Media Freedom Will Be A Raspberry: ప్రజాస్వామ్యపు నాలుగు మూల స్తంభాల్లో ఒకటి మీడియా. మరి, ఆ మీడియా నేడు స్వేచ్ఛగా తన పనిచేయగులుగుతుందా.. అంటే లేదనే సమాధానమే వస్తోంది. ప్రపంచపు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో మీడియా స్వతంత్రంగా పనిచేయలేకపోతుందనేందుకు అనేక ఉదాహరణలు ఇటీవల కాలంలో చర్చకు వచ్చాయి. ప్రపంచీకరణ తర్వాత మీడియాలోకి కార్పొరేట్ల పెట్టుబడులు ప్రవహించటం మొదలైన నాటి నుంచే మీడియా స్వేచ్ఛ మేడిపండుగా మారుతూ వచ్చినా, మధ్యేమార్గంగా వ్యవస్థ నడుస్తూ వచ్చింది. కానీ, మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియాలో స్వతంత్ర ఆలోచనలకు అవకాశం రానురాను తగ్గుతూ వచ్చింది. పత్రికా స్వేచ్ఛపై ప్రపంచవ్యాప్తంగా పనిచేసే అనేక సంస్థల నివేదికలు ఈ వాస్తవాన్నే మన ముందుంచుతున్నాయి. మనదేశంలో రిలయన్స్ ఆధ్వర్యంలో 27 చానళ్లు, అదానీ గుప్పిట్లో 11 చానళ్లు, సుభాష్‌చంద్ర చేతిలోకి 15 చానళ్లు, కొన్ని ప్రాంతీయ పార్టీల చేతుల్లో పలు మీడియా సంస్థలు ఉండటాన్ని బట్టి మీడియా రంగంలో పారదర్శకత తగ్గి, గుత్తాధిపత్యం ఎంతగా పెరిగిపోయిందో అర్థమవుతోంది. మరి.. ఇలాంటి ఛానళ్లు స్వప్రయోజనాలను పక్కనబెట్టి, సమాజ హితం కోసం పనిచేస్తాయని ఆశించిటం ఏ మేరకు సాధ్యమో మనకు అందరికీ అర్థమవుతూనే ఉంది.
గత పదేళ్లుగా మన దేశంలో స్వతంత్ర జర్నలిస్టులు బృందాలుగా ఏర్పడి, దేశంలోని వాస్తవాలను బయటపెట్టే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. వీరంతా గతంలో ఆయా మీడియా సంస్థల్లో పనిచేసి, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేయలేక బయటకి వచ్చినవారే. అయితే, వీరు వెల్లడించే వాస్తవాలను, బయటపెడుతున్న తెరవెనుక వాస్తవాలను జీర్ణించుకోలేని ప్రభుత్వాలు, వాటి అనుకూల మీడియా వారిని దారుణంగా అవమానించి, వారి విశ్వసనీయతను దిగజార్చేలా ట్రోలింగ్‌కు పాల్పడుతూ వస్తున్నారు. అప్పటికీ తగ్గని వారిని బెదిరించటం, నిర్బంధాలకు గురిచేయటం జరుగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో పత్రికా స్వేచ్ఛ సంక్షోభంలో పడిందని వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ – 2023 వ్యాఖ్యానించింది. 180 దేశాలలో భారత్ ర్యాంకు 161వ స్థానానికి పడిపోవడమే దీనికి నిదర్శనం. 2022లో భారత్ 150వ స్థానంలో ఉండగా, ఏడాది కాలంలో ఇది 10 స్థానాలు దిగజారింది. ఈ జాబితాలో మన పొరుగుదేశాలైన భూటాన్ (90), శ్రీలంక (135), పాకిస్థాన్ (150), అఫ్ఘానిస్థాన్ (152) మన కంటే మెరుగైన స్థాయిలో ఉన్నాయి. 2016 నుంచి భారత్ ర్యాంకింగ్ ఈ విషయంలో దిగజారుతూనే వస్తోందని ఆ నివేదిక పేర్కొంది. నిజాలను నిర్భయంగా బయటపెట్టే పాత్రికేయుల మీద దేశ ద్రోహం, క్రిమినల్, పరువు నష్టం వంటి కేసులు పెట్టిస్తున్నారని ఆర్‌ఎస్‌ఎఫ్ పేర్కొన్నది. కొంతమందినైతే దేశ వ్యతిరేకులుగా కూడా ముద్ర వేస్తున్నారని తెలిపింది. భారత్‌లో ఏటా కనీసం ముగ్గురు నలుగురు పాత్రికేయులు తమ కర్తవ్య నిర్వహణ విషయంలో హత్యకు గురవుతున్నారని పేర్కొన్న ఆర్‌ఎస్‌ఎఫ్, అత్యంత సున్నితమైన పరిస్థితిలో పాత్రికేయులు పనిచేసే దేశాల్లో భారత్ కూడా ఒకటిని వెల్లడించింది. ఆన్‌లైన్ వేదికగా మహిళా జర్నలిస్టులపై వేధింపులు, జమ్ముకశ్మీర్‌లో మీడియా స్వేచ్ఛకు పోలీసుల విధిస్తున్న సంకెళ్ల విషయాన్ని కూడా ఈ నివేదిక చర్చించింది.
Also Read: ఈసారి మైనారిటీల మద్దతు ఎవరికో?
మన దేశంలో మీడియా స్వేచ్ఛ ప్రమాదంలో ఉందనీ, తమను స్వతంత్రంగా పనిచేయనివ్వడం లేదని, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ తమపై ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారంటూ గతంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు 18 మీడియా సంస్థలు ఒక లేఖ రాశాయి. తమపై ప్రతీకార దాడులు జరుగుతాయనే భయంతో దేశంలోని చాలామంది జర్నలిస్టులు భయపడుతూ పనిచేయాల్సి వస్తోందని, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై కొందరు జర్నలిస్టులు రాసే వార్తలను ప్రభుత్వం అంగీకరించడం లేదని, సోదాల పేరిట వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆ లేఖలో వాపోయారు. పాత్రికేయులుగా తాము చట్టానికి అతీతులమని భావించటం లేదని, కానీ, పత్రికా స్వేచ్ఛను అడ్డుకుంటే ప్రజాస్వామ్య పునాదులు బలహీన పడతాయనే వాస్తవాన్ని వారు సుప్రీంకోర్టు ముందు ఉంచారు. జర్నలిస్టులు నిజాలు మాట్లాడినప్పుడే పత్రికా స్వేచ్ఛ సురక్షితంగా ఉంటుందని చెప్పారు. న్యూస్ క్లిక్ ఆన్‌లైన్ పోర్టల్‌లో పని చేసే 46 మంది ఉద్యోగుల ఇళ్లలో ఢిల్లీ పోలీసులు సోదాలు చేసిన నేపథ్యంలో సీజేఐకి మీడియా సంస్థలు ఇలా లేఖ రాయాల్సి వచ్చింది. న్యూస్ క్లిక్‌పై జరిగిన దాడులకు నిరసనగా దేశవ్యాపితంగా జర్నలిస్ట్ సంఘాలు, మేధావులు, రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు , కవులు ,కళాకారులూ రోడ్డెక్కారు. కేంద్రం తీరుకు దేశవ్యాపితంగా నిరసన పెల్లుబికింది. ఈ నిరసలకు మాజీ న్యాయమూర్తులు, ప్రముఖ జర్నలిస్టులు సైతం మద్దతు తెలిపినా ప్రభుత్వ వైఖరిలో పెద్ద మార్పు కనబడలేదు.
శాస్త్ర సాంకేతికత పెరిగాక ఎలక్ట్రానిక్ చానళ్లు, సోషల్ మీడియా పెద్దయెత్తున జన సామాన్యాన్ని ప్రభావితం చేసే సాధనంగా మారాయి. అందుకనే చానళ్లు అన్నీ ఇప్పుడు కార్పొరేటు శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఆయా వ్యాపార వర్గాల ప్రయోజనాలకు భిన్నమైనవేవీ ఇక వార్తలుగా రావు. ప్రజలు, సమాజము అనే ప్రాధాన్యం నుండి వ్యాపారులు, వ్యాపార ప్రయోజనం అనే ప్రాధాన్యానికి మారిపోయిందనేది జగమెరిగిన సత్యం. స్వాతంత్ర్య పోరాట కాలంలో నాటి పత్రికలు నాటి పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచాయి. కానీ, నేటి పత్రికల్లోకి కార్పొరేట్లు ప్రవేశించటంతో, సదరు పెట్టుబడిదారుల ప్రయోజనాలకు భిన్నంగా ఆ పత్రికలేవీ మాట్లాడలేని దుస్థితి. తమ అనుయాయ కార్పొరేట్లకు వ్యతిరేకంగా రాసిన మీడియా సంస్థలకు ప్రకటనలు రాకుండా ప్రభుత్వాలు అడ్డుపడుతున్నాయి. ఆదాయం లేకపోతే పత్రికలు నడవటం సాధ్యం కాదు గనుక అవి రాజీపడి పనిచేయాల్సి వస్తోంది. కనుక నేడు మన దేశంలోని మీడియాలోని కార్పొరేట్ల గుత్తాధిపత్యాన్ని తొలగించాల్సిన అవసరం ఉందంటూ గతంలో సుప్రసిద్ధ జర్నలిస్ట్ పాలగుమ్మి సాయినాథ్ అభిప్రాయపడ్డారు. ఈ పదేళ్ల కాలంలో రవీష్ కుమార్ మొదలు వందలాది పాత్రికేయులు తాము పనిచేసే సంస్థల నుండి ఒక్కరొక్కరుగా బయటపడటాన్ని బట్టి ప్రభుత్వాల ఒత్తిడి ఎంతగా ఉందో అర్థమవుతోంది.
గత దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయనేది కాదనలేని వాస్తవం. తెలంగాణ ఉద్యమ సమయంలో యావత్ పత్రికా రంగం ప్రజల పక్షాన నిలిచింది. కానీ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన మీడియా సంస్థలను దూరం పెట్టటం మొదలుపెట్టింది. దీంతో ఒకటి రెండు పత్రికలు, మీడియా సంస్థలు తప్ప మిగిలినవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి పూర్తిగా దాసోహం అయ్యాయి. ప్రభుత్వ ప్రకటనల కోసం, పెయిడ్ న్యూస్ కోసం కొన్ని పత్రికలు, ఛానళ్లైతే గులాంగురీ కూడా చేశాయి. నాటి అధికార పార్టీని ఆకాశానికి ఎత్తుతూ, వారి అవినీతి, కుంభకోణాలను కనుమరుగు చేసేందుకు యధాశక్తి ప్రయత్నించాయి. ఆ సమయంలో ఒకటో, రెండో మీడియా సంస్థలు ధైర్యంగా ప్రజల పక్షాన, సమస్యల కోసం నిబద్దతతో పనిచేయగా, దానిని సహించలేని నాటి ప్రభుత్వం వారికి ప్రభుత్వ ప్రకటనలు ఆపడం, అక్కడి సిబ్బందికి అక్రిడేషన్ కార్డులు జారీ చేయకపోవడం లాంటి ఎన్నో ఇబ్బందులు కలిగించారు. ప్రెస్ కాన్ఫరెన్స్ సమయాల్లో స్వయంగా సీఎం.. కొన్ని పత్రికల ప్రతినిధులను అవమానపరిచేలా మాట్లాడమూ జరిగింది. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన యువత, విపక్ష నేతలపై రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కేసులు నమోదు చేసిన సంగతిని మరువలేము. దీనికి తర్వాతి కాలంలో సదరు పాలకులు భారీ మూల్యాన్నే చెల్లించుకున్న సంగతి తెలిసిందే. సమాజ హితమే లక్ష్యంగా పనిచేసే మీడియా అవసరాన్ని ప్రభుత్వాలు, సమాజం సరిగా అర్థం చేసుకోలేకపోతే ప్రజాస్వామ్యమనే భావనే అర్థం లేనిదిగా మారుతుంది. అందుకే ప్రపంచస్థాయిలో ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు, ప్రజా సంఘాలు, ప్రభుత్వాలు నిజాలను నిర్భయంగా బయటపెట్టే మీడియా సంస్థలకు వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది. అప్పుడే నన్నయ చెప్పినట్లు.. వార్తయందు జగము వర్థిల్లుతుంది.
గోరంట్ల శివరామకృష్ణ (సీనియర్ జర్నలిస్ట్)