A Snake Wrapped Around The KCR Neck Does Not Stop: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అటు తిరిగి ఇటు తిరిగి ఇది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెడకు చుట్టుకునేలా ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో రోజురోజుకూ బయటికొస్తున్న అంశాల మీద ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ అంశంలో టెలికాం యాక్ట్ ఉల్లంఘన కింద కేసు నమోదు కావటం, ఈ వ్యవహారంలో అత్యున్నత స్థాయి పోలీసు అధికారుల మీద కేసులు నమోదుకావటం, దేశంలోనే ఈ చట్టం కింద నమోదైన కేసుకు తెలంగాణ చిరునామా కావటం సంచలనంగా మారుతోంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా వున్న కాలంలో విపక్ష నేతలు, సినీతారలు, చివరికి సొంత పార్టీ ప్రజాప్రతినిధుల ఫోన్లనూ ట్యాపింగ్ చేసినట్లుగా వార్తలు రావటం, ఇదంతా నిజమేనని ఈ అనైతిక వ్యవహారంలో భాగస్వాములైన సీనియర్ పోలీసు అధికారులు, పోలీసు విచారణలో వెల్లడించటం తెలంగాణ సమాజాన్ని నివ్వెరబోయేలా చేస్తోంది. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే తాము ఈ పనిచేయవలసి వచ్చిందని నిందితులంతా వెల్లడిస్తున్న తీరును చూస్తుంటే, కాస్త వెనకా ముందుగా ఈ కేసు బీఆర్ఎస్ అధినేత మెడకు చుట్టుకోవడం ఖాయమనే సూచనలు కనిపిస్తున్నాయి.
కేసు విచారణలో భాగంగా నిందితులు వరుసగా వెల్లడిస్తున్న విషయాల్లో ప్రధానమైనది ఫోన్ ట్యాపింగ్. స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం విపక్ష నేతల మధ్య జరిగిన సంభాషణలను దొంగచాటుగా విని వారి రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా నాటి బీఆర్ఎస్ పార్టీ ప్రతివ్యూహాలకు దిగిందనే విషయం స్పష్టమవుతోంది. విపక్ష నేతలు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడిన మాటలు, బంధుమిత్రులతో చేసిన వ్యక్తిగత సంభాషణలనూ ట్యాపింగ్ బృందం రికార్డు చేసిందంటే నాటి పాలకపక్షం ఎంతకు దిగజారిందనే విషయం అర్థమవుతోంది. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశంతో వీరు బడా వ్యాపారులు, సినీతారల వృత్తిగత, వ్యక్తిగత జీవితాల్లోకీ తొంగిచూశారనే విషయమూ బయటకు రావటం ఒక కోణమైతే, చివరికి సొంత పార్టీ ప్రజాప్రతినిధులనూ వదలకపోవటం గురించి తెలిసిన జనం నేడు నోరెళ్ల బెడుతున్నారు. ఈ ట్యాపింగ్ కేసులో విచారణ బృందం ముందుకు వచ్చిన నిందితులు తాము చేసిన మరో అనైతికమైన వ్యవహారాన్ని కూడా అధికారుల ముందు వెల్లడించారు. 2018 అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన అన్ని ఉప ఎన్నికలు, 2023 నాటి అసెంబ్లీ ఎన్నికల వేళ నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు తాము టాస్క్‌ఫోర్స్ వాహనాల్లో నాటి అధికార పార్టీ అభ్యర్థులకు అవసరమైన ఎన్నికల నగదును తరలించామని చెప్పుకొచ్చారు. అంతేగాక, ఫోన్ ట్యాపింగ్ సాయంతో విపక్షాల అభ్యర్థుల అనుపానులు గుర్తించి, వారి నగదును అధికారులు సీజ్ చేసేలా చేశామనీ, ఆ సమయంలో నగదు తరలిస్తూ పట్టుబడిన విపక్ష అభ్యర్థుల అనుచరుల మీద కేసులు కూడా నమోదు చేసినట్లు వివరించారు. దీనిని బట్టి నాటి ప్రభుత్వం ఖాకీలను పావులుగా వాడుకుని వందల కోట్ల నగదును అక్రమంగా తరలించిందనీ, 2018 మొదలు అన్ని ఎన్నికల్లో వారి విజయానికి వారు ఎన్ని అడ్డదారులు తొక్కిందీ అర్థమవుతోంది.
Read Also: ప్రజలను ఫూల్స్ చేస్తున్నదెవరు?
ఇదే ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని నాటి విపక్షనేతగా ఉన్న రేవంత్ రెడ్డి పలు మీడియా సమావేశాల్లో నాటి కేసీఆర్ సర్కారును నిలదీయటంతో బాటు తాము అధికారంలోకి వస్తే ఈ అనైతిక వ్యవహారం మీద విచారణ జరిపించి, ఈ చట్టవిరుద్ధమైన చర్యలో భాగమైన అధికారులను శిక్షిస్తామనీ హెచ్చరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ నియంతృత్వ పాలనకు తెలంగాణ సమాజం చరమగీతం పాడటంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటమే గాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. సీఎంగా అధికార బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన గతంలో చెప్పినట్లుగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద దృష్టిసారించారు. ఆ తర్వాత బయటికి వస్తున్న వాస్తవాలన్నీ చూస్తుంటే.. చాలామందికి ‘ఒక రాజు.. ఏడుగురు కొడుకుల కథ’ గుర్తుకురాక మానదు. ఈ కథ చివరకు ‘నా పుట్టలో వేలు పెడితే కుట్టనా’ అని చీమ అనటంతో ముగుస్తుంది. ఫోన్ ట్యాయింగ్ వ్యవహారపు పరిణామాలను చూస్తుంటే సరిగ్గా ఇదే గుర్తుకొస్తోంది. ఈ కేసులో తామంతా నాటి ప్రభుత్వ పెద్దల నుంచి తమకు వచ్చిన ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించాల్సి వచ్చిందని నిందితులంతా ముక్తకంఠంతో చెబుతుంటే.. మరి ఈ పుట్టలో వేలు పెట్టిన వారి వేలిని ‘చట్టం’ అనే చీమ కుట్టకుండా ఉంటుందా? అనే అభిప్రాయం కలుగుతోంది.
పోలీసు శాఖ నుంచి పదవీ విరమణ చేసిన వారికే నాటి ప్రభుత్వ పెద్దలు ఈ ఫోన్ ట్యాపింగ్ పనిని అప్పగించటం, ఈ బృందంలో అత్యున్నత స్థాయి అధికారుల్లో నూటికి 90 శాతం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావటంతో ఇప్పటివరకు దీనిని రాజకీయ కక్ష కోణంలో మాట్లాడుతూ వచ్చిన వారినీ మౌనం వహించేలా చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కోసం కేంద్రం అనుమతి లేకుండా విదేశాల నుంచి విలువైన పరికరాలను కొనుగోలు చేయటం, ఏకంగా నాటి విపక్ష నేత ఇంటికి సమీపంలో ఇంటిని అద్దెకు తీసుకుని ట్యాపింగ్‌కు పాల్పడటంతో బాటు అధినేతలు ఇచ్చిన ఎజెండాను అమలు చేసే క్రమంలో పలువురు అధికారులు హవాలా వ్యాపారుల జాడను గుర్తించి, వారిని బెదిరించి అక్రమార్జనకు పాల్పడటం.. వంటి వరుస పరిణామాలను పరిశీలిస్తే గత ప్రభుత్వం స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ వ్యవస్థలను తన ప్రైవేట్ సైన్యంగా మార్చుకుని దారుణంగా దుర్వినియోగం చేసినట్లు బోధపడుతోంది. స్వాతంత్ర్య భారత చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇంత దిగజారి ప్రవర్తించలేదని, ఫోన్ ట్యాపింగ్ పరిణామాలను చూస్తున్న నేటి తెలంగాణ మేధావి వర్గం మథనపడుతోంది.
Read Also: పదిహేడవ లోక్‌సభ పనితీరు ఇదే..!
అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ఆకాశమే హద్దుగా మున్ముందుకు దూసుకుపోతోందనీ, తెలంగాణ పునర్నిర్మాణమే తమ ఏకైక లక్ష్యమని చెబుతూ వచ్చిన బీఆర్ఎస్ అధినాయకత్వం మాటలను తెలంగాణ ప్రజలు 2018 ఎన్నికల్లో నమ్మినా గత శాసన సభ ఎన్నికల్లో వారిని విపక్షానికే పరిమితం చేశారు. కానీ, వంచనే నైజంగా, అధికారమే పరమావధిగా, అక్రమార్జనే లక్ష్యంగా సాగిన గత ప్రభుత్వ పెద్దల వికృత ఆలోచనలు తాజా విచారణలో ఒక్కటొక్కటే బయటపడుతుండటం, చివరికి వ్యక్తుల వైవాహిక జీవితాల్లోకీ వారి తొంగి చూసిన వారి దిగజారుడు ధోరణి జుగుప్సను, దేశవ్యాప్తంగా తెలంగాణ పేరుకు మచ్చ తెచ్చిందనే అంతులేని ఆవేదనను కలిగిస్తున్న ఈ తరుణంలో.. కాస్త ఆలస్యంగానైనా చైతన్యానికి ప్రతీక అయిన మన తెలంగాణ సమాజం నాటి పాలకుల విషపు పడగ నీడ నుంచి బయటపడిందనే వాస్తవమూ రవ్వంత ఊరటనిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలు ఎటు దారితీయనున్నాయో పూర్తిగా అవగతం కావటానికి ప్రజలు మరికొంత సమయం ఎదురు చూడాల్సిందే.
–పి.వి. శ్రీనివాస్ (సీనియర్ జర్నలిస్ట్)