Tollywood: టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) రిలీజ్‌కు బ్రేక్ వేస్తున్నదెవరు? అసలు వైసీపీకి (YSRCP) ఈ రిలీజ్‌కు సంబంధం ఉన్నదా? బియ్యం స్మగ్లింగ్ కేసు (సీజ్ ద షిప్ ఇష్యూ)కు, థియేటర్స్ బంద్ గొడవకు లింక్ ఉందా? అంటే ఎవరికి తోచినట్లుగా వారు చెప్పుకుంటున్నారు. నాలుగైదు రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయన పేరు మార్మోగిపోతోంది. ఇప్పటికే టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్‌లో ఒకరైన అల్లు అరవింద్ (Allu Aravind) వివరణ ఇవ్వగా.. తాజాగా తనకు ఎలాంటి సంబంధం లేదు బాబోయ్ అని వైసీపీ నేత ఓ ప్రకటన రూపంలో వివరణ ఇచ్చుకున్నారు. అయినా సరే పవన్‌ను అడ్డుకునే సాహసం ఎవరు చేస్తున్నారనే విషయం మాత్రం ఇప్పటికీ బయటికి రాలేదు. ఇంతకీ ఆ వైసీపీ నేతకు సంబంధం ఉందా? లేదా? అసలు ఆయన ఇంత సాహసం చేస్తారా? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ‘స్వేచ్ఛ’ ప్రత్యేక కథనం.
Read Also- Kavitha: కేసీఆర్ దేవుడే కానీ.. ఉసూరుమనిపించిన కవిత..!
సీజ్ ద షిప్ నుంచి..!
వైసీపీ కీలక నేత మరెవరో కాదండోయ్.. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి (Dwarampudi Chandrasekhar Reddy). జనసేన (Janasena) ఆవిర్భావం నుంచి నేటి వరకూ పవన్-ద్వారంపూడిలకు అస్సలు పడదు. ఎంతలా అంటే ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేంతలా. వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు సేనాని గురించి ఏం మాట్లాడారో? ఎన్నెన్ని మాటలు అన్నారో? ఏ రేంజిలో సవాళ్లు విసిరారో? తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ గుర్తుండే ఉంటుంది. ఇందుకు పవన్ కళ్యాణ్ సైతం ‘తగ్గేదేలే’ రెట్టింపుగా ప్రతి సవాళ్లు విసిరారు కూడా. ఆఖరికి ఒకరిపై ఒకరు ఎన్నికల్లో పోటీచేయాలని కూడా అనుకున్నారు. తీరా చూస్తే.. పవన్ పిఠాపురం వెళ్లి పోటీ చేశారు. ఇక ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ద్వారంపూడి అక్రమ ద్వారాలన్నీ పవన్ మూసేశారు. అక్రమ రేషన్ బియ్యం రవాణా, ఫ్యాక్టరీలు, అక్రమ నిర్మాణాలు, ఎక్స్‌పోర్ట్ బిజినెస్‌లు ఇలా ఒకటా రెండా అన్నింటినీ మూసేయించడంపైనే సుమారు ఆరేడు నెలలపాటు డిప్యూటీ సీఎం ప్రత్యేక దృష్టిపెట్టారు. దీంతో ద్వారంపూడి బ్రదర్స్‌కు చావు దెబ్బ తగిలినట్లు అయ్యింది. నాటి టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ద్వారంపూడి బిజినెస్‌లు టచ్ చేయడానికి ఎవ్వరూ సాహసించలేదు. అయితే పవన్ మాత్రం స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ ద్వారంపూడి ద్వారాలు శాశ్వతంగా క్లోజ్ చేసేశారు. మరీ ముఖ్యంగా కాకినాడ పోర్టులో ‘సీజ్ ద షిప్’ అంటూ పవన్ కళ్యాణ్ రేషన్ బియ్యం సీజ్ చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. దీనివెనుక కర్త, కర్మ, క్రియ అంతా ద్వారంపూడే అని చెప్పుకుంటూ ఉంటారు కానీ, ఎక్కడా ఆధారాలు బయటికి రాలేదు. సీన్ కట్ చేస్తే.. కొద్దిరోజుల్లోనే షిప్ పోయింది.. సీజ్ పోయింది.. ఆఖరికి బియ్యం కూడా వెళ్లిపోయాయ్. అయితే నాడు పవన్ ‘సీజ్ ద షిప్’ (Seize The Ship) నుంచి నేటి ‘సీజ్ ద సినిమా’ (Seize The Cinema) వరకూ అది పాకిందని.. ఇదంతా ద్వారంపూడి రివెంజ్ తీర్చుకున్నారన్నది ఇప్పుడు నడుస్తున్న టాక్.
Read Also- YS Jagan: వైఎస్ జగన్ షాకింగ్ ప్రకటన.. ఆశ్చర్యపోయిన నేతలు!
వైసీపీ ఆటలు ‘నలుగురు’!
వాస్తవానికి థియేటర్స్ బంద్ కుట్ర వెనుక ద్వారంపూడి ఉన్నారన్నది జనసేన నేతలు, కార్యకర్తలు.. మెగాభిమానులు ప్రధానంగా ఆరోపిస్తున్న విషయం. గత కొన్నిరోజులుగా ఇదో బర్నింగ్ టాపిక్ అయ్యింది. అంతేకాదు.. ‘ఆ నలుగురు’ పవన్ సినిమాలకు బ్రేక్ వేస్తున్నారని ఏదైతో చర్చ జరుగుతోందో వారంతా వైసీపీ ఆటలో పావులు అయ్యారని టాక్ నడుస్తున్నది. ఈ మొత్తం వ్యవహారంలో తన వ్యాపారాలకు బ్రేక్ వేసిన పవన్‌పైన రివెంజ్ తీర్చుకోవడానికే ద్వారంపూడి థియేటర్ల బంద్ కుట్రలో తలదూర్చారని ఆరోపిస్తున్నారు. ఎందుకంటే.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని థియేటర్లలో మెజారిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధీనంలో ఉన్నాయన్నది జగమెరిగిన సత్యమే. అందుకే ఇక్కడ మీట నొక్కితే టాలీవుడ్ ఇండస్ట్రీలో బల్బు వెలగిందట. టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ నిర్మాతల్లో ఒకరు, స్టూడియోలతో పాటు డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌లోనూ కీలకంగా ఉన్న ఓ వ్యక్తితో ద్వారంపూడికి వ్యాపార సంబంధాలు కొన్నేళ్లుగా సాగుతున్నాయని ఫిలింనగర్ వర్గాలు బల్ల గుద్ది మరీ చెబుతున్నాయి. అంతేకాదు.. డిస్ట్రిబ్యూషన్ పరంగా కూడా ఈ ఇద్దరూ పార్టనర్స్ అని టాక్. అందుకే పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ వేయాలని వైసీపీ ఆడిన ఆటే ఈ బంద్ అని ప్రచారం జరుగుతోంది. ఆ నలుగురిని పావులని చేసి వెనకుండి కథ మొత్తం ద్వారంపూడి నడిపిస్తున్నారని తెలుగు రాష్ట్రాల్లో, సినీ ఇండస్ట్రీలో చర్చ నడుస్తున్నది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్స్‌కు గొడవలు పెట్టి, పవన్ కళ్యాణ్ వర్సెస్ సినిమా ఇండస్ట్రీ చేయాలని చూసి ‘ఆ నలుగురు’ గోతిలో బొక్కా బోర్లా పడ్డారాని తెలుస్తున్నది. ఆ నలుగురిలో ఒక్కరు అని చెప్పుకునే నిర్మాత అల్లు అరవింద్ మీడియా ముందుకొచ్చి.. ‘ఆ నలుగురు’, వారి కబంధ హస్తాల్లోనే ఇండస్ట్రీ ఉన్నట్టుగా చిత్రీకరించడం ఎంతవరకు సబబు? అని ప్రశ్నించారు. ఆ నలుగురికి తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఆ నలుగురిలో తాను లేనని.. ఆ నలుగురు ఇప్పుడు పది మంది అయ్యారని వివరణ ఇచ్చుకున్నారు.
Read Also- Allu Aravind: పవన్ కళ్యాణ్ చెప్పింది 100 శాతం నిజం? ఆ నలుగురిలో నేను లేను!
నాకేం సంబంధం..?
‘ఆ నలుగురు’నీ ముందుకు నడిపిస్తున్నది ద్వారంపూడేనని.. ఆయనపై లేనిపోని ఆరోపణలు, అంతకుమించి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఓ ప్రకటన రూపంలో ఫుల్ క్లారిటీ ఇచ్చుకున్నారు. ‘ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల కాకుండా తనతోపాటు కొంతమంది సినీ నిర్మాతలు కుట్ర పన్నారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. జూన్-01 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలన్న ప్రతిపాదన సినీ పరిశ్రమ, థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్లకు సంబంధించిన అంతర్గత వ్యవహారం. ఈ అంశంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. పూర్తిగా సినీ పరిశ్రమకు సంబంధించిన ఈ వ్యవహారంలో నిర్మాతల మండలి ప్రతినిధి నట్టి కుమార్ (Natti Kumar) చేసిన వ్యాఖ్యలను ఏమాత్రం ధృవీకరించుకోకుండా కొన్ని మీడియా సంస్థలు అనవసరంగా నా పేరును వాడి వివాదం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వివాదంలో నా పాత్రపై ఏమైనా ఆధారాలు ఉంటే చూపించి, విమర్శలు చేయాలి. నిజ నిర్ధారణ చేసుకోకుండా సినీ పరిశ్రమ వివాదంలోకి నన్ను లాగడం ఎంతవరకు సమంజసం? ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమకు చెందిన ఏ ఒక్కరిని నేను కలవలేదు, చేసిన ఆరోపణలు రుజువు చేయగలరా? రాజకీయాల్లో ఉన్నాననే అక్కస్సుతో ఏదో ఒక వివాదంలోకి లాగి తప్పుడు విమర్శలు చేయడం, అబద్ధాన్ని నిజం చేసేలా పదేపదే ప్రసారం చేయడం ఎంతవరకు సమంజసం? జూన్-01 నుంచి థియేటర్ల బంద్‌కు సంబంధించిన అంశంతో సహా ఏ ఒక్క సినీ పరిశ్రమ వివాదంలో నా పాత్ర లేదు. నిరాధారమైన ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను’ అని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నవారిని ద్వారంపూడి హెచ్చరించారు.
ఇప్పుడేమంటారు.. అసలు అంత సీన్ ఉందా!?
ఆ నలుగురు అంటూ సాగిన ప్రచారంలో ఒక్కొక్కరుగా బయటికొచ్చి వివరణ ఇచ్చుకోవడంతో గట్టిగానే హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ, ప్రభుత్వం నుంచి విమర్శలు చేస్తున్న వారు.. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో సినీ ఇండస్ట్రీని అందులోనూ పవన్ సినిమాను టచ్ చేయాల్సిన అవసరం వైసీపీకి గానీ, ద్వారంపూడికి ఉన్నదా? అంటే అస్సలు లేనే లేదని చెప్పుకోవాలి. అసలే ప్రభుత్వంలో, అందులోనూ డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన సినిమాల రిలీజ్ టైమ్‌లోనే థియేటర్ల బంద్ చేయాల్సిన, అసలు ఆ సాహసం చేయాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు.. ఉండదు కూడా. ఇందులో ఏ మాత్రం సందేహాలు అక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే.. నాడు వైసీపీ అధికారంలో ఉండగా విర్రవీగిన ఒక్కొక్కరి పరిస్థితి, జైల్లో ఊచలు లెక్కెడుతున్న సిట్యుయేషన్ కళ్లారా చూస్తూ కూడా ఇలా చేయగలరా? అంటే అబ్బే అస్సలు చేయరు గాక చేయరన్నది జగమంతా తెలుసు కూడా. అయినా సినీ ఇండస్ట్రీ, ప్రభుత్వంలో పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి అసలు ఎక్కడ లోటు ఉంది? ఏం చేయాలి? ఎలా ముందుకెళ్లాలి? అని చూసుకోవాలే కానీ.. ఇలా లేఖ రిలీజ్ చేయడాన్ని కూడా కొందరు తప్పుపడుతున్నారు. ఇప్పుడీ వ్యవహారం ఇంకా ఎంత వరకూ వెళ్తుందో.. చివరికి ఏమవుతుందో అన్నది చూడాలి మరి.
Read Also- YS Jagan: ఏ క్షణమైనా వైఎస్ జగన్ అరెస్ట్.. వైసీపీలో నరాలు తెగే టెన్షన్!