Swetcha
లేటెస్ట్ న్యూస్, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Journalism: నిజాయితీ జర్నలిజంపై కబ్జాకోరుల కుట్రలు సాగవు

Journalism: నిజం నిప్పులాంటిది. కుతంత్రాలతో నీళ్లు జల్లే ప్రయత్నం చేసినా ఆరదు. అగ్నిగుండంలా మండుతూనే ఉంటుంది. అవినీతిపై మండే బ్రహ్మాస్త్రంలా ఎక్కు పెడుతూనే ఉంటుంది. కార్పొరేట్ శక్తులు, అవినీతిపరులు అందరూ కలిసి ఎన్ని కుట్రలు పన్నినా వాటిని ఛేదించుకుని కలం నిజమే రాస్తుంది. అది అగ్నిపర్వతంలా మండుతూనే ఉంటుంది. అక్రమార్కుల గుండెల్లో గునపం దింపే వార్తలు వస్తూనే ఉంటాయి. నిజాన్ని నిర్భయంగా, స్వేచ్ఛాయుతంగా రాస్తూనే ఉంటాం.


‘స్వేచ్ఛ’ డిజిటిల్ పత్రిక మొదలై ఏడాదిన్నర కాలం అవుతున్నది. ఈ 18 నెలల కాలంలో ఎన్నో అక్రమాలు బయటపెట్టాం. అవినీతిపరుల బండారమే కాదు వ్యవస్థలను మ్యానేజ్ చేస్తూ పబ్బం గడుపుతున్న ఆక్రమణదారుల గుట్టంతా జనం ముందు ఉంచాం. డిజిటల్ పత్రికకు ఆర్ఎన్ఐ కావాలనే మస్కా కొట్టే వాళ్లకు ఇది అర్థం కాదు. ఎక్కడ కబ్జా పెడదామా, ఎవరిని ముంచేద్దామా అనే యావ తప్పిదే ఇలాంటివేం తెలుస్తాయి. సాధారణ పత్రికకు ఈ – పేపర్‌కు డిజిటల్‌కు తేడా తెలియని కబ్జాకోరులు జర్నలిజం ముసుగులో నడిపే డిజిటల్ పత్రికల్లో పిచ్చి రాతలు రాసినంత మాత్రాన ప్రజల్లో ‘స్వేచ్ఛ’పై, నాపై ఉన్న ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్ గుర్తింపు చెరిగిపోదు. నీకు వ్యతిరేకంగా వార్త రాగానే తప్పుడు ప్రచారం మొదలుపెడతావా, అసలు ‘స్వేచ్ఛ’ గురించి, నా గురించి ఏం తెలుసు.

రాజకీయ, కార్పొరేట్ ఒత్తిళ్లకు తలొగ్గి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇవ్వలేని వార్తలను సైతం ఏడాదిన్నర కాలంలో ‘స్వేచ్ఛ’ స్వేచ్ఛాయుతంగా ఇచ్చింది. అవినీతి, అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టించింది. ప్రజా క్షేమం కోసం ఇచ్చిన వార్తలతో అధికార యంత్రాంగాన్ని కదిలించి సమస్యలకు పరిష్కార మార్గం చూపేలా చేసింది. సర్వే, అంచనాలు అంటూ తిమ్మిని బమ్మిని చేసే మీలాంటి అజ్ఞానులకు ఇవేమీ కనిపించవు. సోషల్ మీడియా, బ్లాగులు, ఇతర ప్లాట్ ఫామ్స్ ద్వారా దేశంలో ఎన్నో సంచలన విషయాలు వెలుగుచూశాయి. చివరకు న్యాయ వ్యవస్థలు సైతం వాటిని అంగీకరించాయి. ఇది తెలియని మూర్ఖులు పాతకాలం పద్ధతిలో ఆర్ఎన్ఐ అంటూ డ్రామాలు చేస్తే నమ్మే వారెవరు. ‘స్వేచ్ఛ’ ఎదుగుదలను చూసి ఒర్వలేక ఎన్ని కుట్రలు చేసినా నిజం నిప్పులాంటిది. ఎన్నో రకాల ముసుగుల్లో కొనసాగుతున్న అక్రమార్కులను, మోసగాళ్లను ‘స్వేచ్ఛ’ వదిలిపెట్టదు.


ఇక, 18 ఏండ్ల నా జర్నలిజం వృత్తిలో ఎన్నో విజయాలు చూశా. ఎందరో అక్రమార్కుల బండారాన్ని బయటపెట్టా. ఆరేళ్లుగా ఇన్వెస్టిగేటివ్ కథనాలను ఇస్తున్నా. ఎవరూ వేలెత్తి చూపలేదు. అవినీతి, అక్రమాలపై నిజాయితీగా నా పోరాటం కొనసాగుతున్నది. ఇప్పటికాలంలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇన్వెస్టిగేషన్‌ కథనాలు కరువయ్యాయి. మచ్చుకగా కూడా కనిపించడం లేదు. కానీ ధైర్యంగా నా బై లైన్ పేరుతో ఎవరికీ భయపడకుండా, బెదరకుండా ఇస్తున్నా. ఎవరూ టచ్ చేయని అంశాలపై ఇన్వెస్టిగేషన్ చేసి ప్రజల ముందు ఉంచుతున్నా. చీటర్స్, అక్రమార్కులు, కబ్జాకోరుల బండారాన్ని బయటపెడుతున్నా. అందుకే అవినీతి అధికారులకు, కబ్జాకోరులకు నేనంటే హడల్. పక్కా ఆధారాలతో రాయడమే నాకు తెలుసు. ఎవరైనా పరిచయం అయితే ఎక్కడ వార్తకు ఆటంకాలు వస్తాయోనని ఎవరినీ అతిగా కలుపుకొని వెళ్లని తత్వం నాది. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎందరో అవార్డులు ఇస్తానన్నా తీసుకోలేదు. అలాంటి నా వ్యక్తిత్వాన్ని దెబ్బకొట్టేందుకు మీలాంటి నీచపు రాజకీయాలు పనిచేయవు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు సొంత ఈ – పేపర్లలో అవాకులు చెవాకులు పేలుతారా? వందకు పైగా ఎఫెక్టెడ్ కథనాలతో యంత్రాంగంలో కదలికలు తీసుకొచ్చా. ఒక్కరితోనైనా బ్లాక్ మెయిల్ చేసినట్లు ఒప్పించే దమ్ము ఉందా? గుంటూరు మస్తాన్ హైదరాబాద్‌లో కబ్జా చేసింది వాస్తవం కాదా? వంద కోట్ల రూపాయల భూమిని 2 కోట్ల రూపాయలకు కొట్టేశాడని వార్త రాస్తే అంత ఉలుకెందుకు? ఎవరి పైనైనా వార్తలు నిరాధారం అయితే లీగల్ నోటీస్ పంపాలి. పరువుకు నష్టం వాటిళ్లితే కోర్టులో కేసు వేయాలి. ఇలా జర్నలిజం ముసుగులో కౌంటర్ వేయరు. కబ్జా చేసే ప్రయత్నంలో పోలీస్ స్టేషన్‌లో కేసులు అయ్యాయి కాబట్టే ఎంట్రీ కావాల్సి వచ్చింది. లేదంటే రాయాల్సిన అవసరం కూడా ఉండదు.

Read Also- NIMS: ‘నిమ్స్​’పై నిఘా!.. ఏం జరగబోతోంది?

పది చదవాల్సిన రోజుల్లో పలక, బలపం పట్టి నేర్చుకుని ఉద్యమాల గడ్డ కాకతీయ క్యాంపస్‌లో పీజీ, ఓయూ నుంచి లా పట్టా పొంది జర్నలిజంలో కష్టపడుతూ కుటుంబాన్ని ఓ ప్రొఫెషన్‌గా తీర్చు దిద్దుకుని అంచలంచెలుగా ఎదిగిన నా జీవితం ఆదర్శమని తోటి జర్నలిస్టులే అంటూ ఉంటారు. అలాంటిది స్వేచ్ఛాయుతంగా వార్తలు రాసే నాపై తప్పుడు ప్రచారం చేస్తే అరచేతితో ఉదయించే సూర్యున్ని ఆపుతామని అనుకుంటున్న మీలాంటి వాళ్ల భ్రమలు నేరవేరవు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా నమ్ముకున్న ప్రొఫెషన్ కోసం బతికే నైజం నాది.

ఎందరో స్కామర్లను, కబ్జాకోరులను ఎదిరించి నిలబడి వార్తలు రాయాలంటే నిజాయితీ ముఖ్యం. అది నమ్మిన వ్యక్తిని నేను. గిట్టని వారంతా ఏకమై ఎన్ని చేసినా ఏం కాదు. ఆకాశంపై ఉమ్మి వేస్తే అది వాళ్ల మీదనే పడుతుంది. బట్ట కాల్చి తప్పుడు ప్రచారం చేస్తే ఇక వార్తలు రాయడు అని మీరు అనుకోవడం మూర్కత్వం. ఆరేళ్లుగా ఇన్వెస్టిగేషన్ కథనాలతో ఒక్కొక్కరి బండారం బయటపెడుతున్నా. సామాన్యులను నిండా ముంచిన సాహితీ స్కాం బయటపెట్టింది ఈ దేవేందర్ రెడ్డియే. కాళేశ్వరం కరప్షన్ కహానీలు, మన ఊరు మన బడి స్కీంలో స్కాం, ఫినిక్స్ భూ ఫిక్సింగ్ అంటూ 14 ప్రాజెక్ట్స్‌లో ఆనాటి ప్రభుత్వం చేసిన మేలుని బట్టబయలు చేసింది ఈ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టే. బడాబాబులు, మెయిన్ స్ట్రీమ్ మీడియా పాలించే జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అవకతవకలను భయం లేకుండా బయటపెట్టింది నేనే. ఫోన్ ట్యాంపిగ్ ఎలా చేశారో ఎక్స్‌క్లూజివ్ కథనాలు, ప్రజాధనం దుర్వినియోగం అరికట్టడంలో ఎన్నో సంచలనాత్మక కథనాలు. చెప్పడానికి ఒక్క రోజు కాదు ఒక పుస్తకం రాసినా సరిపోదు. కానీ చెప్పుకోవాల్సిన అవసరం నేను ఎప్పుడూ చేయలేదు. అడ్డదారులు తొక్కుతున్న అధికారులను హెచ్చరిస్తూ వ్యవస్థను సెట్ రైట్ చేయడానికి ఎన్నో పాట్లు, కష్టాలు పడుతూ జర్నలిజాన్ని బతికించడం కోసం దేవేందర్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఎన్నో. కబ్జాకోరులు, స్కామర్స్, చీటర్స్ ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా జనం నమ్మరు.

                దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
                        స్వేచ్ఛ ఎడిటర్
Read Also- HYD News: హైదరాబాదీలకు జీహెచ్ఎంసీ గుడ్‌న్యూస్.. కేవలం 5 రూపాయలకే..

 

 

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం