Maharashtra: మహారాష్ట్రలోని సతారా జిల్లా ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఎస్ఐ వేధింపులు తాళలేక ఓ మహిళా యువ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు సబ్ ఇన్ స్పెక్టర్ గోపాల్ బద్నే (Gopal Badne) కారణమని ఎడమచేతిలో రాసుకొచ్చింది. గత 5 నెలల్లో తాను 4 సార్లు అత్యాచారానికి గురైనట్లు పేర్కొన్నారు. ఎస్ఐ చేతిలో తాను శారీరకంగానే కాకుండా మానసికంగానూ వేధింపులకు గురైనట్లు యువ వైద్యురాలు వాపోయింది. మరో పోలీసు అధికారి ప్రశాంత్ బాంకర్ (Prashant Bankar) సైతం తనను వేధించాడని చేతిపైన రాసుకొచ్చింది. ఈ కారణాల చేతనే ఆత్మహత్య చేసుకున్నట్లు వైద్యురాలు స్పష్టం చేసింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
తొలుత డీఎస్పీకి ఫిర్యాదు
మృతి చెందిన వైద్యురాలు.. ఫల్టాన్ సబ్ డిస్ట్రిక్ట్ ఆస్పత్రి (Phaltan Sub-district hospital)లో మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. ఎస్ఐ వేధింపులకు గురిచేస్తున్న విషయాన్ని ఆమె జూన్ 19వ తేదీనే ఫల్టాన్ డీఎస్పీకి తెలియజేసింది. ప్రస్తుతం సూసైడ్ నోట్ లో ఏ ఆరోపణలు చేసిందో.. సరిగ్గా అవే విషయాలను ఫిర్యాదులో పేర్కొంది. డీఎస్పీకి రాసిన లేఖలో ఫల్టాన్ రూరల్ పోలీసు విభాగానికి చెందిన ముగ్గురు అధికారులపై వైద్యురాలు ఆరోపణలు చేసింది. ఎస్ఐ గోపాల్ బద్నే, సబ్ డివిజనల్ ఇన్‌స్పెక్టర్ పాటిల్ (Patil), ఎస్ఐ లాడ్ పుత్రే (Ladputre) పై వేధింపుల ఆరోపణలు చేసి.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాల నేపథ్యంలో ఎస్ఐ గోపాల్ బద్నేను అధికారులు సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మహిళా వైద్యురాలిని పోలీసు అధికారి వేధించిన ఘటన.. మహారాష్ట్రలో రాజకీయ దుమారానికి కారణమైంది. కాంగ్రెస్ నేత విజయ్ నాందేవరావు ఈ ఘటనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘రక్షకుడే రాక్షసుడైతే ప్రజల భద్రత ఎక్కడుంది? పోలీసులు ప్రజలను కాపాడాలి కానీ ఒక మహిళా వైద్యురాలిని ఇలా వేధిస్తే ఎలా? ఆమె గతంలోనే ఫిర్యాదు చేసినప్పుడు చర్యలు ఎందుకు తీసుకోలేదు? రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను కాపాడుతూనే ఉంది. అందుకే పోలీసుల దుర్మార్గాలు పెరిగిపోతున్నాయి‘ అని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యురాలి ఘటనపై కేవలం విచారణకు ఆదేశించి ఊరుకుంటే సరిపోదని.. నిందితులను ఉద్యోగాల నుంచి తొలగించాలని విజయ్ నాందేవరావు డిమాండ్ చేశారు. వైద్యురాలి మెుదటి ఫిర్యాదు పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు.
Also Read: AI smart glasses: అమెజాన్ క్రేజీ ఆవిష్కరణ.. డెలివరీ డ్రైవర్లకు ఏఐ స్మార్ట్ గ్లాసెస్.. క్షణాల్లో డోర్ వద్దకే పార్సిల్స్!
అధికార బీజేపీ స్పందన
వైద్యురాలి ఘటనపై రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, బీజేపీ ఎమ్మెల్సీ చిత్రా వాఘ్ స్పందించారు. ‘ఈ ఘటన దురదృష్టకరం. నేను సతార ఎస్పీతో మాట్లాడాను. ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. నిందితుల్లో ఒకరు సతారాలో లేరు. అతడ్ని పట్టుకునేందుకు పోలీసు టీమ్ ఏర్పాటైంది. త్వరలోనే అరెస్ట్ చేస్తాం‘ అని చెప్పారు. మరోవైపు డాక్టర్ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న అంశం తమ దృష్టికి వచ్చిందని చిత్రా వాఘ్ తెలిపారు. దానిపైనా విచారణ జరపనున్నట్లు పేర్కొన్నారు. మహిళలకు ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన పనిలేదని.. అటువంటి వారికి సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. లేదంటే 112 హెల్ప్ లైన్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. మరోవైపు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.
