తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Cyber Crime: విదేశీ ఉద్యోగం మోజులో యువకులు దేశంగాని దేశం వెళ్లి సైబర్ క్రిమినల్స్ ఉచ్ఛులో చిక్కుకుంటున్నారు. నిత్యం చిత్రహింసలు అనుభవిస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో సైబర్ మోసాలు చేస్తున్నారు. భారత ప్రభుత్వం జోక్యం చేసుకున్నపుడు కొందరు యువకులు తమ తమ ఇళ్లకు చేరుతున్నా ఇప్పటికీ వేలాది మంది సైబర్ నేరగాళ్ల చేతుల్లో నుంచి తప్పించుకోలేక నానా యాతనలు పడుతున్నారు.
స్పెషల్ బ్రాంచ్ కు చెందిన ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపిన ప్రకారం గడిచిన రెండేళ్లలో విజిటింగ్ వీసాపై కాంబోడియా, థాయ్ లాండ్, మయన్మార్, వియత్నాం దేశాలకు వెళ్లిన దాదాపు 30వేల మంది భారతీయుల ఆచూకీ దొరకటం లేదు. వీళ్లంతా సైబర్ బానిసత్వంలో ఉండి ఉంటారని ఆ అధికారి చెప్పారు.
సోషల్ మీడియా..
ప్రధానంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల పేర యువకులను ట్రాప్ చేస్తున్న సైబర్ క్రిమినల్స్ ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం, టెలిగ్రాం తదితర యాప్ ల ద్వారా పని కానిస్తున్నారు. నెలకు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల జీతం ఆసక్తి ఉన్నవారు సంప్రదించండి అంటూ తమ వివరాలు ఇస్తున్నారు. విదేశీ ఉద్యోగం మోజులో కాంటాక్ట్ చేసిన వారిని విజిట్ వీసాలపై మా వద్దకు వచ్చేయండి ఎలాంటి సమస్య లేకుండా చూసుకుంటామని చెప్పి పిలిపించుకుంటున్నారు.
ఏజెంట్ల ద్వారా..
సోషల్ మీడియాలో వస్తున్న ఆఫర్లను చూసి కొందరు యువకులు సైబర్ క్రిమినల్స్ ట్రాప్ లో పడుతుంటే మరికొన్నిసార్లు ఏజెంట్లు తెలిసి తెలిసి పలువురు యువకులను విదేశీ ఉద్యోగాల పేర సైబర్ క్రిమినల్స్ వద్దకు చేరుస్తున్నారు. రెండు నుంచి మూడు లక్షల రూపాయలు తీసుకుని పాస్ పోర్ట్, వీసా సమకూర్చి ఆయా దేశాల్లోని సైబర్ నేరగాళ్ల వద్దకు పంపిస్తున్నారు.
వచ్చీరాగానే..
ఇలా ఉద్యోగం మోజులో తమ వద్దకు చేరుతున్న యువకుల నుంచి సైబర్ క్రిమినల్స్ ముందుగా పాస్ పోర్టులు, వీసాలు తీసేసుకుంటున్నారు. ఆ తరువాత సిటీలు, గ్రామాలకు దూరంగా నిర్జన ప్రదేశాల్లో తాము ఏర్పాటు చేసుకున్న సైబర్ కేప్ లకు తరలిస్తున్నారు. ఎన్ని రకాలుగా సైబర్ నేరాలు చేయవచ్చన్న దానిపై అవగాహన కల్పిస్తున్నారు. అనంతరం మన దేశానికి చెందిన వారిని టార్గెట్ చేయిస్తూ నేరాలు చేయమంటున్నారు.
ఒప్పుకోకపోతే..
సైబర్ నేరాలు చేయటానికి ఎవరైనా ఒప్పుకోకపోతే సైబర్ క్రిమినల్స్ వారికి నరకం చూపిస్తున్నారు. రోజుల తరబడి ఆహారం ఇవ్వకుండా గదుల్లో నిర్భంధిస్తున్నారు. కర్రలు, ఇనుపరాడ్లతో చితకబాదుతున్నారు. కరెంట్ షాకులు పెడుతున్నారు. సైబర్ క్రిమినల్స్ చేతుల్లో చిక్కి సహాయం కోసం సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన కరీంనగర్ జిల్లా వాసి మధుకర్ రెడ్డి ఇదే విషయాన్ని చెప్పాడు. సైబర్ క్రిమినల్స్ పెడుతున్న ఈ హింసలను భరించలేక చాలామంది ఇష్టం లేకున్నా సైబర్ నేరాలు చేస్తున్నట్టు వివరించాడు.
భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి..
విదేశీ ఉద్యోగం మోజులో దేశంగాని దేశం వెళ్లి సైబర్ క్రిమినల్స్ చేతుల్లో బందీలుగా మారి నిత్యం నరకం అనుభవిస్తున్న వారికి విముక్తి కల్పించటానికి భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. విషయం బయటపడినపుడు కాకుండా దీని కోసం నిరంతర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీనియర్ పోలీసు అధికారులు సైతం అంటున్నారు.
భారత విదేశాంగ శాఖ ఆయా దేశాల్లోని దౌత్య కార్యాలయాల సిబ్బందిని సమన్వయం చేసుకుని చొరవ తీసుకున్నపుడే ఇది సాధ్యమవుతుందన్నారు. ఇటీవల థాయ్ లాండ్ లో సైబర్ క్రిమినల్స్ చేతుల్లో చిక్కిన 540 మంది భారతీయులకు విముక్తి దొరకటంలో (వీళ్లలో తెలంగాణకు చెందిన 24మంది యువకులు ఉన్నారు) భారత విదేశాంగ శాఖదే కీలక పాత్ర అని చెప్పారు.
Also Read; Cyber Crime: సైబర్ కిలాడీ అరెస్ట్.. ఎలా అరెస్ట్ చేశారంటే?
ఇలా తమ దృష్టికి వచ్చినపుడే కాకుండా భారత విదేశాంగ శాఖ ఈ తరహా చర్యలను నిరంతరం తీసుకుంటే వేలాది మంది యువకులకు విముక్తి దొరుకుతుందన్నారు. అదే సమయంలో విదేశీ ఉద్యోగం అనగానే ముందూ వెనకా ఆలోచించకుండా యువకులు దేశంగాని దేశం వెళ్ల వద్దని సూచించారు. భారత విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన వెబ్ సైట్ కు వెళ్లి వచ్చిన జాబ్ ఆఫర్ సరైందేనా? అన్న విషయాన్ని తనిఖీ చేసుకోవాలన్నారు.
ఉద్యోగం కోసం బయల్దేరి వెళ్లే ముందు ఆఫర్ చేసిన విదేశీ కంపెనీ లేదా వ్యక్తిని లిఖితపూర్వక అగ్రిమెంట్ ఇవ్వాలని అడగాలని చెప్పారు. విద్యార్హతలు తక్కువగా ఉన్నా ఉద్యోగంలో పెట్టుకుంటామంటే అనుమానించాలన్నారు. ఇక, విదేశీ ఉద్యోగం మోజులో విదేశాలకు వెళ్లి ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే 1930 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.
నిఘా పెట్టిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో..
విదేశీ ఉద్యోగాల పేర యువకులను సైబర్ క్రిమినల్స్ ఉచ్ఛులోకి నెడుతున్న ఏజెంట్లపై నిఘా పెట్టినట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్ తెలిపారు. డబ్బు కోసం యువకులను నరకంలోకి నెడుతున్న పదిహేను మంది ఏజెంట్లను గుర్తించినట్టు చెప్పారు. వీరిలో ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేశామన్నారు. మిగితా తొమ్మిది మంది పరారీలో ఉన్నట్టు తెలిపారు. వీరిలో కొందరు విదేశాల్లో ఉన్నట్టు సమాచారం ఉందని చెప్పారు. ఈ అందరినీ కూడా అరెస్ట్ చేయటానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
Also Read; Zaheerabad Crime: జెహీరాబాద్ లో దారుణం.. ఒంటరిగా ఉన్నమహిళపై దాడి.. ఆపై