Bhoodan land Issue: భూదాన్ యజ్ఞ బోర్డ్ (Bhudan Yagna Board) పరిధిలోని భూములు అన్యాక్రాంతమైన సంగతి తెలిసిందే. దీనిపై కొన్నిరోజులుగా ఈడీ విచారణ జరుపుతోంది. తాజాగా ఈ కేసులో దూకుడు పెంచిన ఈడీ అధికారులు.. భూములు కొన్న ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేశారు. మేడ్చల్ జిల్లా నాగారంలోని సర్వే నెంబర్లు 181,182,194,195 లోని భూదాన్ బోర్డుకు చెందిన భూములను పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులు అక్రమంగా కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సదరు అధికారులకు నోటీసులు వెళ్లాయి.
హైకోర్టుకు ఐపీఎస్ లు
నాగారం పరిధిలోని భూదాన్ భూములను నిషేధిత జాబితాలో చేరుస్తూ హైకోర్ట్ సింగిల్ జడ్జ్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిని సవాలు చేస్తూ ముగ్గురు ఐపీఎస్ అధికారులు.. హైకోర్ట్ సీజే ధర్మసనాన్ని ఆశ్రయించారు. మహేష్ భగవత్, సౌమ్య మిశ్రా, స్వాతి లక్రా.. పిటిషన్ దాఖలు చేశారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేయాలంటూ ధర్మాసనాన్ని కోరారు. దీనిపై హైకోర్ట్ విచారణ చేపట్టనుంది.
సింగిల్ బెంచ్ తీర్పు ఇదే
నాగారంలోని భూదాన్ భూముల అక్రమ కొనుగోళ్లకు సంబంధించి మల్లేష్ అనే వ్యక్తి తొలుత హైకోర్ట్ ను ఆశ్రయించారు. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు.. నాగారం గ్రామం సర్వే నెంబర్లు 181, 182, 194, 195లలో భూములను తమ పేర.. తమ కుటుంబ సభ్యుల పేర రిజిష్టర్ చేయించుకున్నారంటూ ఆరోపించారు. దీని కోసం రెవెన్యూ రికార్డులను కూడా తారుమారు చేశారని తెలిపాడు. ఫోర్జరీ పత్రాలు సృష్టించి పట్టాదారు పాస్ బుక్కులు కూడా తీసుకున్నట్టు పేర్కొన్నాడు. దీంతో ఆయా సర్వే నెంబర్లలోని భూములను నిషేదిత జాబితాలో చేర్చాలంటూ హైకోర్ట్ సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. 27 మంది అధికారుల భూమిని నిషేధిత జాబితాలో పెట్టాలని సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది.
Also Read: CM Revanth Reddy: అందాల పోటీలపై సమీక్ష.. భద్రతపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
ఈడీ సోదాలు
భూదాన్ భూముల కేసుకు సంబంధించి సోమవారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. పాతబస్తీలోని యాఖుత్ పురా, మీర్ పేట ప్రాంతాల్లోని కొందరి ఇళ్లతోపాటు మొయినాబాద్ లో ఉన్న ఓ ఫార్మ్ హౌస్ పై దాడులు చేశారు. విస్తృత తనిఖీలు నిర్వహించిన ఈడీ అధికారులు భూదాన్ భూముల అమ్మకాలకు సంబంధించి పలు కీలక డాక్యుమెంట్లను సీజ్ చేసినట్టు సమాచారం.