APSRTC – Google Maps: ఆంధ్రప్రదేశ్‌లో బస్సు ప్రయాణం ఇప్పుడు మరింత సులభంగా, సౌకర్యవంతంగా మారనుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (APSRTC) గూగుల్‌తో కీలక ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ప్రయాణికులు.. గూగుల్ మ్యాప్స్ ద్వారా బస్ టికెట్లను బుక్ చేసుకునే వెసులుబాటు కలగనుంది. తాము చేరుకోవాల్సిన గమ్యస్థానానికి సంబంధించిన రూట్ మ్యాప్, దూరం తెలుసుకోవడంతో పాటు ఆ మార్గం గుండా వెళ్లే ఆర్టీసీ బస్సుల వివరాలను సైతం గూగుల్ మ్యాప్స్ అందించనుంది.
గూగుల్ మ్యాప్స్‌లో బస్సు వివరాలు
గూగుల్ మ్యాప్స్ ను ఉపయోగించి బస్ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ముందుగా మీరు వెళ్లాల్సిన గమ్యస్థానం లేదా ఊరిని గూగుల్ మ్యాప్స్ లో సెర్చ్ చేయాలి. ఉదాహరణకు విజయవాడ నుంచి విశాఖపట్నానికి వెళ్లాలని భావిస్తే.. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి యూవర్ లొకేషన్ (Your Location) దగ్గర విజయవాడ.. చూస్ డెస్టినేషన్ (Choose Destination) వద్ద విశాఖపట్నాన్ని సెలక్ట్ చేసుకోవాలి. అప్పుడు వీటి మధ్య దూరంతో పాటు బైక్, కారు, బస్, రైళ్లల్లో ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుందన్న వివరాలను గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది. అందులో బస్ సింబల్ ను క్లిక్ చేస్తే విజయవాడ – విశాఖ మధ్య తిరిగే బస్సుల వివరాలు, వాటి టైమింగ్స్ కనిపించనున్నాయి.
బుకింగ్ ఇలా చేసుకోండి..
గూగుల్ మ్యాప్స్ చూపించిన బస్సుల్లో మీకు అనుకూలంగా ఉన్న దానిపై క్లిక్ చేస్తే అది నేరుగా ఏపీఎస్ఆర్టీసీ వెబ్ సైట్ (APSRTC Website)లోకి తీసుకెళ్తుంది. అక్కడ మీకు సంబంధిత బస్సులోని ఖాళీ సీట్లు, టికెట్ ధర కనిపిస్తుంది. బస్సులో మీకు నచ్చిన సీటును బుక్ చేసుకొని ఎంచెక్కా నచ్చిన డెస్టినేషన్ కు చేరుకోవచ్చు. టికెట్ కోసం బస్ స్టేషన్, ప్రైవేటు బుకింగ్ సెంటర్లకు వెళ్లకుండానే అత్యంత వేగంగా, సులభంగా బుకింగ్ ప్రక్రియ పూర్తయిపోతుంది.
Also Read: Kavitha On CM: సీఎం హోదాలో ఉండి.. ఆ భాష, బెదిరింపులు ఏంటి.. రేవంత్‌పై కవిత ఫైర్
ట్రయల్ రన్ విజయవంతం..
గూగుల్ మ్యాప్స్ లో ఆర్టీసీ బస్సుల వివరాలకు సంబంధించి హైదరాబాద్ – విజయవాడ మధ్య ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ప్రయోగం ఆశించిన దానికంటే మంచి ఫలితాలను ఇచ్చినట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. అనేకమంది ఎలాంటి సమస్య లేకుండా గూగుల్ మ్యాప్స్ ద్వారా టికెట్స్ బుకింగ్ చేసుకున్నట్లు తెలియజేశారు. దీంతో ఈ సేవను మరింత విస్తరించేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఏపీఎస్ఆర్టీసీలోని ఏసీ, సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సుల వివరాలు, వాటి రూట్ మ్యాప్స్, కచ్చితమైన బస్ స్టాప్స్, అక్షాంశ – రేఖాంశాలు (latitude–longitude) తదితర వివరాలను గూగుల్ కు అందించింది. గూగుల్ ఆ వివరాలను ధ్రువీకరించి, ఆడిట్ చేసి మూడు రోజుల క్రితం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం విజయవాడ – హైదరాబాద్ మధ్య ఉన్న ఈ సౌకర్యం వారం వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
