YS Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్‌లో తప్పకుండా వైసీపీ అధికారంలోకి వస్తుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉద్ఘాటించారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని, 2029 వరకు ఎదురుచూడాల్సిన అవసరం లేదని ఒకింత షాకింగ్ ప్రకటనే చేశారు. రానున్న ఎన్నికలకు అందరూ దానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇప్పట్నుంచే ప్రజల్లోకి వెళ్లాలని, ప్రజల సమస్యలు పరిష్కరించేలా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పార్టీ నేతలకు జగన్ సూచించారు. త్వరలోనే తాను ప్రజల మధ్యకు వస్తానని స్పష్టం చేశారు. ప్రజా క్షేత్రంలో ఎలాంటి సమస్య ఎదురైనా సరే తనకు చెప్పాలని, అంతర్గత వివాదాలు అస్సలు ఉండొద్దని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ ప్రకటనతో నేతలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఒకింత ఆశ్చర్యపోయారు. ఇటీవల కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఇబ్బందిగా ఉందన్న సమాచారం అధినేతకు అందిన పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్.. పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు సహా పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలపై జగన్ వారితో చర్చించారు.
కీలక బాధ్యతలు..
‘ చాలా ముఖ్యమైన వ్యక్తులుగా భావించిన వారినే పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులుగా నియమించాం. పార్టీ నిర్మాణంలో ఎవరైతే క్రియాశీలకంగా ఉండగలుగుతారు. ఎవరైతే పార్టీని నడపగలుగుతారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే పార్టీకి బలంగా ఉపయోగపడతారని చాలా అధ్యయనం చేసిన తర్వాత, మీకు ఈ బాధ్యతలు అప్పగించాం. మీలో అందరూ నాతోనే నేరుగా సన్నిహిత సంబంధాలు ఉన్న వారు. ఏం జరుగుతున్నా నాతోనే నేరుగా చెప్పగలిగే చనువు మీ అందరికీ ఉంది. పార్టీని పూర్తిగా బలోపేతం చేయడం మీద మనం ప్రధానంగా ధ్యాస పెట్టాం. జిల్లా స్థాయి నుంచి గ్రామంలో బూత్ కమిటీల నిర్మాణం వరకు ప్రత్యేక ధ్యాస, శ్రద్ధ పెట్టాం. గడిచిన 11 నెలల కాలంగా ఆ దిశలోనే అడుగులు వేశాం. అందులో భాగంగానే జవసత్వాలు నింపి జిల్లా అధ్యక్షులుగా కొత్తవాళ్లను నియమించాం. జిల్లా కమిటీల నుంచి బూత్ కమిటీల వరకు అన్ని పూర్తి చేసే బృహత్తర బాధ్యతను జిల్లా అధ్యక్షులకు అప్పగించాం. జిల్లా అధ్యక్షులు ఒక్కరే ఈ పూర్తి బాధ్యత నెరవేర్చలేరు. వాళ్లకు కూడా సరైన సపోర్ట్ మెకానిజమ్ క్రియేట్ అయితేనే వాళ్ల బాధ్యతను వాళ్లు సక్రమంగా చేయగలుగుతారు. ఆ సపోర్ట్ ఎకో సిస్టంలో భాగంగానే రీజినల్ కోఆర్డినేటర్లను తీసుకొచ్చాం. రీజియన్‌ను వారు కోఆర్డినేట్ చేస్తూ, జిల్లా అధ్యక్షులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ.. వాళ్లతో పని చేయిస్తారు. అప్పుడే పని సులభం అవుతుంది’ అని వైఎస్ జగన్ చెప్పారు.
సమన్వయంతోనే..
‘ జిల్లాలో ఏదైనా నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేయాలన్నా రీజినల్ కోఆర్డినేటర్లతో పాటు, మీరు కూడా మరింత మమేకమై పని చేయాలి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఆ పార్లమెంటు నియోజకవర్గంతో సంబంధం లేని వ్యక్తిని, ఆ పార్లమెంటు నియోజకవర్గంతో బావోద్వేగం లేని వాళ్లను, అల్టిమేట్‌గా పార్టీ కోసం పనిచేసే వారిని నియమించాం. పార్టీ ఇంట్రెస్ట్ మాత్రమే మనసులో పెట్టుకుని పార్టీ అభ్యర్ధులను బలోపేతం చేయడానికి టైం కేటాయించే వ్యక్తులనే నియమించాం. వీళ్లు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తకు ఉపయోగపడే విధంగా పని చేస్తారు. రీజినల్ కోఆర్డినేటర్లకు కాళ్లూ చేతులుగా పార్లమెంటరీ పరిశీలకులు పని చేస్తారు. వీళ్ళను ఆయా రీజినల్ కోఆర్డినేటర్లతో మ్యాపింగ్ చేస్తాం. పార్లమెంటరీ పరిశీలకులు జిల్లా అధ్యక్షులతో మమేకం అయి పని చేయాలి. పార్టీ కమిటీల నియామకాల్లో ఆయా జిల్లా అధ్యక్షులతో కలిసి పని చేయాలి. జిల్లా కమిటీల నుంచి, బూత్ కమిటీల వరకు జిల్లా అధ్యక్షులకు సహాయకారిగా ఉండాలి. కమిటీల నియామకాల ప్రక్రియలో ఆ నియోజకవర్గ సమన్వయకర్తతో పని చేసేందుకు జిల్లా అధ్యక్షుడితో కలిసి పని చేస్తూ వారికి తోడ్పాటును అందిస్తారు. మీకు ఏ సమస్య ఉన్నా రీజనల్ కో ఆర్డినేటర్ ఉంటారు’ అని నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు.

పని చేయండి.. మీ బాధ్యత నాది
‘ మీరు పని చేయండి. మీ బాధ్యత నాది. మిమ్నల్ని సముచిత స్ధానాల్లో కూర్చోబెట్టే బాధ్యత నాది. అయితే మీ దగ్గర నుంచి నేను అదే రకమైన కమిట్‌మెంట్ ఆశిస్తున్నాను. ప్రతి నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉంది. పార్టీని వ్యవస్థీకృతంగా బలోపేతం చేయడంపై చాలా సీరియస్‌గా దృష్టి పెట్టాం. చాలా పెద్ద కార్యక్రమం చేస్తున్నాం. బూత్ కమిటీల దగ్గర నుంచి గ్రామస్ధాయిలో ఎన్‌రోల్‌మెంట్ చేయాలి. వైయస్సార్సీపీ స్థాపించి 15 ఏళ్లు అయింది. వైయస్సార్సీపీ ప్రతి గ్రామంలో బలంగా ఉంది. దీన్ని మరింత ఆర్గనైజ్డ్‌గా తీసుకుని రావాలి. గ్రామ కమిటీ సభ్యుడిగానో, బూతు కమిటీలోనో, మహిళా కమిటీ సభ్యురాలిగానో.. ఇలా ఏదో ఒక చోట ప్రతి కార్యకర్తను తీసుకుని రావాలి. బూత్ కమిటీల నియామకం పూర్తయ్యే సరికి పార్టీ నిర్మాణంలో దాదాపుగా 18 లక్షల మంది ఉంటారు. వారికి ఇన్సూరెన్స్ కచ్చితంగా చేస్తాం. వారి ఆలనా పాలన చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటికే పార్టీ నిర్మాణంలో 94 శాతం మండల అధ్యక్షుల నియామకం, 54 శాతం మండల కమిటీల నియామకాలు పూర్తి అయ్యాయి. అనుబంధ విభాగాలకు సంబంధించి 9 వేల మంది అధ్యక్షులను నియమించాం. మే నెలాఖరులోగా మండల కమిటీలు పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేయాలి. అప్పుడు మండల కమిటీలు గ్రామ స్థాయి కమిటీల నియామకాలను పర్యవేక్షిస్తాయి. జూలై ఆఖరు నాటికి మున్సిపాలిటీ, గ్రామస్దాయి విలేజ్ కమిటీల నియామకాలు పూర్తి కావాలి. ప్రతి మున్సిపాలిటీలో డివిజన్ ప్రెసిడెంట్ నియామకాలు పూర్తి కావాలి. కార్పొరేటర్ ఉన్నా కూడా డివిజన్ ప్రెసిడెంట్‌ను నియమించాలి’ అని పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ పరిశీలకులకు వైఎస్ జగన్ నిర్దేశించారు.
Read Also- Khans of Bollywood: ‘ఆపరేషన్ సింధూర్’పై ఒక్క ఖాన్ కూడా స్పందించలే.. వీళ్లు మనకి అవసరమా?