Kavitha On CM: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వీధి రౌడీలు సైతం సిగ్గు పడేలా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత చేపట్టిన జనం బాట కార్యక్రమంలో హన్మకొండకు చేరిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు కాలేజీల తాటతీస్తామంటూ సీఎం రేవంత్ హెచ్చరించడాన్ని ఆమె తప్పుబట్టారు.
‘రౌడీలు సైతం సిగ్గుపడేలా’
కవిత చేపట్టిన ‘జనం బాట’ (Janam Bata) కార్యక్రమం హన్మకొండకు చేరుకున్న నేపథ్యంలో జాగృతి కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఫాతిమా నగర్ కు వచ్చిన కవితను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత (Kalvakuntla Kavitha) మాట్లాడుతూ ‘సీఎం రేవంత్ రెడ్డి వీధి రౌడీలు సిగ్గుపడేలా మాట్లాడుతున్నారు. కళాశాల యాజమాన్యాలను తోలు తీస్తా? తాటతీస్తా అంటున్నారు. తెలంగాణ బిడ్డలు అప్పులు, లోన్లతో కళాశాలలు పెట్టి చదువులు చెప్పినందుకు తోలు తీస్తారా?. ప్రభుత్వం ఇచ్చినమాట తప్పినందుకే కాలేజీలు బంద్ పెట్టారు’ అని కవిత అన్నారు.
సీఎం.. క్షమాపణ చెప్పాలి: కవిత
కాంట్రాక్టులకు పైసలు ఇచ్చే సీఎం రేవంత్ రెడ్డి.. కాలేజీలకు మాత్రం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ‘మీ తప్పులు పక్కనపెట్టి కాలేజీల మీద వీరంగం చేయడం తప్పు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సీఎం తప్పకుండా క్షమాపణ చెప్పాలి. కాలేజీ యాజమాన్యాల పక్షాన మేము నిలబడతాం’ అని కవిత స్పష్టం చేశారు. మరోవైపు రెండ్రోజుల పాటు వరంగల్, హనుమకొండ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో తాను పర్యటించనున్నట్లు కవిత స్పష్టం చేశారు. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయన్న ఆమె.. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.
సీఎం ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే?
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల (Jubliee Hills Bypoll) నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం సీఎం రేవంత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేటు కాలేజీలు ఇచ్చిన బంద్ అంశంపై మాట్లాడారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే కళాశాలలైనా, రాజకీయ పార్టీలైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మీరు ఏ రాజకీయ పార్టీలతో అంటకాగుతున్నారో తనకు బాగా తెలుసని కొన్ని ప్రైవేటు కాలేజీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘తమాషాలు చేస్తే తాట తీస్తాం’ అంటూ ఘాటుగా హెచ్చరించారు. విద్యను సేవగా భావించాలి తప్పా వ్యాపారంగా చూడకూడదని హితవు పలికారు. బ్లాక్ మెయిల్ చేస్తామంటే ప్రభుత్వం సహించదని హెచ్చరించారు.
Also Read: India vs Australia 5th T20: కాసేపట్లో ఐదో టీ20 మ్యాచ్.. టీమిండియాలో భారీ మార్పులు.. సిరీస్ గెలిచేదెవరు?
బంద్ విరమించిన కాలేజీలు..
బకాయిల చెల్లింపు వ్యవహారంపై ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkata Reddy) శుక్రవారం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో నిరసన కార్యక్రమాలు రద్దు చేసుకుంటున్నట్టు కాలేజీల యాజమాన్యాలు ప్రకటించాయి. బకాయిలకు సంబంధించి రూ.1,500 కోట్లు చెల్లించాలని యాజమాన్యాలు కోరగా ఇప్పటికే రూ.600 కోట్లు విడుదల చేశామని మరో రూ.600 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మిగతా రూ.300 కోట్లను కొన్ని రోజుల్లోనే ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. దీంతో నిరసన కార్యక్రమాలపై ప్రైవేటు కాలేజీలు వెనక్కి తగ్గాయి.
