Delhi Acid Attack: దిల్లీలోని లక్ష్మీబాయి కాలేజ్ (Laxmi Bai College) సమీపంలో 20 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి ఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. యువతి చెబుతున్నట్లుగా అసలు ఆమెపై యాసిడ్ దాడే జరగలేదని దిల్లీ పోలీసులు తేల్చి చెప్పారు. ఈ కుట్ర వెనుక ఆమె తండ్రి ప్రమేయమున్నట్లు నిగ్గు తేల్చారు. అంతేకాదు తనపై యాసిడ్ దాడి చేశారంటూ యువతి ఆరోపించిన ముగ్గురు నిందితుల్లోని ఒకరి భార్యపై యువతి తండ్రి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉండటం అందరినీ షాక్ కు గురిచేస్తోంది.
వ్యక్తిగత పగ వల్లే..
యువతిపై ముగ్గురు వ్యక్తులు యాసిడ్ దాడి చేసినట్లు ఆదివారం ఫిర్యాదు అందడంతో.. దిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడి జరిగినట్లుగా భావిస్తున్న ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. అయితే యువతి చెప్పినట్లు దాడి ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదని దిల్లీ పోలీసు లా అండ్ ఆర్డర్ స్పెషల్ సీపీ రవీంద్ర సింగ్ యాదవ్ (Ravindra Singh Yadav) స్పష్టం చేశారు. నిందితులు పేర్కొన్న వారితో వ్యక్తిగత పగ ఉన్న నేపథ్యంలోనే యువతి తండ్రి ఈ యాసిడ్ దాడి నాటకానికి తెరలేపారని తెలియజేశారు.
తనను తానే గాయపరుచుకొని..
సీపీ రవీంద్ర సింగ్ మాట్లాడుతూ.. ‘యువతి దాడి జరిగినట్లు చెప్పిన సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎవరూ ఆ ప్రాంతంలో లేరు. ఇదంతా కుట్ర. యువతి తండ్రిని అత్యాచారం కేసు నుంచి తప్పించడంలో భాగంగా చేశారు. యువతి తండ్రి అక్వీల్ ఖాన్ ను లైంగిక వేధింపులు, బ్లాక్ మెయిల్ ఆరోపణలపై అరెస్ట్ చేశాం’ అని అన్నారు. యువతి ఒంటిపై గాయాలు ఉండటానికి గల కారణాలను సైతం సీపీ తెలియజేశారు. టాయిలెట్ క్లీనర్ తో ఆమె తనకు తానే గాయపరుచుకున్నట్లు దర్యాప్తులో తేలిందని సీపీ రవీంద్ర సింగ్ చెప్పారు.
నిర్దోషులపై తప్పుడు ఆరోపణలు..
యాసిడ్ దాడి చేశారంటూ యువతి చెప్పిన ముగ్గురు వ్యక్తులు నిర్దోషులని సీపీ రవీంద్ర సింగ్ అన్నారు. స్టాకర్ అని ఆరోపణలు చేసిన వ్యక్తి.. ఒక పెయింటర్ అని పేర్కొన్నారు. అతడు స్వచ్ఛందంగా పోలీసు స్టేషన్ కు వచ్చి విచారణకు సహకరించినట్లు చెప్పారు. మెుబైల్ కాల్ రికార్డ్స్, సీసీటీవీ ఫుటేజ్, సాక్షుల వాంగ్మూలాలు.. ఆ వ్యక్తి నిర్దోషని స్పష్టం చేశాయని సీపీ పేర్కొన్నారు. యువతి దాడి చేసినట్లుగా చెప్పిన సమయంలో పెయింటర్.. కరోల్ బాగ్ లో ఉన్నట్లు సీపీ వెల్లడించారు.
Also Read: Jubilee Hills Bypoll: జూబ్లీ బరిలో నాన్-లోకల్స్.. వ్యూహాత్మకంగా అడుగులు.. ప్రధాన పార్టీలకు చిక్కులు తప్పవా!
ప్రతీకార కుట్ర వెనుక కారణం
యాసిడ్ దాడి ఘటనకు రెండ్రోజుల ముందు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి భార్య పోలీసులను ఆశ్రయించింది. యువతి తండ్రిపై అత్యాచారం, బ్లాక్ మెయిల్ ఆరోపణల కింద కేసు నమోదు చేసింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. యువతి తండ్రికి చెందిన ఫ్యాక్టరీలో 2021-24 మధ్య ఆమె పనిచేసింది. ఆ సమయంలో తనపై అత్యాచారం చేసి.. ప్రైవేటు ఫొటోలు, వీడియోలు చిత్రీకరించినట్లు బాధితురాలు తెలిపారు. వాటిని అడ్డుపెట్టుకొని బ్లాక్ మెయిల్ కూడా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది కాకుండా యువతి తండ్రితో ఓ భూమి విషయంలో సైతం గొడవ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే యాసిడ్ దాడి కుట్రకు తెరలేపి బాధితురాలి భర్తను లొంగదీసుకోవాలని యువతి తండ్రి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
