YS Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని (YS Jagan Mohan Reddy) ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్ కేసులో (AP Liquor Scam Case) ఇప్పటికే పెద్ద తలకాలయలను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇక మిగిలున్నది ఇద్దరే అందులో ఒకరు ఎంపీ మిథున్ రెడ్డి, ఇంకొకరు వైఎస్ జగన్ అని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇన్నాళ్లు జగన్‌కు ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్‌తో అధినేత అరెస్ట్ ఖాయం అని.. ఇక మిగిలింది ఒకే ఒక్క జగనే అని వైసీపీ నేతలు, కార్యకర్తలే చర్చించుకుంటున్న పరిస్థితి. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఇదివరకే జగన్ అరెస్ట్‌పై రాష్ట్ర గవర్నర్ దగ్గర చర్చ జరిగినట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే అరెస్ట్ తర్వాత పరిస్థితేంటి? అని గవర్నర్ కాస్త ఆలోచనలో పడ్డారని తెలిసింది. ఇక ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ అనుమతికే టీడీపీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Read Also-AP Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. పెద్ద తలకాయల అరెస్ట్
ఓకే అంటే అరెస్టే..!
ఇటీవలే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ‘ఆపరేషన్ సింధూర్’ నేపథ్యంలో సమావేశం అయినప్పటికీ, లోలోపల మాత్రం లిక్కర్ స్కామ్ వ్యవహారంపైనే సుదీర్ఘ చర్చ జరిగిందని తెలిసింది. ముఖ్యంగా వైఎస్ జగన్ అరెస్టుపై గవర్నర్ అనుమతి కోసమే కలిశారన్నది ఇన్‌సైడ్ టాక్. అసలు లిక్కర్ కేసు ఏంటి? కోర్టులు ఏం చెబుతున్నాయి? ఇందులో మాజీ సీఎం పాత్ర ఏమిటి? అరెస్ట్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో.. ఏంటో? ఇలా ఒకటా రెండా పదుల సంఖ్యలో ప్రశ్నలు సంధించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. బాబు, పవన్‌లు వివరంగా చెప్పినప్పటికీ గవర్నర్ ఒప్పుకోలేదని సమాచారం. అయితే ఎన్డీఏలో కూటమిలో పెద్ద తలకాయ, ప్రధాని నరేంద్ర మోదీతో కూడా ఈ విషయాలు చెబితే బాగుంటుందని గవర్నర్ చెప్పినట్లుగా తెలిసింది. అందుకే యువనేత, మంత్రి నారా లోకేష్ ఇవాళ ప్రధాని మోదీని కలవబోతున్నట్లుగా పెద్ద ప్రచారమే జరుగుతోంది. ఎందుకంటే అనంతపురంలో మూడ్రోజుల పాటు పర్యటన చేయాల్సి ఉన్నప్పటికీ ఉన్నఫలంగా ముగించుకొని అమరావతి చేరుకున్నారు. మరుసటి రోజే కుటుంబ సమేతంగా ఢిల్లీకి చినబాబు పయనం అవుతున్నారు. ఆ మధ్య అమరావతి రీ లాంచింగ్ వచ్చినప్పుడు కుటుంబంతో ఢిల్లీకి రావాలని లోకేష్‌కు మోదీ సూచించారు. అయితే అపాయింట్మెంట్ దొరకడంతో ఇప్పుడు హస్తినకు లోకేష్ వెళ్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. కానీ, అసలు విషయం మాత్రం జగన్ అరెస్ట్ గురించేనని స్పష్టంగా అర్థమవుతోందని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. అటు మోదీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆలస్యం.. ఇటు క్షణాల్లోనే జగన్ అరెస్ట్ ఉంటుందని టీడీపీ, వైసీపీ శ్రేణులు ట్విట్టర్ వేదికగా సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. దీంతో జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తల్లో నరాలు తెగే టెన్షన్ నెలకొంది.
Read Also- TDP MLA: రాత్రిపూట మహిళా ఎమ్మార్వోకు టీడీపీ ఎమ్మెల్యే ఫోన్.. పచ్చి బూతులు.. సీఎం ఏం చేస్తున్నట్లు?
ఒకట్రెండు రోజుల్లోనే..!
సోషల్ మీడియా వేదికగా జగన్ అరెస్ట్ అంటూ వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తునే పోస్టులు పెడుతున్నారు. ఏ క్షణమైనా వైఎస్ జగన్ అరెస్ట్ అని కొందరు అంటుంటే.. రెండు మూడ్రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనమే అని, జగన్ అరెస్ట్ పక్కా అంటూ మరికొందరు ఎక్స్ వేదికగా ట్వీట్లు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఎప్పుడైతే ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్ట్ చేశారో అప్పట్నుంచి ఇక నెక్స్ట్ వికెట్ జగన్ అని వైసీపీ ఫిక్స్ అయిపోయింది. మరోవైపు మీడియా ముందుకొచ్చి వైసీపీ కీలక నేతలు, మాజీ మంత్రులు.. జగన్‌ను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారని చెబుతున్నారు. జగన్ టార్గెట్‌గా అక్రమ కేసులు పెడుతున్నారని.. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఏమీలేని కేసుల్లో సిట్ అంటూ ఏర్పాటు చేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారని పేర్ని నాని వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ స్కామ్‌లో సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ధనుంజయ, కృష్ణమోహన్ రెడ్డిలను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరుతున్నది. అయితే సిట్ అభ్యర్థనను అంగీకరించొద్దని, రిమాండ్ రిపోర్టు రిజెక్ట్ చేయాలని వారి తరఫున న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఇద్దరి పాత్ర చాలానే ఉందని, ఇంకా లోతుగా విచారించాల్సిన పరిస్థితి ఉందని, బయట ఉంటే సాక్షులు ప్రభావితం చేస్తారని సిట్ ఆరోపిస్తున్నది. ఇప్పటికే కొన్ని కీలక సాక్షులను ప్రభావితం చేశారని ఏసీబీ న్యాయవాదులు చెబుతున్నారు. మొత్తానికి చూస్తే.. ఇప్పుడు బంతి మోదీ కోర్టులో ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీతో బీజేపీ.. బీజేపీతో వైసీపీ నేరుగా పొత్తు పెట్టుకోనప్పటికీ గత ఆరేళ్లుగా మంచి మిత్ర బంధమే ఉన్నది. ఆ బంధం ఇప్పటికీ కొనసాగుతున్నది కూడా. ఈ పరిస్థితుల్లో మోదీ నోట.. ఓకే కానివ్వండి అని అంటారా? లేకుంటే ఆ సాహసమే చేయొద్దని అంటారా? అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.
Read Also-Vallabhaneni Vamsi: వంశీకి తీవ్ర అస్వస్థత.. హైదరాబాద్‌కు తరలింపు!