Corporator Shashikala: నేను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగల్ హాట్ డివిజన్(Mangal Hat Division) పునర్విభజనను ఇష్టారాజ్యంగా చేసి, దత్తాత్రేనగర్, ఇందిరమ్మ నగర్ లను కలిపి అయోమయానికి గురి నేను ఓటమి పాలయ్యేందుకు కుట్రలు చేస్తున్నారని మంగల్ హాట్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ శశికళ మంగళవారం కౌన్సిల్ సమావేశంలో తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తనను ఓటమి పాలు చేసేందుకు పునర్విభజించిన వార్డులో ఒక వర్గం వారు ఎక్కువ నివసించే ప్రాంతాన్ని విలీనం చేశారని ఆరోపించారు. వార్డుల పునర్విభజనలపై అభ్యంతరాలను ఆహ్వానించగా, కార్పొరేటర్ శశికళ మాట్లాడుతూ.. నన్ను ఓడించేందుకే వార్డు పేరు మార్చి, ఇతర ప్రాంతాలను విలీనం చేశారని, అయినా నేను గెలిచి చూపిస్తానని సమావేశంలో సవాలు విసిరారు.
భౌగోలికంగా జిగ్ జాగ్ గా..
ప్రజలు ప్రజా ప్రతినిధులకు సమాచారం లేకుండా, వారి అభిప్రాయాలను తీసుకోకుండానే ఎలా వార్డుల పునర్విభజన చేస్తారని, నా డివిజన్ ను పునర్విభజించే హక్కు, నా ప్రమేయం లేకుండా అధికారులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. అభ్యంతరాలు సమర్పించేందుకు వెళ్లినపుడు అధికారులను ప్రశ్నించగా, మీ మంగల్ హాట్ డివిజన్ స్వరూపం భౌగోలికంగా జిగ్ జాగ్ గా ఉందని, అందుకే పునర్విభజించామని సమాధానం చెప్పారని తెలిపారు. అయితే చార్మినార్ డివిజన్ కూడా జిగ్ జాగ్ గా ఉంది కదా? ఆ డివిజన్ ను కూడా పునర్విభజించరా? అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సునీత మీరు అలా కౌన్సిల్ సమావేశంలో మాట్లాడటం సరి కాదని మేయర్ వ్యాఖ్యానించగా, నా పేరు సునీత కాదు, నా పేరు శశికళ అని కార్పొరేటర్ బదులిచ్చారు.
మనం ప్రజా ప్రతినిధులం
డీలిమిటేషన్ పై అభ్యంతరాలు స్వీకరించేందుకు నిర్వహించిన సమావేశంలో ప్రాంతీయత, వర్గాల గురించి మాట్లాడటం సరి కాదని మేయర్ సూచించగా, నేను ఎక్కడి నుంచి పోటీ చేసిన గెలిచే సత్తా ఉందని శశికళ సమావేశంలో సవాలు విసిరారు. అంతలో కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్(Baba Fasiuddin) మాట్లాడాలని మేయర్ ఆదేశించగా, మనం ప్రజా ప్రతినిధులం వర్గాలు, ప్రాంతీయత గురించి మాట్లాడొద్దని, ఎక్కడి నుంచి పోటీ చేసినా, గెలుస్తామన్న ధీమాతో ఉండాలని సూచించారు. మొత్తానికి సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు పునర్విభజనపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది ఒక ఎత్తైతే కార్పొరేటర్ శశికళ(Corporator Shashikala) స్పందించిన తీరు మరో ఎత్తు. ఆమె మాట్లాడిన తీరుకు ఇతర పార్టీలకు చెందిన సభ్యులు సైతం అవాక్కయ్యారు.
Also Read: Collector BM Santosh: పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో తేడా రావద్దు: కలెక్టర్ బి.ఎం.సంతోష్

