Ancient vs Modern Marriage: నేటి సమాజంలో పెళ్లి నిశ్చయం కావాలంటే, పెద్ద తతంగమే. ఆస్తి ఉండాలి.. అంతస్థులు అంతకన్నా ఉండాలి. అదే పూర్వకాలం పరిస్థితి ఏంటి? నాటి రోజుల్లో పెళ్లి నిశ్చయం కావాలంటే, వధువు తరపు వారు తప్పక వరుడి ఇంట్లోకి తొంగి చూసేవారట. ఆ తొంగి చూడడం వెనుక పెద్ద కథే ఉంది. అదేంటో తెలుసుకుందాం.
పెళ్లి, వివాహం, కళ్యాణం ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో పదాలు పలకాల్సిందే. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందభరితంగా సాగే ఘట్టం ఇదే. అందుకే పెళ్లి చూపుల నుండి వధూవరుల కళ్యాణం వరకు మంచి ముహూర్తాలు చూసేస్తారు. అయితే ఒక పెళ్లి నిశ్చయం కావాలంటే, ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూస్తారు.
అంతేకాకుండా ఆస్తులు ఉన్నాయా? లేవా? గుణాలు మంచివేనా కాదా అంటూ ఆరా తీస్తారు. అందుకే పెళ్లి నిశ్చయం కావాలంటే నేటి రోజుల్లో పెద్ద తతంగమే సాగుతుంది. ఇరు కుటుంబాలు అంగీకరించాలి. జన్మ నక్షత్రాలు కలవాలి. ఇలా మన సాంప్రదాయం ప్రకారం ఎన్నో కట్టుబాట్లు మనవి. ఇదంతా నేటి రోజుల్లో జరిగే తంతు.
కానీ పూర్వం పెళ్లిళ్ల పరిస్థితి వేరు. నాడు ఒక పెళ్లి నిశ్చయం కావాలంటే మొదట పెళ్లి కొడుకు ఇంట్లో తొంగి చూసే వారట. అలా తొంగి చూసే కార్యక్రమం వెనుక పెద్ద కథే ఉంది. అలా తొంగి చూసి ఆ ఇంటి గుణగనాలు చెప్పేసేవారట. అదెలాగంటే.. ముందు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. పూర్వం ప్రతి ఇంటా పశుపోషణే జీవనాధారంగా ఉండేది. పశువులను పూజించే సాంప్రదాయం మనది.
అందుకే నాటి రోజుల్లో పెళ్లి నిశ్చయం కావాలంటే, ఆ ఇంట్లో పశువులకు మేత ఉందా? లేదా? పశువులను పూజించే కుటుంబమా? కాదా? అనే విషయాన్ని తెలుసుకొనేందుకు ఇంటి ఆవరణంలో గల గడ్డివాములను చూసే వారట. గడ్డి వాములు ఉంటే ఆ ఇల్లు సంపన్న కుటుంబమని, అలాగే పశువులను పూజించే సాంప్రదాయ కుటుంబమని భావించేవారట. సరిపడా గడ్డివాములు ఉంటే ఆ ఇంటి పశువులకు ఆహార కొరత లేదని భావించేవారట.
Also Read: Best Food: ప్రపంచమే మెచ్చిన ఏకైక ఫుడ్.. మీకు తెలుసా?
నోరు లేని మూగజీవాలను క్షేమంగా చూసే కుటుంబం వద్దకు తమ అమ్మాయిని పంపిస్తే సక్రమంగా చూసుకుంటారన్న ధీమా వధువు కుటుంబ సభ్యులకు ఉండేదట. అందుకే నాటి రోజుల్లో అబ్బాయి పెళ్లి ఈడుకు వచ్చారంటే చాలు, ఆ ఇంట్లో గడ్డివాములు నిండుగా ఉండేవని నాటి తరం పెద్దలు నేటికీ చెబుతుంటారు. నేటి రోజుల్లో అంతస్థులు, ఆస్తులు చూసి పెళ్లి నిశ్చయం అవుతుందని, కానీ నాటి రోజుల్లో ఈ తతంగం ఉండేది కాదన్నది పెద్దల మాట. అంతేకాదు నేడు పెళ్లిళ్లు మరింత స్పీడ్ గా ఒక్కరోజులో ముగుస్తున్న తతంగం. అదే నాటి రోజుల్లో 8 రోజుల పెళ్లి తతంగం సాగేది. ఏదిఏమైనా నాటి రోజుల పెళ్లికి, గడ్డి వాములకు సంబంధం ఇదన్నమాట. గడ్డివాము లేని ఇంటికి అమ్మాయిని ఇచ్చే సాంప్రదాయం నాడు లేదని నాటి పెద్దలు నేటికీ కథకథలుగా చెబుతుంటారు.