Swetcha Effect: ‘స్వేచ్ఛ’లో ప్రచురితమైన కథనం రాష్ట్రంలో, రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. అవినీతి నిరోధక శాఖ (ACB)లో పనిచేస్తూనే అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ డీఎస్పీ(DSP) వ్యవహారంపై ఉన్నతాధికారులు కఠినంగా స్పందించారు. ‘వరంగల్(Warangal)లో ఏసీబీ అధికారి వసూళ్ల దందా’ శీర్షికతో స్వేచ్ఛలో ప్రచురితమైన కథనంపై ఏసీబీ డీజీ చారూ సిన్హా(DG Charu Sinha) తక్షణమే స్పందించి, సదరు డీఎస్పీపై అంతర్గత విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన నిఘా వర్గాలు (Intelligence) బాధితుల నుంచి కీలక వివరాలతో పాటు ఆధారాలను సేకరించాయి. భయపడి డబ్బులు సమర్పించుకున్న బాధితులు ఆధారాలు కూడా ఇవ్వడంతో, రానున్న రెండు, మూడు రోజుల్లో ఆ అధికారిపై వేటు పడటం ఖాయమన్న చర్చ అధికారుల్లో బలంగా జరుగుతోంది.
అక్రమ దందా ఇలా!
వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మార్వో(MRO)పై ఏసీబీ(ACB) అధికారులు ఆగస్టులో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే, ఆ తనిఖీల్లో కీలక పాత్ర వహించిన డీఎస్పీ స్థాయి అధికారి ఆ తర్వాత వసూళ్లకు తెరలేపారు. అరెస్టయిన ఎమ్మార్వో మొబైల్ ఫోన్‌లోని కాల్, వాట్సాప్(WhatsApp) డేటాను తీసుకుని, ఆ లిస్ట్‌లో ఉన్న ఒక్కొక్కరికి ఫోన్లు చేసి పిలిపించుకున్నారు. ‘అరెస్టయిన ఎమ్మార్వోకు నువ్వు బినామీగా ఉన్నట్టు మా విచారణలో తేలింది. నీపై కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తాం’ అంటూ బెదిరింపులకు పాల్పడుతూ అందినకాడికి డబ్బు గుంజడం మొదలుపెట్టారు. ఈ దందాలో భాగంగా, ఎమ్మార్వోతో స్నేహం ఉన్న ఓ హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను కూడా బెదిరించి, కోటి రూపాయలు డిమాండ్ చేశారు. భయపడిన ఆ సాఫ్ట్‌వేర్ గత నెల వరంగల్ వెళ్లి పిస్తా హౌస్ హోటల్(Pistha House Hotel) వద్ద డీఎస్పీ పంపించిన మనుషులకు రూ.20 లక్షలు సమర్పించుకున్నారు. డబ్బు తీసుకున్న వారిలో ఏసీబీ డీఎస్పీకి బ్యాచ్‌మేట్ అయిన, హైదరాబాద్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఓ డీఎస్పీ కూడా ఉండటం గమనార్హం.
Also Read: Election Survey: సీఎం వ్యూహంలో చిక్కుకున్న ప్రతిపక్షాలు.. ఈ సర్వేలో ఫుల్ మైలేజ్!
విచారణ.. వేటు
బినామీలంటూ బెదిరిస్తూ లక్షలు డిమాండ్ చేస్తున్న ఏసీబీ డీఎస్పీ వేధింపులతో విసిగిపోయిన బాధితుల్లో ఇద్దరు శుక్రవారం వాట్సప్ ద్వారా ఏసీబీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ‘స్వేచ్ఛ’లో కథనం ప్రచురితం కాగానే ఉన్నతాధికారులు స్పందించారు. ఇంటెలిజెన్స్ సిబ్బంది ఫిర్యాదు చేసిన బాధితుల నుంచి పూర్తి సమాచారంతో పాటు ఆధారాలను తీసుకున్నారు. డీఎస్పీ వసూళ్లకు సహకరించిన ఆ అధికారి బ్యాచ్ మేట్‌లపై కూడా చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. అయితే, అవినీతి నిరోధక శాఖలో కీలక స్థానంలో ఉన్న ఓ ఉన్నతాధికారి ఇప్పటికీ సదరు డీఎస్పీని బయటపడేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. నివేదిక అందిన వెంటనే ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
Also Read: Adluri Laxman Kumar: విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్
