Swetcha Effect: అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీబీ(ACB) వరంగల్ రేంజ్ డీఎస్పీ(DSP)పై ఉన్నతాధికారులు విచారణను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఆయన బాధితులైన పలువురి నుంచి వాంగ్మూలాలను సేకరించారు. ఈ క్రమంలో సదరు డీఎస్పీపై నేడో రేపో వేటు పడటం ఖాయమని తెలుస్తోంది. దాంతోపాటు వసూళ్లలో సహకరించిన డీఎస్పీ బ్యాచ్ మేట్లపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం.
ఆస్తులు కూడా సీజ్..
సీఐ(CI)గా మొదలుపెట్టి డీఎస్పీ(DSP)గా పదోన్నతి తీసుకుని ఆరేళ్లుగా ఏసీబీ వరంగల్ రేంజ్ లోనే పని చేస్తున్న ఓ అధికారి అవినీతికి చెక్ పెట్టాల్సింది పోయి కలెక్షన్ కింగ్ గా మారాడన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో సదరు అధికారి లక్షల్లో కలెక్షన్లు చేసినట్టుగా సమాచారం. వరంగల్ జిల్లాలోనే పని చేస్తున్న ఓ ఎమ్మార్వో(MRO)ను కొంతకాలం క్రితం ఇలాగే అరెస్ట్ చేసిన ఆ డీఎస్పీ ఆ తరువాత అతని బంధుమిత్రుల నుంచి డబ్బు గుంజినట్టుగా తెలిసింది. అరెస్టయిన ఎమ్మార్వోకు మీరు బినామీలని మా విచారణలో తేలింది.. మీ ఆస్తులు కూడా సీజ్ చేసి అరెస్ట్ చేయాల్సి ఉంటుంది.. అలా జరగకుండా ఉండాలంటే అడిగినంత ఇచ్చుకోవాల్సిందేనని బెదరగొట్టినట్టుగా తెలియవచ్చింది. అరెస్టయిన ఎమ్మార్వోతో పరిచయం ఉండి హైదరాబాద్(Hyderabad) లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్(Software Engineer) గా పని చేస్తున్న వ్యక్తిని ఇలాగే బెదరగొట్టి కోటి రూపాయలకు బేరం కుదుర్చుకున్నట్టుగా తెలిసింది. ఆ తరువాత వరంగల్(Warangal) లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(National Institute of Technology) ప్రాంతంలో ఉన్న పిస్తా హౌస్ హోటల్(Pistha Hotel) వద్దకు పిలిపించుకొని 20 లక్షలు తీసుకున్నట్టుగా సమాచారం. దీంట్లో సదరు డీఎస్పీ బ్యాచ్ మేట్ ఒకరు సహకరించినట్టుగా తెలిసింది. ఇలాగే మరికొందరిని కూడా డబ్బు కోసం వేధిస్తుండటంతో మొదట ఇద్దరు బాధితులు ఏసీబీ ఉన్నతాధికారులకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Indiramma Housing Scheme: గ్రేటర్‌లో ఏడాదిగా ఇందిరమ్మ ఇండ్ల పథకం పెండింగ్.. కారణం అదేనా..?
వాంగ్మూలాల సేకరణ..
ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు మంగళవారం డీఎస్పీ బాధితుల్లో ఆరుగురిని హైదరాబాద్ లోని ప్రధాన కార్యాలయానికి పిలిపించి వారి నుంచి వాంగ్మూలాలు తీసుకున్నట్టుగా తెలిసింది. తమను డబ్బు కోసం డీఎస్పీ ఎలా వేధించాడన్న దాని గురించి బాధితులు విచారణాధికారులకు చెప్పినట్టుగా సమాచారం. ఎమ్మార్వో బంధువు అయిన మహిళతో పరిచయం ఉన్న పాపానికి ఓ కానిస్టేబుల్ భార్యను కూడా అసభ్యకర పదజాలంతో దూషించిన విషయం ఇప్పటికే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. వారి నుంచి కూడా ఏసీబీ అధికారులు స్టేట్ మెంట్ తీసుకున్నట్టుగా తెలియవచ్చింది. ఈ క్రమంలో ఒకటి రెండు రోజుల్లో సదరు వసూళ్ల సార్ పై వేటు పడటం ఖాయమని ఏసీబీ వర్గాలే చెబుతుండటం గమనార్హం.
