17th lok Sabha Review Insights Infographics Performance: స్వాతంత్ర భారతంలో ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా భారత పార్లమెంటు నిలుస్తుందని నాడు మన రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించారు. 1952 నుంచి నేటి వరకు మన దేశం 17 లోక్‌సభల పనితీరును చూడగా, 2024 జూన్ 4 నాటికి 18వ లోక్‌సభ ఏర్పడబోతోంది. ఈ నేపథ్యంలో గడచిన 17వ లోక్‌సభా కాలంలో ఎలా గడిచిందో ఓసారి తెలుసుకునే ప్రయత్నిం చేద్దాం. 17వ లోక్‌సభ చిట్టచివరి సమావేశం జరిగిన రోజు దేశ ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ సభా కాలంలో 97% సమయం సద్వినియోగం అయిందనీ, ఈ ఐదేళ్ల కాలంలో జరిగిన 7 సెషన్లు 100% కంటే ఎక్కువ ఉపయుక్తంగా నడిచాయని చెప్పుకొచ్చారు. ఆయన మాటలను వింటున్నప్పుడు గత 77 ఏడేళ్లలో తమ హయాంలోనే చట్టసభలు సక్రమంగా పనిచేస్తున్నాయనే రవ్వంత అతిశయమూ కనిపించింది. అయితే, తన పాలనా కాలంలో విస్మరించిన కొన్ని ప్రజాస్వామ్య సంప్రదాయలపై ప్రధాని మౌనం వహించారు. 1969 నుంచి లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షానికి ఇచ్చే సంప్రదాయానికి పాతరేస్తూ, అసలు ఎన్నికే జరపకుండా మౌనం వహించారు. దేశ స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి ఈ ప్రభుత్వ హయాంలోనే ఇలా జరిగింది.
ఇక గడచిన ఐదేళ్ల కాలంలో మన లోక్‌సభ ఎంత గొప్పగా పనిచేసిందో తెలుసుకునేందుకు కొన్ని గణాంకాలను పరిశీలిద్దాం. వాజపేయి ప్రధానిగా ఉన్న 1999 – 2004 మధ్యకాలపు 13వ లోక్‌సభ 423 రోజులు పనిచేసింది. కానీ, 17వ లోక్‌సభ కేవలం 278 రోజుల్లోనే సమావేశమైంది. అంటే 13వ లోక్‌సభ కంటే 17వ లోక్‌సభ సుమారు 34% సమయం తక్కువ పనిచేసింది. 2020 – 2022 మధ్యకాలంలో లోక్‌సభ సమావేశాలు ఏడు పర్యాయాలు అనుకున్న షెడ్యూల్ కంటే ముందే ముగిశాయి. అంతేగాక.. 2023లో జరిగిన చివరి ప్రత్యేక సెషన్‌తో పాటు శీతాకాల సమావేశాలు కూడా షెడ్యూల్ కంటే ముందే ముగిశాయి. ఇలా షెడ్యూల్ కంటే ముందే సెషన్ ముగిస్తే.. ఆ కోత పెట్టిన రోజుల్లో ఎంపీలు అడగాల్సిన ప్రశ్నలు మిగిలిపోతాయని ప్రభుత్వానికి అనిపించలేదు. ఇక ఆర్డనెన్స్‌ల జారీలోనూ 17వ లోక్‌సభా కాలపు ప్రభుత్వం రికార్డులకెక్కింది. పదేళ్ల యుపిఎ హయాంలో నాటి కేంద్ర ప్రభుత్వం 61 ఆర్డినెన్స్‌లు జారీ చేయగా, 2014 నుండి 2021 మధ్యనే ఏకంగా 76 ఆర్డినెన్స్‌లు జారీ అయ్యాయి.
Read More: ఉచితాలన్నీ అనుచితాలేనా?
2019 నుంచి డిసెంబర్ 21, 2023 నాటికి లోక్‌సభలో 86, రాజ్యసభలో 103 బిల్లులను 2 గంటల కంటే తక్కువ టైంలో చర్చించి పాస్ చేశారు. 2023 వర్షాకాల సమావేశంలో రాజ్యసభ ఫార్మసీ (సవరణ) బిల్లును కేవలం 3 నిమిషాల్లోనే ఆమోదించి కొత్త రికార్డును సృష్టించింది. ఆ మర్నాడే సెంట్రల్ జిఎస్‌టి సవరణ, ఇంటిగ్రేటెడ్ జిఎస్‌టి సవరణ బిల్లులను మన లోక్‌సభ సరిగ్గా మూడే నిమిషాల్లో ఆమోదించింది. అంతేకాదు.. అసలు ఎజెండాలోని బిల్లులను పక్కనబెట్టి, హటాత్తుగా కొత్తబిల్లులు తీసుకొచ్చి వాటిని నిమిషాల వ్యవధిలో ఆమోదించిన ఘనతా 17వ లోక్‌సభకే దక్కుతుంది. 2009 – 2014 మధ్యకాలంలో నాటి ప్రభుత్వం 71% బిల్లులను స్టాండింగ్ కమిటీలకు పంపగా, 2019 నుండి కేవలం 16% బిల్లులు మాత్రమే స్టాండింగ్ కమిటీ ముందుకు పరిశీలన కోసం వెళ్లాయి. 2014 – 2021 మధ్యకాలంలో మన పార్లమెంటులో ప్రవేశపెట్టిన 301 బిల్లులలో 74 బిల్లులు (24.5%) బిల్లులు మాత్రమే సంప్రదింపుల కోసం సర్క్యులేట్ చేశారు. అయితే, ఈ 74 బిల్లులలో కనీసం 40 బిల్లులను విపక్షం పరిశీలించేందుకు ఇవ్వాల్సిన నెలరోజుల వ్యవధిని ఈ ప్రభుత్వం కుదించివేసింది. సమాజాన్ని బాగా ప్రభావితం చేసే, దేశ, సమాజపు తక్షణ ప్రాధాన్యమున్న అంశాలపై చర్చించాలని రూల్ నంబరు 267 కింద విపక్ష సభ్యులు అనేకసార్లు లేవనెత్తినా వారికి మాట్లాడే అవకాశం రాలేదు. లోక్‌సభలో సభానాయకుడిగా ఉన్న ప్రధాని మోదీ ‘రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం’ మీద తప్ప ఈ ఐదేళ్ల కాలంలో కీలకమైన ఏ అంశంమీదనైనా సభలో నిలబడి సభ్యుల అనుమానాలు దూరంచేయలేకపోయారు.
మరీ ముఖ్యంగా కీలకమైన 3 క్రిమినల్ బిల్లుల విషయంలో హోం వ్యవహారాల కమిటీ ప్రజల నుండి ఎలాంటి సలహాలను గానీ సూచనలను గానీ ఆహ్వానించలేదు. ఈ క్రిమినల్ బిల్లుల విషయంలో సర్కారు ఆత్రుత, నాటకీయత ఎంతగా కనిపించిందంటే.. ఈ బిల్లుల మీద అభిప్రాయాలు చెప్పే అవకాశం ప్రభుత్వం నిర్ణయించిన వ్యక్తులకు మాత్రమే దక్కింది. ఇదేంటని నిలదీసిన విపక్షానికి సర్కారు మౌనమే సమాధానమైంది. ఇక 2014 నుంచి చివరి సెషన్ వరకు కేవలం ఐదంటే ఐదు బిల్లులే ఉమ్మడి పార్లమెంటరీ కమిటీల ముందుకు వెళ్లాయి. 2016- 2023 మధ్యకాలంలో వచ్చిన బడ్జెట్ సమావేశాల్లో 79% సెషన్స్‌లో ఎలాంటి చర్చా లేకుండానే ఆమోదాలు జరిగిపోయాయి. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆయా శాఖలు తమ శాఖ కేటాయింపులను లోతుగా పరిశీలించి, సలహాలు, సూచనలు ఇచ్చేందుకు 40 రోజుల సమయం ఇచ్చేవారు. 2016 నుంచి అది సగానికి కుదించబడింది. ఈ గణాంకాలను బట్టి ఈ ప్రభుత్వానికి చర్చల మీద, సంప్రదింపుల మీద ఎంత నమ్మకం ఉన్నాయో అర్థమవుతుంది. చివరకు 2023 డిసెంబరు 13న ఇద్దరు ఆగంతకులు జీరో అవర్ జరుగుతుండగా, గ్యాలరీల్లోంచి దూకటంతో అప్పటిదాకా గొప్పగా కీర్తించబడిన ఈ గొప్ప భవనపు భద్రతా ప్రమాణాలు ఏపాటివో బయటపడ్డాయి. దీనిపై ప్రధాని, హోంమంత్రి ఓ ప్రకటన చేయాలని అడిగిన పాపానికి 146 మంది ఎంపిలను సస్పెండ్ చేసి పారేశారు. సరిగ్గా వారి సస్పెన్షన్ తర్వాత ప్రభుత్వం హడావుడిగా 3 క్రిమినల్ బిల్లులు, టెలీ కమ్యూనికేషన్ బిల్లులు, ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకపు బిల్లులను తీసుకొచ్చి వేగంగా వాటిని ఆమోదింపజేసుకుంది.
Read More: ఉమ్మడి పౌరస్మృతికి రూట్‌మ్యాప్ ఏదీ?
వైవిధ్య భరితమైన సంస్కృతీ సంప్రదాయాలు, లెక్కకు మించిన భాషలు, ప్రపంచపు అతి పెద్ద జనాభాకు ఆలవాలమైన ఈ దేశాన్ని పాలించే పాలకులు ఈ దేశపు బహుళత్వపు విలువలను గౌరవించి, విపక్షపు భిన్నాభిప్రాయాన్ని వినేందుకు సిద్ధంగా లేని రోజు.. భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్యమనే మాట కేవలం కాగితాలమీద ఉంటుందేమో గానీ, ఆచరణలో మాత్రం అది భిన్నాభిప్రాయాన్ని పట్టించుకోని అధ్యక్ష ప్రజాస్వామ్యమే అవుతుంది.
-గోరంట్ల శివరామకృష్ణ (సీనియర్ జర్నలిస్ట్)