South India Has Been Lying For A Decade: అనేక భాషలు, మత విశ్వాసాలు, ఊహకు అందనంత ప్రాంతీయ వైవిధ్యానికి మన దేశం ఒక మంచి ఉదాహరణ. ఇంత వైవిధ్యంలోనూ వైరుధ్యానికి తావులేని రీతిలో భిన్నత్వంలో ఏకత్వం మన సొంతం. పైకి భిన్నంగా కనిపించినా అంతిమంగా మనమంతా ఒకటే అనే భావనే భారత్ బలమని, దీనిని నిలబెట్టుకున్నన్ని రోజులూ దేశ భవితకు ఢోకా లేదని మన రాజ్యాంగ సభ నాడు భావించింది. అందుకే రాజ్యాంగంలో కేంద్రం అనే మాటకు బదులుగా యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే మాటనే వాడింది. రాష్ట్రాలన్నీ కలిసినదే దేశమనీ, కనుక హస్తినలో ఉన్న ప్రభుత్వం, రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు పరస్పరం ఆధారపడినవే తప్ప, ఏ రకంగానూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పెద్దన్న కాదని మన రాజ్యాంగ నిర్ణేతలు స్పష్టం చేశారు. చిన్న చిన్న సమస్యలు వచ్చినా, మొత్తంగా గత ఆరు దశాబ్దాల్లో ఈ సమాఖ్య స్పూర్తిని కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు నిలబెట్టుకుంటూనే వచ్చాయి. కానీ, 2014 నుంచి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాలు సామంత రాజ్యాలుగా మారిపోయాయి. రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా అనేక నిర్ణయాలూ జరుగుతూ వచ్చాయి.
ఈ చర్చకు తోడు కేంద్రం ఉత్తరాది ప్రజల ఆసక్తులకు ఇచ్చినంత ప్రాధాన్యత దక్షిణాది వారి విషయంలో ఇవ్వటం లేదనే ఆరోపణ ఈ పదేళ్ల కాలంలో అడపాదడపా బలంగానే వినిపిస్తూ వచ్చింది. ముఖ్యంగా తక్కువ జనాభా ఉన్న దక్షిణాది ప్రజలు కట్టే పన్నులను ఎక్కువ జనాభా, తక్కువ ఆదాయం ఉన్న ఉత్తరాదికి తరలిస్తున్నారనే ఆరోపణ బాగా వినిపించింది. చర్చ ఇక్కడితో ఆగి ఉంటే.. ఇది కేవలం ఆరోపణగానే మిగిలిపోయేది. కానీ, ఉత్తరాదిలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఇచ్చినన్ని నిధులు, బీజేపీయేతర ప్రభుత్వాలకు దక్కటం లేదనే ప్రభుత్వ గణాంకాలను బట్టి కేంద్ర పాలకుల నీతిని అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే నిధుల వాటాలో తమకు అన్యాయం జరిగిందంటూ బీజేపీయేతర ప్రభుత్వాలున్న దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు సుప్రీంకోర్టు తలుపు తట్టటంతో ఇది మరింతగా జనంలోకి పోయింది. న్యాయమైన హక్కుగా తమకు దక్కాల్సిన నిధుల విషయంలోనే గాక తరచూ ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోతున్న తీరప్రాంత రాష్ట్రాలైన తమ పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరి సమంజసంగా లేదని ఆ రాష్ట్రాలు తమ పిటిషన్‌లో ఫిర్యాదు చేశాయి. ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేయటం కూడా జరిగింది.
Also Read: విద్వేషపు పునాదులపై ‘సార్వత్రిక’ సమరం
మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రణాళికా సంఘాన్ని తొలగించి 2015 జనవరి 1న దాని స్థానంలో నీతి ఆయోగ్ అనే వ్యవస్థను తీసుకొచ్చారు. ఒక పద్ధతి ప్రకారం కొన్ని ప్రాధాన్యతా రంగాల్లో ఐదేళ్ల కాలంలో సాధించాల్సిన విజయాలను నిర్దేశించుకునే పంచవర్ష ప్రణాళికలు 1950లో నాటి నెహ్రూ కాలంలో మొదలయ్యాయి. ఈ ప్రణాళికా సంఘం అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయటంతో బాటు ఆచరణలోనూ నిజమైన సహకార సమాఖ్య విధానాన్ని అమలు పరిచింది. కేంద్రం, రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉందనే విషయంతో సంబంధం లేకుండా దేశంలో మౌలిక రంగాల్లో ఆరోగ్యకరమైన అభివృద్ధిని సాధించటంలో ప్రణాళికా సంఘం కీలక పాత్ర పోషించింది. కానీ, దాని స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్ అందుకు పూర్తి విరుద్ధంగా పనిచేస్తోంది. నీతి ఆయోగ్ చేసే సిఫారసులను కేంద్రం బుట్టదాఖలా చేయటం, రాష్ట్రాల రుణ ప్రయత్నాలకు ఆటంకాలు కలిగించటం, కేంద్ర పాలకులకు సన్నిహితులైన కార్పొరేట్ల రుణాలను మాఫీ చేయటం, దేశాభివృద్ధిలో రాష్ట్రాలను సమాన భాగస్వాములుగా పరిగణించకపోవటం వంటి ప్రతికూల నిర్ణయాలతో నీతి ఆయోగ్ సంస్థ పనితీరు మీదనే అనుమానాలు మొదలయ్యాయి.కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ నియమాలను, ప్రజాస్వామిక సూత్రాలకు తూట్లు పొడుస్తూ, రాష్ట్రాలను సామంత రాజ్యాలుగా భావించటంతో ఈ సమావేశాలకు హాజరు కావడం వల్ల ఏ ప్రయోజనమూ లేదని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశాన్ని బాయ్‌కాట్ చేస్తూ వచ్చారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మొదలు అనేక కాంగ్రెసేతర ముఖ్యమంత్రులు ఈ సమావేశాలకు హాజరుకాలేని వాతావరణాన్ని కేంద్ర పాలకులు ఏర్పరిచారు. దీనికి తోడు 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు రాష్ట్రాలకు పన్నుల వాటాను కేంద్రం 32శాతం నుంచి 42 శాతానికి పెంచింది. ఇందులో సైతం ఉత్తరాది రాష్ట్రాలకు అధిక ప్రయోజనం చేకూర్చింది. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు అత్యధిక నిధులు దక్కించుకోగా, దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయమే జరిగింది.
మరోవైపు లోక్‌సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలోనూ జనాభాను ప్రాతిపదికగా చేసుకుని దక్షిణాదికి అన్యాయం చేసే ప్రణాళికలను కేంద్రం రచిస్తోందనే మాట వినిపిస్తోంది. దీనిపై ఎలాంటి చర్చాలేకుండానే నిర్ణయాలు తీసుకుంటారనే అనుమానాలూ దక్షిణాది పార్టీల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. మన దేశంలో జనాభా ప్రాతిపదికన పార్లమెంటరీ ప్రాతినిధ్యాన్ని నిర్ణయించారు. వివిధ రాష్ట్రాల్లో 1971 జనాభా లెక్కల ప్రకారం లోక్‌సభ సీట్ల సంఖ్యను నిర్ధారిస్తూ, 2000 వరకు సీట్ల సంఖ్య పెంచరాదని నిర్ణయించారు. 2001లో జనగణన తర్వాత ఈ గడువును 2026 వరకు పొడిగించారు. దాంతో యాభై ఏళ్లపాటు నియోజకవర్గం, జనాభా నిష్పత్తికి సంబంధం లేకుండా పోయింది. 2026 తర్వాత కొత్త జనాభా లెక్కల ప్రకారం మార్పుచేర్పులు చేస్తే.. తక్కువ జనాభా రేటున్న దక్షిణ భారత రాష్ట్రాలు సీట్ల పరంగా నష్టపోతాయనే భయం, దీనివల్ల జాతీయ రాజకీయాల్లో దక్షిణాది ప్రాధాన్యం తగ్గిపోవటం ఖాయం. ఇది ఖచ్చితంగా ఉత్తరాది పెత్తనానికి దారితీస్తుందనే అనుమానం ఇప్పుడు దక్షిణాది పార్టీల మనసులో అలజడి రేపుతోంది. అటు నిధులు, ఇటు ప్రాతినిధ్యం విషయంలో కాలక్రమంలో దక్షిణాది రాష్ట్రాలు కేవలం నిధులను సమకూర్చటానికే తప్ప, విధాన నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో పడిపోబోతున్నాయనే దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read:మైండ్‌గేమ్ పాలి‘ట్రిక్స్’ ఎటు దారితీసేనో?
అయితే, కేంద్ర పాలకులు మాత్రం ఇవన్నీ అర్థంలేని భయాలుగా కొట్టిపారేస్తున్నారు తప్ప ఈ అంశం మీద అర్థవంతమైన, పారదర్శకమైన చర్చకు మాత్రం అవకాశం ఇవ్వటం లేదు. వీరి మాటలో నిజం లేదనే అనేక ఉదాహరణలు ఈ పదేళ్ల కాలంలో బయటికొచ్చాయి. ఉదాహరణకు.. ఏదైనా రాష్ట్రంలోని జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలంటే, అక్కడ పెట్టే ఖర్చుకు 15 శాతం రాబడి రావాలన్నది జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పెట్టుకున్న నిబంధనల్లో ఒకటి. అయితే, గుజరాత్‌లోని సోమనాథ్ చుట్టూ అభివృద్ధి చేస్తున్న జాతీయ రహదారికి మాత్రం అలాంటి షరతులేమీ పెట్టకపోవటం మొదలు అనేక ఉదాహరణలు ఈ పదేళ్లలో చర్చకు రావటంతో దక్షిణాది విషయంలో పక్షపాతం అనే మాట ఆరోపణ నుంచి వాస్తవంగా మారింది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఏపీ, తెలంగాణ ప్రజలకు వారిచ్చిన హామీల్లో నూటికి 80 శాతం నేటికీ నెరవేరలేదు. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ఇలా ఎన్నో హామీలు నీటిమూటలేనని తేలిపోయింది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దక్షిణాదికి మరీ ముఖ్యంగా తెలుగు జాతికి గత పదేళ్లలో జరిగిన అన్యాయంపై విస్తృత స్థాయిలో చర్చ జరగాలి. అలాగే, నిరంకుశ ధోరణులను ప్రదర్శిస్తున్న ఈ పాలకులను ఇంటిబాట పట్టించటానికి యువత, విద్యావంతులు, మేధావులు కలసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనీసం అప్పుడైనా రాబోయే కేంద్ర పాలకులకు వింధ్య పర్వతాలకు ఈవల ఉన్నదీ మనదేశమేననే సృహ వస్తుందేమో..!
-నెక్కంటి అంత్రివేది (సామాజిక కార్యకర్త)