Idli Kottu Trailer: ‘కుబేర’తో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకున్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ (Dhanush) నుంచి రాబోతున్న తదుపరి చిత్రం ‘ఇడ్లీ కొట్టు’ (Idli Kottu). ఇందులో ధనుష్ హీరోగానే కాకుండా.. డైరెక్టర్‌గానూ తనే బాధ్యతలు తీసుకున్నారు. ఈ సినిమాను డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఆకాష్ బాస్కరన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డైరెక్టర్‌గా ధనుష్‌కు ఇది నాలుగో చిత్రం. తెలుగు, తమిళ్‌లో అక్టోబర్ 1న విడుదల కాబోతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉండటమే కాకుండా, సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తుంది. మరీ ముఖ్యంగా ఇంతకు ముందు వచ్చిన ధనుష్ ‘రఘువరన్ బి.టెక్’ చిత్రాన్ని తలపిస్తుండటం విశేషం. శ్రీ వేదక్షర మూవీస్ బ్యానర్‌పై నిర్మాత రామారావు చింతపల్లి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
ట్రైలర్ ఎలా ఉందంటే.. (Idli Kottu Trailer Review)
ట్రైలర్ విషయానికి వస్తే.. ‘షాపులో గ్రైండర్‌ను చూసి, నాన్న ఎలాగైనా కొనేద్దాం నాన్న.. గంటలు గంటలు కూర్చోవాల్సిన అవసరం లేదు..’ అనే ధనుష్ డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ‘పోలేరమ్మ పేరు చెప్పి రుబ్బి.. మిషన్లతో అన్నీ చేసేయవచ్చని అంటుంటారు.. కానీ, రుచి అనేది మాత్రం మనసు పెడితేనే వస్తుంది’ అనే డైలాగ్ ఒకప్పటి ఫుడ్ విశిష్టతను తెలియజేస్తుంది. ‘జీవితంలో మనం చేసే పనిని ఆదాయం కోసం మాత్రమే కాదు, ఆస్వాదిస్తూ కూడా చేయాలి. వ్యాపారంలో దొరకని తృప్తి వ్యాపకంలో దొరుకుతుంది’ అని ధనుష్ చెప్పే డైలాగ్ పని గొప్పతనాన్ని, ఎలా పని చేయాలనే విషయాన్ని వివరిస్తుంది. ‘అశ్విన్.. మురళి అనే వ్యక్తి మన కంపెనీలో చేరిన తర్వాత 50 శాతం ప్రాఫిట్ ఇంక్రీజ్ అయిందని’ ధనుష్ పని చేసే కంపెనీ ఓనర్ అంటే.. అతని కుమారుడు ‘పనోడు అంటే నీలానే ఉండాలి’ అని అనడం అతడి పొగరును బహిర్గతం చేస్తుంది.
Also Read- Hema: ‘మా’ ప్రెసిడెంట్ సిస్టర్‌కే ఈ గతి పడితే.. మంచు లక్ష్మికి సపోర్ట్‌గా హేమ సంచలన వీడియో!
ఎగిరెగిరి ఇక్కడికే రావాలి
ధనుష్ వెళ్లిపోయి వేరే కంపెనీలో పని చేయడాన్ని ఉద్దేశించి.. ‘మన బిడ్డ వారసత్వాన్ని వదిలి వలసెళ్లిపోయాడు కదమ్మా’ అని తండ్రి అంటే, ‘అయినా వాడు ఎక్కడికి వెళ్తాడు.. ఎగిరెగిరి ఇక్కడికే రావాలి’ అని తల్లి చెప్పిన డైలాగ్.. ప్రస్తుత టంప్ నిర్ణయంతో భారతీయుల పరిస్థితిని తెలియజేస్తుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. కళ్యాణిగా నిత్యామీనన్ (Nithya Menen) పరిచయం, ఆమె ప్రవర్తనని పరిచయం చేసిన తీరు బాగుంది. ‘పుర చేత్తో కొట్టానంటే పశువుల ఆసుపత్రిలో పడతావ్’ అనే డైలాగ్‌తో కళ్యాణి ఎంత పవర్ ఫుల్ లేడీనో తెలియజేశారు. ‘నేను నీకోసం ఇక్కడ ఒక పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాను. నువ్వు ఇలా బాధ్యత లేకుండా ప్రవర్తించడం నాకు నచ్చట్లేదు’ అని బిజినెస్ మ్యాన్ అనడం, అతని కొడుకు ప్రవర్తన కార్పొరేట్ కంపెనీల మైండ్ సెట్‌ని తేటతెల్లం చేస్తుంది. అక్కడి నుంచి ఆ బిజినెస్ మ్యాన్ కొడుక్కి, ఇడ్లీ కొట్టు నడుపుకుంటున్న మురళీకి మధ్య యుద్ధం నడుస్తున్నట్లుగా చూపించారు.
Also Read- Bigg Boss Telugu 9: రీతూకి తలంటేసిన కింగ్.. డీమాన్ కెప్టెన్సీ తొలగింపు
ఈ ఊరి గుండెకాయ
ఈ పూరి గుడిసె కోసమా ఇంత చేశావ్ అనగానే.. ‘దాన్ని ఒట్టి కొట్టనుకోమాక ఈ ఊరి గుండెకాయ’ అనే డైలాగ్ పంచ్ ఇచ్చినట్లుగా ఉంది. అక్కడి నుంచి ట్రైలర్ చాలా ఎమోషనల్‌గా సాగింది. చివరిలో ‘ఏవండీ మీకు ఇడ్లీ వేయడం అంటే అంత ఇష్టమా’ అని భార్య అంటే, ‘ఇష్టమా… ఇడ్లీ లేయడానికే నేను పుట్టాను అనిపిస్తుంది’ అని హీరో చెప్పే సమాధానం, విజువల్‌గా కనిపించే సన్నివేశాలు చాలా హార్ట్‌ఫుల్‌గా ఉన్నాయి. మ్యూజిక్, కెమెరా అన్నీ కూడా హైలెట్ అనేలా ఉన్నాయి. మొత్తంగా అయితే.. ‘రఘువరన్ బి.టెక్’ తరహాలో ధనుష్ నుంచి వస్తున్న మరో చిత్రమే ‘ఇడ్లీ కొట్టు’ అనేలా ఈ ట్రైలర్ హింట్ ఇచ్చేసింది. దసరా స్పెషల్‌గా అక్టోబర్ 1న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేందుకు ముస్తాబవుతోంది. అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, రాజ్‌కిరణ్ కీలక పాత్రలలో నటించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు