది. ఎలాంటి మెతక వైఖరి లేదని స్పష్టం చేసింది. నేషనల్ పోలీస్ అకాడమీ, శాస్త్రిపురం, శివరాంపల్లి, హైదరాబాద్ సమీపంలోని బమ్ రుక్న్ ఉద్ దౌలా లేక్ వద్ద ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేపట్టిన భవనాలు, ఆక్రమణలను కూల్చివేసినట్లు పేర్కొంది. దాదాపు ఈ ఒక్క ప్రాంతంలోనే రూ.1000 కోట్ల విలువైన అక్రమ కట్టడాలను అడ్డుకున్నట్లు వివరించింది. అలాగే, చాంద్రాయణగుట్టలోని ప్రభుత్వ భూమిలో ఎంఐఎం కార్పొరేటర్లకు చెందిన అనేక వాణిజ్య దుకాణాలను తొలగించి రూ.30 కోట్ల విలువైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా తెలిపింది.
రాంచందర్ రావుకు రాజాసింగ్ సవాల్
హైడ్రా ఏర్పాటై ఏడాది కాకముందే నిర్వీర్యమవుతోందన్న విమర్శలపై అధికారులు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఫాతిమా కాలేజీ కూల్చివేతపై పోరు చేపట్టి డమ్మీ కాదని నిరూపించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు. ఎందుకంటే రాంచందర్ రావు నియామకం అనంతరం ఆయన్ను డమ్మీ అని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ట్రోల్ చేశారు. అందుకే ఆయన డమ్మీ కాదని నిరూపించుకునేందుకు రాంచందర్ రావుకు ఇది మంచి అవకాశమని రాజాసింగ్ ఇటీవల స్పష్టం చేశారు. ఫాతిమా కాలేజీ కూల్చివేయాలన్న డిమాండ్‌పై లీగల్ టీమ్‌ను ఏర్పాటు చేయాలని రాజాసింగ్ సూచించారు. రాజకీయంగా ఈ అంశంపై ఎలా ఉన్నా సామాన్యులకో న్యాయం, ఒవైసీ బ్రదర్స్‌కు ఒక న్యాయమా అంటూ, మతం రంగు పులుముతూ జనంలోకి తీసుకెళ్లాలనేది బీజేపీ ప్లాన్‌గా అర్థం అవుతున్నదనే చర్చ జరుగుతున్నది.
Also Read: Bandi Sanjay: టీటీడీ ఏమైనా సత్రమా.. అన్యమతస్తులను తొలగించరా.. ఏపీ సర్కార్‌పై బండి ఫైర్!