Have You Ever Politicians Been Fooled In Public: మధ్యయుగాల్లో ‘రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా’ అన్నట్లు పాలన సాగేది. అప్పట్లో నియంతల ఆవేశమే ఆదేశం అయ్యేది. చరిత్రలో ఫూల్స్ డే కూడా అలా పుట్టిందే. అయితే.. పాలనా వ్యవస్థగా ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత కూడా కొందరు నియంతృత్వ భావాలున్న నేతలు ప్రజలను ఫూల్స్‌ను చేస్తూనే వస్తున్నారు. ముఖ్యంగా ఈ లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలోని రాజకీయ పరిణామాలు రోజురోజుకూ కొత్తమలుపు తిరుగుతున్నాయి.
తెలంగాణ రాజకీయాన్ని పరిశీలిస్తే పాత తెలుగు సినిమా ‘ధర్మదాత’లోని ‘ఎవ్వరి కోసం ఎవరున్నారు.. పొండిరా పొండి. నా కాలం ఖర్మం కలిసొస్తేనే రండిరా రండి’ అనే పాట గుర్తుకువస్తోంది. తనను మోసగించిన కుటుంబ సభ్యులను ఉద్దేశించి కథానాయకుడు పాడే పాట అది. తొమ్మిదిన్నరేళ్ల పాటు తెలంగాణను తన ఇష్టాఇష్టాల ఆధారంగా పాలించి, ఇటీవలి ఎన్నికల్లో పరాజయం పాలైన నాటి నుంచి ఫామ్‌హౌస్‌కే పరిమితమైన మాజీ సీఎం కేసీఆర్ బహుశా ఇదే పాట పాడుకుంటున్నట్లు అనిపిస్తోంది. అధికారంలో ఉండగా, ‘మోడీ.. ఈడీ’ అంటూ అంత్యప్రాసలతో తన భాషా పాండిత్యా్న్ని జనం ముందు ప్రదర్శించిన కేసీఆర్.. లిక్కర్ స్కామ్‌లో తన కుమార్తె కవితను తన కళ్లముందే తీహార్‌కు తరలించటంతో ఎన్నడూ ఊహించనంత కుదుపుకు లోనయ్యారు.
మరోవైపు గుంపులు గుంపులుగా పార్టీ నేతలు కాంగ్రెస్‌లో చేరుతుంటే.. ఇక మౌనంగా ఉంటే తనను జనం బొత్తిగా మరిచిపోతారనే భయంతో అప్పుడప్పుడు జనంలోకి వచ్చిపోతున్నారు. విపక్ష నేతగా రెండుసార్లు అసెంబ్లీ సమావేశాలకు డుమ్మాకొట్టిన బీఆర్ఎస్ అధినేత, ఆ మధ్య నల్గొండ సభలో కృష్ణా జలాలపై కాంగ్రెస్ సర్కారు నిర్ణయాలను ఏకిపారేశారు. మొన్నటికి మొన్న కరీంనగర్‌లో మరో సభ పెట్టి పార్టీ శ్రేణుల ముందు ధైర్య వచనాలు వల్లించి, ‘ కంగారొద్దు.. రేపు మనదే’ అంటూ భరోసా ఇచ్చారు. తాజాగా ఎండిన పంటల పరిశీలన అంటూ సూర్యాపేట, జనగామ ప్రాంతాల్లో పర్యటిస్తూ.. ఎండిన పంటలు చూసి తన గుండెలు పగిలిపోతున్నాయని ఆక్రోశించారు. ఇది ప్రకృతి సంక్షోభం కాదనీ, సర్కారు చేష్టలుడిగి చూస్తూ కూర్చోవటం వల్ల వచ్చిన సమస్య అంటూ కాంగ్రెస్ సర్కారును తప్పుబట్టారు. ‘సీఎం.. వాట్ ఆర్ యూ డూయింగ్’ అంటూ పాపమంతా ముఖ్యమంత్రి నెత్తిన వేసే ప్రయత్నమూ చేశారు. దీంతో పాలక పక్షం రంగంలోకి దిగి ‘ఈట్ కా జవాబు పత్తర్ సే’ అన్నట్లుగా కేసీఆర్ పాలనా కాలపు వైఫల్యాలన్నీ ఏకరువు పెట్టేసింది.
Read Also: దక్షిణానికి బీజేపీ దారేది..!
ఈ కీలక సమయంలోనే లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ రావటంతో, ప్రధాన పార్టీలన్నీ దాదాపు తమ అభ్యర్థుల పేర్లు ఖరారుచేసి ప్రచారబరిలోకి దిగుతున్నాయి. ఈ వేసవి సీజన్‌లో నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో రోజురోజుకూ తెలంగాణలో వాతావరణం మరింత వేడెక్కిపోతోంది. అందరూ ప్రజా సమస్యల పేరుతోనే ఒకరునొకరు దూషించుకుంటూ.. ఎప్పటిలాగే ప్రజల్ని ఫూల్స్‌ని చేసే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. ఇది బాధాకరమైన విషయం.
అధికారమనే నీటి మడుగులో ఉన్నంతకాలం తమకు ఎవరూ ఏమీ చేయలేరని నిన్నటిదాకా విర్రవీగిన నాటి అధికార పక్ష నేతల్లో చాలామంది.. విపక్షంలోకి మారగానే ఒడ్డున పడ్డ చేపలాగా గిలగిలా కొట్టుకుంటున్నారు. అధికారం శాశ్వతమని నోటికొచ్చిన మాటలు మాట్లాడిన వీరంతా ‘ రాజకీయాల్లో అధికారం ఎవరికీ శాశ్వతం కాదుగా’ అంటూ నీతి వచనాలు ప్రబోధిస్తున్నారు. బహుశా కాలమహిమ అంటే ఇదే కాబోలు. తెలంగాణలో వీచిన ప్రచండ ప్రభుత్వ వ్యతిరేక గాలులకు కూకటివేళ్లతో పెకలించబడిన నాటి పాలకపార్టీ.. గత చరిత్రలోని ఉదాహరణకు ఒక కొనసాగింపుగా నిలిచిపోతోంది. మరోవైపు తెలంగాణలోని కొందరు నేతల ఫిరాయింపులు చూస్తుంటే.. వీరు ఏ రోజు ఎక్కడ ఉన్నారో గుర్తు పెట్టుకోవటం కష్టమేమో అన్నట్లుగా ఉంది. నిన్నటిదాకా ‘ఆహా ఓహో’ అని కీర్తించిన ఈ వందిమాగధులంతా, నేడు స్వీయ రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా తమ పాత అధినాయకులను దూషిస్తున్న ఈ విన్యాసాలను జనం ఓ కంట గమనిస్తూనే ఉన్నారు. అధికార పార్టీలో ఉండగా తన కింది కార్యకర్తలను ఎదగనీయకుండా తొక్కిపట్టిన కొందరు వయోధికులైన నేతలు ‘ముసలి తనానికి కుసుమ గుడాలు’ అన్నట్లు పాతగూటికి చేరుతున్నారు. దీంతో కింది స్థాయి కార్యకర్తలంతా పల్లకీ మోసే బోయీలుగానే మిగిలిపోతున్నారు. మరోవైపు ఇలాంటి నేతలకే అన్ని పదవులు దక్కటం చూసి సామాన్యులు నోరెళ్లబెడుతున్నారు. సర్వం కోల్పోయినా చివరి వరకు నిటారుగా నిలబడిన ఎందరో పుట్టిన ఈ తెలంగాణలో ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్లుగా కొందరు నేతల దిగజారిన రాజకీయ విన్యాసాలు, ఉపన్యాసాల మూలంగా ఈ మహోన్నతమైన ప్రజాస్వామ్యం మీద ప్రజలు నమ్మకాన్ని కోల్పోతున్నారు.
ఈ విషయంలో పార్టీల జెండాలు వేరైనా రాజకీయ పక్షాలన్నీ ఆ తానులో ముక్కలే అన్నట్లుగా రాజకీయం సాగుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలచేత ఎన్నకోబడి, విపక్షంలో కూర్చున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నేటి బీఆర్ఎస్ తనవైపు మళ్లించుకుంది. ఈ అడ్డగోలు, అనైతిక వ్యవహారానికి నాడు ‘తెలంగాణ పునర్నిర్మాణం కోసం జరుగుతున్న రాజకీయ పునరేకీకరణ’ అనే అందమైన పేరు పెట్టింది. అయితే.. అదే బీఆర్ఎస్ పార్టీ అధినేత నేడు తన నేతలంతా కాంగ్రెస్‌లో చేరుతుంటే ప్రజాస్వామ్యంపై పెడబొబ్బలు పెడుతున్నారు. పరిస్థితులను బట్టి ఒక్కోసారి పీడితులు.. పీడకులు అవుతుంటే.. మరోసారి పీడితులు బాధితులుగా మారుతున్నారు. అయతే ఈ నీతిమాలిన చర్యలో పాత్రలు మారుతున్నాయి కానీ పాత్రల స్వభావాలు ఏమాత్రం మారకపోవటం గొప్ప విషాదం. అధికారమే పరమావధిగా ప్రజాస్వామ్యాన్ని పరిహాసంగా మార్చుతున్న ఈ వికృత విన్యాసానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి పరిష్కారం కోసం ఇప్పుడున్న పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఒక మార్పును తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత చట్టంలో ఫిరాయింపుల మీద నిర్ణయం తీసుకునే అధికారం అసెంబ్లీ స్పీకర్ చేతిలో ఉంది. ఈ చట్టానికి సవరణ చేసి ఈ అధికారాన్ని స్పీకర్ చేతిలో నుంచి తప్పించాలి. తాము గెలిచిన పార్టీని వదిలి వేరే పార్టీలో చేరిన ప్రజాప్రతినిధులు ఆటోమేటిక్‌గా తమ పదవిని కోల్పోయేలా చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఎంతైనా అవసరం. అయితే.. చూస్తూ చూస్తూ చావును కొనితెచ్చే ఈ చేదు సవరణకు రాజకీయ పక్షాలు సిద్ధమవుతాయా అనే అనుమానం ఉన్నప్పటికీ ఎవరో ఒకరు పిల్లి మెడలో గంట కట్టేందుకు ముందుకు రావాల్సిందే.
Read Also: అంతర్గత సవాళ్లే అతిపెద్ద టాస్క్
ప్రజాస్వామ్యంలో ‘ప్రజలే ప్రభువులు – పాలకులు ఎప్పటికీ సేవకులే’ అనే మాట వర్తమానంలో తిరగబడింది. కానీ, గాడితప్పిన ఈ రాజకీయ వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టగల సామర్థ్యమూ ప్రజలకే ఉంటుంది. తమ ఓటుతో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయనీ, తాము చెల్లించే పన్నులే నేతలు వెచ్చిస్తున్నారనే ఎరుక సమాజంలో వచ్చిన నాడు తప్పుడు నేతలకు సామాన్యులే కర్రుకాల్చి వాతపెట్టక మానరు. విజ్ఞులైన ఓటర్లు అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు ఈ పని చేస్తూనే ఉన్నారు. ఆ విజ్ఞతే మన ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష.
-బండారు రామ్మోహనరావు (పొలిటికల్ అనలిస్ట్)