Election Survey: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఇప్పటికే మూడు సర్వేలు చేయించగా, ప్రజలు హస్తం వైపే మొగ్గు చూపుతున్నట్లు గుర్తించారు. ఇంటెలిజెన్స్ సర్వేలోనూ కాంగ్రెస్ లీడ్‌లో ఉన్నట్లు ఇవ్వగా, తాజాగా ఓ ప్రైవేట్ సంస్థ చేసిన సర్వేలోనూ కాంగ్రెస్ అభ్యర్ధి విజయం సాధిస్తారని నివేదించారు. ఆయా సర్వే వివరాలు, రిపోర్ట్ అధిష్టానానికి చేరినట్లు తెలిసింది. అభ్యర్ధుల వారీగా నిర్వహించిన ఈ సర్వేలో ఐదు కీ ఫ్యాక్టర్స్ నవీన్ యాదవ్(Naveen yadav)కు కలిసివస్తున్నట్లు వెల్లడించారు. లోకల్, కాంగ్రెస్ అభివృద్ధి, మైనార్టీ ప్లస్ ఎంఐఎం మద్దతు, బీసీ అస్త్రం, వంటి ఫ్యాక్టర్లు హస్తం గుర్తు గెలిచేందుకు ఎక్కువ ఆస్కారం ఉన్నట్లు వివరించారు.
పక్కా లోకల్
నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన స్థానికుడు. 2014 ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి 41,656 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. 2018లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి 18,817 ఓట్లు సాధించి సత్తా చాటారు. ఇది నియోజకవర్గంలో ఆయనకు ఉన్న వ్యక్తిగత చరిష్మాకు అద్దం పడుతున్నది. ఈ సారి అధికార కాంగ్రెస్ పార్టీ అండదండలు, బలమైన సామాజిక వర్గం మద్దతుతో బరిలోకి దిగడం ఆయన విజయావకాశాలు మెండుగా ఉన్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు.
అభివృద్ధి, సంక్షేమం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్‌లో ఇప్పటికే సుమారు రూ.200 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించడం పార్టీకి అనుకూలాంశం. దీంతోపాటు కొత్త రేషన్ కార్డుల మంజూరు, ఉచితంగా సన్న బియ్యం, ఉచిత కరెంట్, సబ్సీడీ గ్యాస్, ఫ్రీ బస్ వంటి సంక్షేమ పథకాలను కాంగ్రెస్ తన ప్రధాన అస్త్రంగా ప్రయోగిస్తున్నది. యూసుఫ్‌గూడ, ఎర్రగడ్డ, రహమత్‌నగర్, వెంగళరావు నగర్ వంటి డివిజన్ల వారీగా గత పదేళ్ల నుంచి పేరుకుపోయిన డ్రైనేజీ, వరద ముంపు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుండడం నవీన్ యాదవ్‌కు కలిసొచ్చే అంశాలు వివరించారు.
Also Read: Cyber Crime: బీ కేర్ ఫుల్.. మీరు భయపడితే మొత్తం కొల్లగొడతారు: డీసీపీ దార కవిత
ఎంఐఎం మద్దతు
జూబ్లీహిల్స్‌లోని మొత్తం ఓటర్లలో అత్యధికంగా 34 శాతం ఉన్న మైనారిటీలు డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎంఐఎంకు మంచి పట్టుంది. నవీన్ యాదవ్ అభ్యర్థిత్వంపై మైనారిటీ వర్గాలు సానుకూలంగా ఉన్నట్లు నివేదించారు. గతంలో ఆయన ఎంఐఎం తరఫున పోటీ చేయడం ద్వారా ఆ వర్గాలకు చేరువయ్యారని సర్వే సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా, ప్రస్తుత ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం సంపూర్ణ మద్దతు ప్రకటించడం నవీన్ యాదవ్‌కు ప్లస్ పాయింట్. ఎంఐఎం మద్దతుతో నియోజకవర్గంలో మెజారిటీ ఉన్న ముస్లిం ఓటర్లు కాంగ్రెస్‌కు వన్ సైడెడ్‌గా ఓటు వేసే అవకాశాలు ఉన్నాయనేది సర్వే సంస్థ భావన.
బీసీ అస్త్రం
ఉప ఎన్నికలో బీఆర్ఎస్, బీజేపీ అగ్రవర్ణాలకు టికెట్ కేటాయించగా కాంగ్రెస్ పార్టీ మాత్రం బీసీకి ఇచ్చింది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై విస్తృతమైన చర్చ జరుగుతున్న ఈ కీలక సమయంలో బీసీ సామాజిక వర్గానికి (యాదవ్) చెందిన నవీన్ యాదవ్‌కు టికెట్ కేటాయించడం అత్యంత వ్యూహాత్మక నిర్ణయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. నియోజకవర్గంలో దాదాపు 1.40 లక్షల బీసీ ఓటర్లు (మొత్తం ఓట్లలో 35 శాతానికి పైగా) ఉన్నందున, బీసీల రాజకీయ సాధికారతకు తాము కట్టుబడి ఉన్నామనే సందేశాన్ని నవీన్ యాదవ్ అభ్యర్ధిత్వం ద్వారా కాంగ్రెస్ చాటి చెప్పగలిగిందని వివరిస్తున్నారు.
నియోజకవర్గాన్ని వీడని నవీన్
రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడినా నవీన్ యాదవ్ మాత్రం నియోజకవర్గాన్ని వీడలేదు. స్థానికంగానే ఉంటూ నవ యువ ఫౌండేషన్ ద్వారా విస్తృతంగా సేవా కార్య క్రమాలు నిర్వహిస్తూ నిత్యం ప్రజల్లోనే ఉన్నట్లు సర్వేలో తేలింది. యువతకు పోటీ పరీక్షల కోచింగ్ మొదలుకొని బాలింతలకు సీమంతం, పిల్లలకు అన్నప్రాసన వంటి సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారనేది జూబ్లీహిల్స్‌లో టాక్. ఈ సమీకరణాలన్నీ నవీన్ యాదవ్ విజయానికి కారణం అవుతాయని సర్వే సంస్థ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
Also Read: Singareni Collieries: సింగరేణిలో అరుదైన ఖనిజాల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు
