There Is No Clear Close Challenger To The Bjp This Time Ifs Buts Apply:దేశంలో తొలివిడత లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. నాలుగురోజుల నాడు జరిగిన తొలిదశ పోలింగ్‌లో 21 రాష్ట్రాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే, ఈ పోలింగ్ సరళి తనకు అనుకూలంగా లేదనే అనుమానం కేంద్ర పెద్దల్లో మొదలైందనే వార్తలూ తర్వాతి రెండు రోజుల్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వీరి అనుమానాల్లో నిజముందనిపించేలా.. ఆదివారం నాడు రాజస్థాన్‌లోని జాలౌర్ ఎన్నికల సభలో, సోమవారం యూపీలోని అలీగఢ్ ఎన్నికల ప్రచారంలో మోదీ విద్వేష ప్రసంగాలకు దిగారు. ఈ వరుస పరిణామాలను గమనిస్తే, దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న నెటిజన్ల అభిప్రాయాల్లో బలముందనే మాటను రాజకీయ విశ్లేషకులు కూడా అంగీకరిస్తున్నారు.
‘జాతి సంపదలో తొలి హక్కు ముస్లింలదేనని గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. అర్బన్ నక్సలిజపు ఆలోచనలున్న ఈ కాంగ్రెస్ నేతలు రేపటి రోజు మన ఆడబిడ్డల మంగళ సూత్రాలనూ వదలరు. దేశ సంపదనంతా చొరబాటుదారులకు, గంపెడుమందిని కనే వారికి పంచుతారు. ఇది మీకు సమ్మతమేనా?’అని మోదీ రాజస్థాన్‌లో చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. తన ప్రసంగంలో విద్వేషపు మోతాదు సరిపోలేదని అనుకున్నారేమో గానీ, మర్నాడు యూపీలోని అలీగఢ్ సభలో ‘ మేం అధికారంలోకి వస్తే.. బంగారంతో సహా సంపదనంతా పోగేసి, దాన్ని అందరికీ సమంగా పంచుతామని కాంగ్రెస్ మ్యానిఫెస్టో అంటోంది. చూడబోతే వాళ్లు మన అక్కాచెల్లెళ్ల మెడలోని మంగళ సూత్రాలనూ లాక్కునే చట్టాలు చేసేలా ఉన్నారు. ఈ లెక్కన రెండు ఇళ్లున్నవారి వద్ద నుంచి ఒక ఇల్లు లాక్కుంటారు కాబోలు. ఎన్నో దేశాలను పతనం చేసిన ఇలాంటి విధానాలు మనకు అవసరమా?’ అని వ్యాఖ్యానించారు.
తమ ఎత్తులు చిత్తయిపోతున్నాయని స్పష్టంగా అర్థమైనప్పుడు మనుషికి అసహనం తన్నుకొస్తుంది. కళ్లముందే తమ స్వప్నాలు రాలిపోతున్నాయనే దృశ్యం సాక్షాత్కరిస్తున్న వేళ.. అతడు తన వివేచనను, విచక్షణను కోల్పోతాడు. ఆ వెంటనే అతడిలోని పశుత్వం ఒళ్లు విరుచుకుని బయటికొస్తుంది. ఈ క్రమంలో భౌతిక దాడి తర్వాతి చర్యగా మారుతుంది. ఆ మనిషి రాజకీయ రంగంలో ఉన్నప్పుడు.. సవాళ్ల మాయలో ప్రత్యర్థి పడనప్పుడు, విభజన మంత్రం ఉండనే ఉంటుంది. సమాజంలో చీలిక తీవ్రత పెంచేందుకు విద్వేషమనే ముడిసరుకు దానికి తోడవుతుంది. ఆ వెంటనే ‘ఇదేం అన్యాయం’ అంటూ ఆర్తనాదాలు చేస్తూ.. లక్షిత వర్గాల ప్రజలు నోరెత్తటం, ఇలాంటి నోళ్లు మూయించేందుకు అనుచరగణం మధ్యయుగాల నాటి ఉదాహరణలతో మీడియాకెక్కటం, ఈ చర్చలు చిలికిచిలికి గాలివానగా మారటం, ఈ వేడిలో పుట్టే తీవ్ర భావోద్వేగాల మధ్య ఓటర్లంతా ‘అటో, ఇటో’ నిలబడాల్సిన అనివార్యత తలెత్తుతుంది. ఏది మంచి, ఏది చెడు అని ఆలోచించే అవకాశం, సమయం కూడా ప్రజలకు దక్కనీయరు. విద్వేషం బాగా తలకెక్కిన తర్వాత తర్కం, హేతువు అనేవి మస్తిష్కాల నుంచి తాత్కాలికంగానైనా తొలగిపోతాయి. ఆ నాటకాన్ని అనుకూల మీడియా పోలింగ్ ముందు వరకు చక్కగా రక్తికట్టిస్తుంది గనుక అనుకున్న కార్యం సాఫీగా నెరవేరిపోతుంది. రాబోయే రోజుల్లో మనమంతా చూడబోతున్న, కేంద్ర పాలకులకు బాగా అలవాటైన రాజకీయ క్రీడ కాస్త అటు ఇటుగా ఇదే కావచ్చు.
Also Read: మైండ్‌గేమ్ పాలి‘ట్రిక్స్’ ఎటు దారితీసేనో?
ప్రపంచంలో ఏ నాయకుడైనా ఎన్నికల వేళ తన పాలనాకాలంలో సాధించిన విజయాలను గణాంకాలతో సహా ఏకరవు పెడతాడు. ఆ విజయాలకు కొనసాగింపుగా తన మనసులోని భవిష్యత్తు ప్రగతి వ్యూహాలను జనం ముందుంచి వారికి రేపటి పట్ల రవ్వంతైనా నమ్మకాన్ని కలిగించే యత్నాలూ చేస్తాడు. కానీ, ఈ పదేళ్లలో చెప్పుకునేంత ఏమీ చేయలేదనిపించిందో ఏమో.. మన ప్రధాని ఇందుకు భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. తాను ఒక ప్రధానమంత్రిననే సంగతే మరచి విద్వేష ప్రసంగానికి దిగారు. మెజారిటీ హిందువుల సొత్తును మైనారిటీలు గుంజుకుపోతారనే భావన సృష్టించటం ద్వారా, వారిని శత్రువులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చెప్పలేనంత నిరాశ నిస్పృహలకు గురైన మనిషి మాత్రమే ఇలాంటి పనికి పూనుకుంటాడు. నానాటికీ పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు, ఆకాశాన్నంటున్న నిరుద్యోగం, జనం నడ్డి విరుస్తున్న పన్నుభారం, రైతులు, శ్రామికుల్లో గూడుకట్టుకున్న ఆగ్రహం, మణిపూర్ అశాంతి, కార్పొరేట్ల వైభవం చూసి పేదల్లో కలుగుతున్న అసహనం.. ఇలా అనేక అంశాలను విపక్షాలు జనంలోకి తీసుకుపోవటాన్ని కేంద్ర పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాహుల్ పాదయాత్ర, కిందామీదా పడుతూనే ఇండియా కూటమి చేస్తున్న ప్రయత్నాలు తమ ఎత్తులకు అవరోధాలుగా మారతాయేమోననే దిగులు పాలక పక్షానికి పట్టుకుంది. మిన్నూమన్నూ ఒకటి చేస్తాయనుకున్న రామమందిరం, ఆర్టికల్ 370 రద్దు, సీఏఏ అంశాలను పాలకులు ఆవాహన చేసుకున్నంతగా పామరుల మనసుకు పట్టటం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే, 400 సీట్ల సంగతి అలా ఉంచితే, అధికారమే చేజారిపోతుందనిపించిందేమో.. మతం అనే అస్త్రాన్ని బయటికి తీశారు. భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ, ఎన్నికల సంఘపు నియమాలకు పాతరేస్తూ, మన ఘన ప్రజాస్వామ్యపు ఔన్నత్యాన్ని తగ్గించేలా ప్రధాని చేసిన వ్యాఖ్యలను దేశంలోని వ్యవస్థలన్నీ చేష్టలుడిగి చూడటం ఈ కథలో మరో విషాదం.
సాధారణంగా తమ బలం తక్కువగా ఉన్న ప్రాంతంలో జరిగే రాజకీయ సభల్లో మన నేతలు పలు అంశాల ప్రాతిపదికన కాస్త భావోద్వేగాలను రగిలించటం సహజమే. కానీ, ఈ ఎన్నికల్లో ఇవి దేశ సరిహద్దులే లక్ష్యంగా సాగుతున్నాయి. సొంత రాష్ట్రమైన గుజరాత్ నుంచి తూర్పుకొనలోని అరుణాచల్ ప్రదేశ్ వరకూ ఇదే ధోరణి. నిజానికి ఈ ధోరణి గతంలో ఎన్నడూ చూడనిది. ఎన్నికల బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు తీర్పుతో చీకటి భాగస్వాములెవరో దేశానికి తెలిసిందనే భయం, పేదలు, మధ్యతరగతి వర్గం ఆర్థికంగా కుదేలైపోతుందని చెబుతున్న సర్వేలు, ఇంకా ప్రాంతాన్ని బట్టి ఏర్పడుతున్న కొత్త భయాలు, అన్నింటికీ మించి తమ వ్యూహాలకు ప్రత్యర్థులు, ప్రజలు స్పందించకపోవటం ప్రధానిని కలవరపెడుతున్నాయనిపిస్తోంది. ఈ సమయంలో విపక్షాలు, హితైషులు చెప్పే మాటను వినకపోయినా ‘పార్టీలు వస్తాయి, పోతాయి. ప్రభుత్వాలు ఏర్పడతాయి, పడిపోతాయి. కానీ ఈ దేశం, ఇక్కడి ప్రజలు ఎప్పటికీ ఉంటారు’ అని పలికిన వాజ్‌పేయి మాటలనైనా ప్రధానికి ఎవరైనా గుర్తుచేయాలని నేడు దేశం కోరుకుంటోంది. తమ జీవన ప్రమాణాలను మెరుగుపరచే వాగ్దానాల కోసం ఎదురుచూసే బడుగుజీవులకు ఐదేళ్లకోసారైనా రవ్వంత స్వాంతననిచ్చే వాగ్దానాలు ఇవ్వాల్సిన దేశపెద్ద విద్వేషమనే వ్యూహాన్నే నమ్ముకుంటే మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్లే భావించాల్సి వస్తోంది. అమృతకాలపు మలిఏడాది జరుగుతున్న ఈ సార్వత్రిక ఎన్నికలు విద్వేషపు పునాదుల మీద జరిగితే, మరి ఆ ఎన్నికల ఫలితాల మూలంగా ఏర్పడే పార్లమెంటు రేపటి రోజు అమృత ఫలాలనిస్తుందో లేదో దేశ ప్రజలే నిర్ణయించుకోవాలి.
-గోరంట్ల శివరామకృష్ణ (సీనియర్ జర్నలిస్ట్)