Jagga Reddy on KCR: బీఆర్ఎస్ రజతోత్సవ సభ (BRS Silver Jubilee Meet)లో మాజీ సీఎం కేసీఆర్ (KCR) చేసిన కామెంట్స్.. తెలంగాణలో పొలిటికల్ హీట్ ను అమాంతం పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ పార్టీపై విమర్శలు గుప్పించిన కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు (Congress Leaders) మాటలదాడి చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మాట్లాడిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy).. కేసీఆర్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉంటూ ఎప్పుడూ ప్రతిపక్షంలోనే ఉండాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలో ఉండాలని ఆకాంక్షించారు.
ఎవరు గొప్ప?
కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి చేయలేదని కేసీఆర్ తప్పుడు సంకేతాలు ఇచ్చారని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంవత్సరం లోపు రూ. 22వేల కోట్లు రుణమాఫి చేశారని స్పష్టం చేశారు. కేసీఆర్ పది సంవత్సరాలలో చేసిన రుణమాఫీ రూ.20 వేల కోట్లేనని గుర్తుచేశారు. పదేళ్లలో రూ. 20 వేల కోట్లు చేసిన కేసీఆర్ గొప్పోడా? ఏడాదిలో రూ.22వేల కోట్లు రుణమాఫి చేసిన రేవంత్ రెడ్డి గొప్పోడా? ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు.
గత పాలనలో ఆర్టీసీ కనుమరుగు
రుణమాఫిపై చర్చించేందుకు కేసీఆర్ సిద్ధమేనా అని జగ్గారెడ్డి సవాలు విసిరారు. డిబేట్ కు కేసీఆర్ ఎక్కడికి వస్తాడో చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఫ్రీ బస్ లో సీట్లు దొరక్క ఆడవాళ్లు కొట్లాడుకుంటున్నారని కేసీఆర్ అనగా.. దానికి జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్లలో ఆర్టీసీని ప్రజలు మర్చి పోయారని ఆరోపించారు. ఆర్టీసీ కనుమరుగు అయ్యే పరిస్థితి తలెత్తిందని అన్నారు. కాంగ్రెస్ వచ్చాక రాహుల్ గాంధీ (Rahul Gandhi), సోనియా గాంధీ (Sonia Gandhi) డైరెక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ (TGRTC)కి జీవం పోశారని గుర్తుచేశారు. మహిళలకు ఉచిత బస్ (Free Bus Scheme) సౌకర్యం కల్పించాక మహిళలు గుడులకు, ఫంక్షన్ లకు పోతున్నారని అన్నారు.
సన్నబియ్యంపై హర్షం
మరోవైపు సన్నబియ్యం (Fine Rice Scheme) విషయంలో రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సన్న బియ్యం మీద బస్తాకు రూ.500 ఇస్తున్నందుకు రైతులు సైతం హ్యాపిగా ఉన్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికి స్వేచ్ఛ దొరికిందన్న జగ్గారెడ్డి.. సచివాలయంలో లోకి అందరూ స్వేచ్ఛగా వెళ్తున్నారని గుర్తుచేశారు. కేసీఆర్ హాయాంలో ఎవరినీ లోపలికి పోనివ్వలేదని పేర్కొన్నారు. కనీసం మీడియాకు సైతం సచివాలయంలోకి అనుమతి ఇవ్వలేదని జగ్గారెడ్డి అన్నారు.