UAE Lottery: అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుంతో చెప్పడం చాలా కష్టం. అబుదాబిలో నివసిస్తున్న ఓ తెలుగు కుర్రాడికి అమ్మ సెంటిమెంట్ రూపంలో అనుకోని అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.240 కోట్ల జాక్ పాట్ ను అతడికి తెచ్చిపెట్టింది. రాత్రికి రాత్రి ఆ యువకుడితో పాటు మెుత్తం కుటుంబమే కోటీశ్వరులు అయ్యారు. యూఏఈ చరిత్రలోనే అతిపెద్ద లాటరీని గెలుచుకోవడంతో ఆ యువకుడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇంతకీ ఆ యువకుడు ఎవరు? అమ్మ సెంటిమెంట్ ఏ విధంగా కలిసొచ్చింది? ఆ డబ్బుతో యువకుడు ఏం చేయనున్నాడు? భారతీయులు ఈ లాటరి కొనుగోలు చేయవచ్చా? యూఏఈలో లాటవీ విధానం ఎలా ఉంటుంది? వంటి విశేషాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
జాక్ పాట్ కుర్రాడు ఎవరంటే?
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భీమవరం గ్రామానికి చెందిన 29 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఉద్యోగి బొల్లా అనిల్ కుమార్ (Bolla Anil Kumar).. ప్రస్తుతం అబుదాబిలో ఉంటున్నాడు. స్థానికంగా ప్రాథమిక విద్యను పూర్తి చేసిన అనిల్.. హైదరాబాద్ లో బీటెక్ చేశాడు. అనంతరం యూఏఈకి వెళ్లి అక్కడే సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డాడు. అయితే అనిల్ కు గత కొన్నిరోజులుగా లాటరీ కొనే అలవాటు ఉంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా లాటరీ కొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వస్తున్నాడు. అయితే ప్రతీసారి అతడికి నిరాశే ఎదురైనా వెనకడుగు వేయలేదు. ఏ రోజైనా అదృష్టం కలిసిరాకుండా పోతుందా? అన్న నమ్మకంతో ముందుకు సాగాడు.
తల్లి సెంటిమెంట్ వర్కౌట్..
ఈ క్రమంలోనే గత నెల కూడా 10 లాటరీ టికెట్లను బొల్లా అనిల్ కొనుగోలు చేశాడు. అందులో ఒకటి మాత్రం తన తల్లి భూలక్ష్మీ పుట్టిన తేదీ వచ్చేలా తీసుకున్నాడు. ఇప్పుడు ఆ సెంటిమెంటే అతడిపై కోట్ల వర్షం కురిపించింది. తల్లి పుట్టిన రోజు కలిసివచ్చేలా తీసుకున్న లాటరీకి ఏకంగా రూ.240 కోట్ల జాక్ పాట్ తగిలింది. దీంతో బొల్లా అనిల్ కుమార్ ఫ్యామిలీ రాత్రికి రాత్రి కోటీశ్వరులుగా మారిపోయారు. ఈ విషయాన్ని తన తల్లికి చెప్పుకొని బొల్లా అనిల్ ఎంతగానో సంతోషించాడు. లాటరీ చెక్ అందుకునే క్రమంలో ఇదే విషయాన్ని సైతం నిర్వాహకులకు తెలియజేశాడు. దీంతో అక్కడి వారు కూడా ఆశ్చర్యపోయారు. ఈ డబ్బును పెట్టుబడిగా పెడతానని, అలాగే తన ఫ్యామిలీ మెుత్తాన్ని యూఏఈకి తీసుకొచ్చి ఇక్కడే హ్యాపీగా ఉంటామని బొల్లా అనిల్ తెలిపారు.
యూఏఈ లాటరీ విధానం..
లాటరీల విషయంలో యూఏఈ ప్రభుత్వం కఠిన నియమాలను పాటిస్తోంది. జనరల్ కమర్షియల్ గేమింగ్ రెగ్యులేటరీ అథారిటీ (GCGRA) అనుమతించిన మూడు లాటరీలు మాత్రమే ఆ దేశంలో అందుబాటులో ఉన్నాయి. ‘ది యూఏఈ లాటరీ’ (The UAE Lottery), ‘బిగ్ టికెట్ అబూదాబి’ (Big Ticket Abu Dhabi), ‘దుబాయ్ డ్యూటీ ఫ్రీ’ (Dubai Duty Free Millennium Millionaire) పేరుతో మూడు లాటరీలను నిర్వహిస్తుంటారు. ది యూఏఈ లాటరీ.. దేశంలోనే అతిపెద్ద జాక్ పాట్ లాటరీగా చెబుతుంటారు. ఈ లాటరీలను యూఏఈలో ఉన్నవారితో పాటు ఆన్ లైన్ విధానంలో విదేశీయులు సైతం కొనుగోలు చేయవచ్చు.
లాటరీలు ఎలా కొనాలి?
యూఏఈలో అదిపెద్ద నేషనల్ లాటరీగా పిలువబడే ది యూఏఈ లాటరీని www.theuaelottery.ae వెబ్ సైట్ లోకి వెళ్లి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ధర 50 దిర్హమ్స్ కాగా.. చాలా ఎక్కువ మంది ఈ లాటరీ కోసం పోటీ పడుతుంటారు. ఈ లాటరీని కొనుగోలు చేయాలంటే యూఏఈ ప్రభుత్వం ఇచ్చే ఎమిరేట్స్ ఐడి తప్పనిసరి. అది ఉంటేనే కొనుగోలు చేయగలం. ఈ లాటరీ డ్రాలో గెలిచిన వారికి 100 మిలియన్ దిర్హమ్స్ (దాదాపు రూ.240 కోట్లు) అందిస్తారు. రెండో లాటరీ అయిన బిగ్ టికెట్ అబుదామి లాటరీని www.bigticket.ae వెబ్ సైట్ లేదా విమానాశ్రయంలో కొనుగోలు చేయవచ్చు. దీని ధర Dh500. గెలిచినవారికి Dh15 – 32 మిలియన్ డబ్బుతో పాటు విలాసవంతమైన కార్లను బహుమతిగా ఇస్తారు. మూడో లాటరీ అయిన దుబాయి డ్యూటీ ఫ్రీ లాటరీని.. www.dubaidutyfree.com వెబ్ సైట్ లేదా దుబాయి ఎయిర్ పోర్టులో కొనుగోలు చేయవచ్చు. దీని ధర Dh1,000. కేవలం 5000 టికెట్లను మాత్రమే విక్రయిస్తారు. కాబట్టి గెలుపు అవకాశం ఎక్కువగా ఉంటుంది.
Also Read: APSRTC – Google Maps: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. గూగుల్ మ్యాప్స్‌లో ఏపీఎస్ఆర్టీసీ టికెట్లు.. ఇలా బుక్ చేసుకోండి!
ఇండియా నుంచే ఆడొచ్చా?
అయితే భారతీయులు సైతం యూఏఈ లాటరీ టికెట్లను కొనుగోలు చేయవచ్చు. ఇండియాలో ఉంటూనే ఆన్ లైన్ ద్వారా పైన పేర్కొన్న వెబ్ సైట్స్ నుంచి టికెట్ పొందవచ్చు. కానీ ది యూఏఈ లాటరీ మాత్రం కొనుగోలు చేసేందుకు అవకాశం లేదు. ఆ లాటరీలో యూఏఈ నిర్వాసితులు మాత్రమే పాల్గొనేందుకు వీలు ఉంది. మిగతా రెండు లాటరీలైన ‘బిగ్ టికెట్ అబూదాబి’, ‘దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిల్లేనియం మిలియనీర్’ ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉంటాయి. ఆయా వెబ్ సైట్స్ కు వెళ్లి డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా టికెట్ కొనుగోలు చేయవచ్చు. లాటరీ గెలిస్తే ఆ డబ్బును గెలిచిన వారి బ్యాంక్ ఖాతాలో జమచేస్తారు. అయితే బహుమతిగా వచ్చిన డబ్బు రూ.10 లక్షలు దాటితే అందులో 30 శాతం ట్యాక్స్ రూపంలో భారత ప్రభుత్వానికి వెళ్లనుంది.
