The Lok Sabha Campaign is over Decision Of The Voters Is Pending
Editorial

Lok sabha Elections: ప్రచారం ముగిసింది, ఇక నిర్ణయమే బాకీ..

The Lok Sabha Campaign is over, Decision Of The Voters Is Pending: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రానికి ముగిసింది. నెలరోజులుగా సాగిన ప్రచారంలో భాగంగా ఊరూరా హోరెత్తించిన ప్రచార రథాలు, మైకులు, డీజేలు మూగబోయాయి. అధికార కాంగ్రెస్‌తో పాటు విపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ విస్తృతంగా పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయి. మజ్లిస్‌, బీఎస్పీ, వామపక్షాలు సహా ఇతర పార్టీలు, స్వతంత్రులు కూడా తమదైన శైలిలో ఈ నెలరోజులుగా ఎన్నికల ప్రచారాన్ని జనంలోకి తీసుకుపోయాయి. మరోవైపు రేపు తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు జరగబోయే పోలింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. రాష్ట్రమంతటా 144 సెక్షన్ అమలుతో రాష్ట్రమంతా ఒకరకమైన నిశబ్దం ఆవరించింది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 3, 32, 32, 318 మంది ఓటర్లుండగా, వీరిలో 18 నుంచి 39 ఏండ్ల మధ్యనున్న ఓటర్లు సుమారు 1.67 కోట్లమంది. అంటే సగానికి పైగా యువ ఓటర్లే ఉన్నారు. మరోవైపు 17 లోక్‌సభ స్థానాలకు పోటీలో నిలిచిన 525 మంది అభ్యర్థుల భవితవ్వం రేపటి పోలింగ్‌లో తేలనుంది.

ఇక ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై ఇప్పటికే పలు సర్వే సంస్థలు తమ లెక్కలను జనం ముందుంచాయి. ఆ సర్వే ఫలితాల్లో కనిపిస్తున్న సంఖ్య నిజంగా తెలంగాణ ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తోందా అంటే చెప్పలేని పరిస్థితి. మరి తెలంగాణ ఓటరు మనసులో ఏముందనేది తెలుసుకోవటానికి మౌలికంగా కొన్ని అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు రెండుసార్లు అధికారం ఇచ్చారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని విపక్షానికే పరిమితం చేయటంతో సహజంగానే తెలంగాణలో ఆ పార్టీ బలం తగ్గింది. అయితే, కవిత అరెస్టు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తర్వాత ప్రజల్లో ఆ పార్టీ పట్ల ఉన్న నమ్మకం సంగతి పక్కనపెడితే, సొంతనేతల్లో అది కరువవుతూ వచ్చింది. ఈ 3 నెలల కాలంలో పలువురు శాసన సభ్యులు, కీలక నేతలు పార్టీని వీడిపోయారు. గ్రామ, మండల, జిల్లా స్ధాయిలో హస్తం దిశగా ఈ చేరికలు వేగంగా జరిగిపోయాయి. లోక్ సభ ఎన్నికల వేళ సిట్టింగ్ ఎంపీలు పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీ తీర్థంపుచ్చుకోవటం, ఇచ్చిన బీఫామ్ టికెట్లనూ నిరాకరించి మరీ ఈ చేరికలు సాగటం బీఆర్ఎస్ బలం తగ్గిపోయిందనేందుకు సూచికలుగా నిలిచాయి. మరోవైపు కేసీఆర్ – బీజేపీ మధ్య రహస్య అవగాహన కుదిరిందనే ప్రచారం, ఈ క్రమంలోనే కొన్ని స్థానాల్లో ఆయన నిలిపిన బలహీనమైన అభ్యర్థుల నేపథ్యం, ఆయా నియోజక వర్గాల్లో గులాబీ పార్టీ పెద్దగా ప్రచారం చేయకపోవటం, స్వయంగా కేసీఆర్ బస్సు యాత్ర ఆ నియోజకవర్గాల అంచుల నుంచే మరోదిశగా సాగిపోవటమూ జనం దృష్టిని దాటిపోలేదు. మరోవైపు అధికారం పోయిన నాటి నుంచి ఆ పార్టీ అగ్రనేతల వ్యవహారం, బాధ్యతగల విపక్షంగా వారు నిర్వర్తించాల్సిన బాధ్యతల విస్మరణ, విపక్షంలోకి మారిన మూడు నెలల్లోనే పరిస్థితులు కిందామీదా కావటం, పొలోమని నేతలు పోతున్నా.. పట్టించుకోని అధినాయకత్వపు నిర్లక్ష్యం.. ఒక రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ ఉనికి మిగులుతుందా అనే అనుమానాలను ప్రజల్లో రేకెత్తించాయి. కాంగ్రెస్ పార్టీ పదేపదే లేవనెత్తిన రిజర్వేషన్ల అంశం మీద బీఆర్ఎస్ నోరెత్తకపోవటం, గతంలో ‘మోడీ..కేడీ’ అంటూ గతంలో విరుచుకుపడిన కేసీఆర్, కేటీఆర్ ఎక్కడా మోదీని ఈసారి విమర్శించకపోవటంతో మనకు తెలియకుండా ఏదో జరుగుతోందనే అనుమానం జనంలో ఏర్పడింది. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ రాగానే కరువు వచ్చిందనే అంశాలనూ గులాబీ పార్టీ ప్రచారంలో ప్రస్తావించింది.

Also Read: మీడియా స్వేచ్ఛ మేడిపండు కానుందా..?

ఇక ఈ ఎన్నికల్లో తన బలాన్ని పెంచుకుని తెలంగాణలో బీఆర్ఎస్ స్థానాన్ని తాను అందుకోవాలని ఆరాట పడుతున్న బీజేపీ, ఈ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని భావోద్వేగ అంశాల చుట్టూ తిప్పాలని భావించింది. అందుకే, ఏప్రిల్ మాసంలో అయోధ్య రామాలయ అంశం, ఆర్టికల్ 370 వంటి అంశాలను పదేపదే ప్రచారంలో ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. కానీ, ఇవేవీ తెలంగాణ ప్రజల మనసుకు పట్టటం లేదని గుర్తించి, వెంటనే తమ ప్రచార సరళిని మార్చుకుని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వపు హామీలు ఆలస్యం అయ్యాయనే దిశగా ప్రచారం చేశారు. ఇదే క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలనూ దూకుడుగా ఏకరవు పెట్టటం మొదలుపెట్టారు. ఇందులో ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో బాటు బీఆర్ఎస్ ఓటు బ్యాంకులో ఎంతో కొంత తమవైపు మళ్లించుకోవాలనే వ్యూహం ఉన్నట్లు కనిపించింది. తెలంగాణలో ఏనాడూ ఇక్కడ అధికారంలోని బీజేపీకి తానుగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు లేవు గనుక ప్రత్యర్థుల లోపాలనే తన బలంగా మార్చుకోవటం మినహా మరోదారి లేకుండా పోయంది. మరోవైపు యావత్ తెలంగాణను ప్రభావితం చేయగల ఒకరిద్దరు నేతలైనా ఆ పార్టీకి లేకుండా పోవటంతో 17 మంది అభ్యర్థులూ ప్రధాని మోదీ, అమిత్ షా వంటి నేతల ప్రచారం మీదనే ప్రధానంగా ఆధారపడటం మరో బలహీనతగా కనిపించింది. ఇంకొక అంశం ఏమిటంటే.. రాష్ట్ర అధ్యక్షుడు మొదలు ప్రధాన నేతలంతా తమ నియోజక వర్గాలకే పరిమితం కావటం, గత పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం గొప్పగా తెలంగాణకు సాయం చేయలేదనే భావన బలంగా ఉండటం, బీజేపీకి సంస్థాగత నిర్మాణం లేకపోవటంతో పది స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు అన్నీతామై ప్రచార పర్వాన్ని పూర్తిచేయాల్సి రావటంతో ఆ సీట్లలో ప్రచారం చప్పగా సాగినట్లు అనిపించింది. మరీ ముఖ్యంగా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రచారాన్ని బీజేపీ ఏ దశలోనూ అడ్డుకోలేకపోయిందనిపించింది.

తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను తమ ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఈ నాలుగు నెలలుగా గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తూ వచ్చారు. ఈ విషయంలో ఆయన మాటల్లో నిజాయితీ చేతల్లోనూ కనిపిస్తోంది. విపక్షాల విమర్శలకు దీటుగా స్పందిస్తూ, మారుతున్న పరిస్థితికి అనుగుణంగా రాజకీయ వ్యూహాలను అమలుచేస్తూనే తెలంగాణ కోసం ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను ప్రజల ముందు ఉంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తరపున ఆయన గట్టిగా ప్రయత్నిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే అభివృద్ధి, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమం, చట్టబద్ధపాలన, శాంతి భద్రతలు, మహిళల భద్రత, వ్యవసాయం, వనరుల సద్వినియోగం, గత కాలపు తప్పులను సరిదిద్దే ప్రయత్నం, కేంద్రంతో సత్సంబంధాలు, సామాజిక అసమానతలు, విద్య, వైద్యం, పొరుగు రాష్ట్రాలతో సంబంధాలు, అప్పులు, నిధులను ఖర్చులో నూతన ప్రాధాన్యతల మీద సమయానుగుణంగా ఆయన దృష్టి సారించారు. ఆరునూరైనా పంద్రాగస్టులోపల రెండు లక్షల రైతు రుణమాఫీ, బీసీల జనగణన, రిజర్వేషన్ల అంశంపై బీజేపీ వైఖరిని ఎండగట్టటం ద్వారా కాంగ్రెస్ వాణిని బలంగా జనంలోకి తీసుకుపోగలిగారు. అన్నింటికీ మించి.. ఈ ఎన్నికల ఫలితాలు తమ నాలుగు నెలల పాలనకు ముమ్మాటికీ రిఫరండమేనని ధైర్యంగా ప్రకటించి కాంగ్రెస్ శ్రేణుల నైతిక స్థైర్యాన్ని పెంచి, వారు మరింత బాధ్యతగా పనిచేసేలా చేయగలిగారు. దీనికి తోడు తెలంగాణలో కాంగ్రెస్‌‌కున్న బలమైన నాయకులు, పార్టీ సంస్థాగత నిర్మాణం, గతంలో మూడు దశాబ్దాల పాటు అధికారంలో ఉండగా చేసిన అభివృద్ధి, ఆదివాసీ, దళిత, మైనారిటీ వర్గాలు ఆదినుంచి కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉండటం, గ్రామీణ రైతాంగ వర్గంలో కాంగ్రెస్‌కు పలుకుబడి ఉండటం హస్తం పార్టీకి కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీగానూ ఆ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న సానుభూతిని నేతలు ప్రచారం రూపంలో జనం దృష్టికి తీసుకురాగలిగారు.

Also Read: భారత్‌లో దశాబ్దకాలంగా దగాపడిన దక్షిణాది

మరోవైపు, ప్రచార పర్వం ముగియటంతో ఇక, పార్టీలన్నీ పోల్ మేనేజ్‌మెంట్ మీద దృష్టి సారించనున్నాయి. బూత్‌ల వారీగా ఏజెంట్ల నియామకం మొదలు ప్రలోభాలకూ పార్టీల కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. డబ్బు, మద్యం లక్షిత ఓటర్లకు చేరే ప్రక్రియ ఊపందుకుంటోంది. వాటిని అడ్డుకోవడం అధికార యంత్రాంగం ముందున్న పెద్ద సవాల్‌. మరోవైపు, తెలంగాణలోని తమ సొంత ప్రాంతాల్లో ఓటు వేసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు ఇప్పటికే బయలుదేరి వెళ్లటాన్ని బట్టి తన ఓటు ద్వారా బలమైన సందేశాన్ని అందించేందుకు ఓటర్లు మానసికంగా ముందునుంచే సిద్ధమయ్యారనే సూచనా కనిపిస్తోంది. అయితే, అభ్యర్థిని బట్టి ఒటేయాలా లేదా పార్టీని బట్టి ఓటు వేద్దామా అనే సంశయం ఇంకా ఓటర్ల మనసులో ఉన్నట్లుగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు జై కొట్టిన తెలంగాణ ఓటరు రేపటి ఎన్నికల్లో ఎవరికి ఓటేశాడనేది తెలియాలంటే.. జూన్ 4 వరకు వేచిచూడాల్సిందే.

సదాశివరావు ఇక్కుర్తి
సీనియర్ జర్నలిస్ట్

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు