Cyber Crime: సైబర్ క్రిమినల్స్‌కు చెక్ పెట్టేందుకు హైదరాబాద్(Hyderabad) సైబర్ క్రైం పోలీసులు వేర్వేరు రాష్ట్రాల్లో స్పెషల్ ఆపరేషన్ జరిపారు. ఈ క్రమంలో గత ఒక్క నెలలోనే 55 మంది మోసగాళ్లను అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైం డీసీపీ దార కవిత(DCP Dara Kavitha) తెలిపారు. గత నెలలో సైబర్ నేరాలకు సంబంధించి 196 ఎఫ్ఐఆర్(FIR) లు నమోదైనట్టు చెప్పారు. సైబర్ క్రిమినల్స్ వలలో చిక్కి సొమ్ము పోగొట్టుకున్న బాధితులకు రూ.62.34 లక్షలను తిరిగి ఇప్పించామన్నారు. మోసగాళ్లకు చెందిన 61 బ్యాంక్ అకౌంట్ల ద్వారా 107 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించామన్నారు.
ఫేక్ ట్రేడింగ్ యాప్..
అరెస్ట్ అయిన సైబర్ నేరస్తులపై దేశవ్యాప్తంగా 136 కేసులున్నట్లు తెలిపారు. వీటిలో 45 కేసులు తెలంగాణలోనే నమోదయ్యాయని పేర్కొన్నారు. ఫేక్ ట్రేడింగ్ యాప్(Fake trading app) తో 24.17 లక్షలు దోచుకున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తితో పాటు, హైదరాబాద్‌లో 62 ఏళ్ల వృద్ధుడి వద్ద నుంచి రూ.1.07 కోట్లు దోచుకున్న ముఠాను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఓ వ్యక్తి తన మొబైల్ ను పోగొట్టుకోగా దాని ద్వారా 1.95 లక్షలను కొట్టేసిన నేరస్తుల్ని అరెస్ట్ చేశామన్నారు. ఇన్వెస్ట్మెంట్, డిజిటల్ అరెస్ట్, సోషల్ మీడియా ఫ్రాడ్ ద్వారా 33 సైబర్ మోసాలు జరిగినట్లుగా గుర్తించామని తెలిపారు.
Also Read: Bigg Boss Telugu 9: వార్ ఫర్ పవర్.. మరోసారి టార్గెట్ తనూజ.. హౌస్ సపోర్ట్ ఎవరికి?
ప్రభుత్వ అధికారుల పేరుతో..
అరెస్ట్ చేసిన నిందితుల నుంచి 31 మొబైల్ ఫోన్లు, 14 చెక్ బుక్కులు, 9 డెబిట్ కార్డులు, 2 ల్యాప్ టాపులు, 3 షెల్ కంపెనీ స్టాంపులు, 2 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారుల పేరుతో ఉన్న ప్రొఫైల్స్ నుంచి వచ్చే మెసేజీలను నమ్మి మోసపోవద్దని సూచించారు. తెలియని సోషల్ మీడియా(Social media)పెట్టుబడి గ్రూపుల్లో చేరవద్దన్నారు. ఏపీకే ఫైల్స్(APK files), ఫిషింగ్ లింక్స్ ను ఓపెన్ చేయవద్దని చెప్పారు. సీబీఐ(CBI), ఈడీ(ED), ఆర్‌బీఐ(RBI), కస్టమ్స్, న్యాయవ్యవస్థ, సైబర్ క్రైమ్ పోలీసులు, నార్కోటిక్స్ బ్యూరో అధికారులమంటూ బెదిరింపు వీడియో కాల్స్, సందేశాలు వస్తే భయపడవద్దని సూచించారు. అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు వస్తే 1930కి ఫిర్యాదు చేయాలని సూచించారు.
Also Read: KTR: అవినీతిని తరిమికొట్టాలంటే కాంగ్రెస్ ను ఓడించాలి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
